తిరుపతి, సెప్టెంబర్ 11, (way2newstv.com)
జిల్లాలో బ్రాయిలర్ కోడిపిల్లల ధరలను హ్యాచరీస్ వారు ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారు. కోళ్లకు సంబంధించిన వ్యాధుల నివారణకు కంపెనీలు పంపిణీ చేసే మందుల ధరలను వారే నిర్ణయిస్తున్నారు.కోళ్లదాణా విషయంలో నాణ్యతలేని దాణాను కంపెనీలు రైతులకు అందిస్తున్నాయి. బ్రాయిలర్ కోడిపిల్లలకు వేసే టీకాలైన లసోట, వీబీడీ, జెంటామైసిన్‌లను ప్రైవేటువారు నిపుణుల చేత వేయించడం లేదు. వాటిని రైతులకిచ్చి వెళుతుండడంతో.. అనుభవం లేని రైతులు టీకాలు సక్రమంగా వేయక కోడిపిల్లలకు వ్యాధుల బాధ తప్పడంలేదు. హ్యాచరీలు రైతులకు సరఫరా చేసే కోడిపిల్లల్లో కొంతశాతం బలహీనమైన వాటిని ఇచ్చేస్తున్నారు.
యదేఛ్చగా ధరలు పెంచేస్తున్న హ్యాచరీస్
సాధారణంగా నాణ్యమైన కోడిపిల్ల 40 గ్రాముల బరువు ఉండాలి. అయితే కంపెనీ అందించే కోడిపిల్లల్లో 30శాతం పిల్లల బరువు 30 నుంచి 35 గ్రాములుగానే ఉంటోది. దీంతో కోళ్లపెంపకం రైతులకు నష్టం తప్పడం లేదు. ఫలితంగా కోళ్ల మరణాల శాతం పెరిగి ఎఫ్‌సీఆర్ (ఫీడ్ కన్వర్షన్ రేషియో) పెరగడంతో రైతులకు కంపెనీలు చెల్లించే ధరలు తగ్గుతున్నాయి. 40 నుంచి 50 రోజుల పాటు రైతు కోడిపిల్లలను పెంచినందుకు కిలోకు రూ 5కు పైగా అందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కిలోకు రూ.4 కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని కోళ్ల రైతుల సమస్యలపై బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడను కలిసి విన్నవించారు. దీనిపై స్పందించిన ఆయన, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెటర్నరీ డైరెక్టర్ సోమశేఖర్ చిత్తూరు పశుసంతతి పరిశీలన పథక సహాయసంచాలకులు డా.షేక్ అసీఫ్‌తో ఏకసభ్య కమిటీని నియమించారు. ఆయన జిల్లాలోని బ్రాయిలర్ కోడిపిల్లల పెంపకదారులైన రైతుల బాధలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు ప్రైవేటు హ్యాచరీల వ్యవహారాలను గమనించి నివేదికను పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి రెండ్రోజుల క్రితం సమర్పించారు. వారు ప్రభుత్వానికి ఈ నివేదికను పంపారు.
Tags:
Andrapradeshnews