చెవిపోగుల కేంద్రం
తిరుమల కల్యాణవేదికలో ఉన్న చెవిపోగుల కేంద్రంలో నిత్యం కనిపించే దృశ్యమిది. శ్రీవారి బ్రహ్మోమత్సవాల సందర్భంగా ఈ చెవిపోగుల కేంద్రంపై ప్రత్యేక కథనం. జగత్తును కాచి కటాక్షించే కోనేటిరాయుని సన్నిధిలో శుభకార్యాలు జరుపుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల మెండైన విశ్వాసం. అందుకే తిరుమల క్షేత్రం తలనీలాలు సమర్పించుకునే భక్తులు, కాలినడకన తిరుమలకు చేరుకునేవారు, తులాభారం సమర్పించేవారు, వివాహాలు జరుపుకునే నవదంపతులతో కళకళలాడుతుంటుంది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం
ఆ కోవకే చెందుతుంది తిరుమలలోని పాపవినాశనం మార్గంలో ఉన్న కల్యాణవేదికలోని చెవిపోగుల కేంద్రం.తిరుమలలో పుట్టువెంట్రులు సమర్పించాక, తమ సంతానానికి చెవిపోగులు కుట్టించుకుంటారు భక్తులు. తిరుమలకు తరలివచ్చే భక్తుల్లో ఎక్కువమంది తమ పిల్లల తలనీలాలు సమర్పించడంతో పాటు చెవిపోగులు కూడా కుట్టించే ఆచారాన్ని పాటిస్తుంటారు. ఇందుకోసమే టిటిడి పిల్లలకు చెవిపోగులు కుట్టించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ మొత్తం 17మంది ఆచారులు పనిచేస్తారు. వీరిలో ఒక మహిళకూడా చెవిపోగులు కుట్టడం విశేషం. చెవిపోగులు కుట్టించుకోవడానికి 50రూపాయల టిక్కెట్ తీసుకోవాలి. అనంతరం మనం తీసుకువచ్చిన పోగులను సుశిక్షితులైన ఆచారులు ఎంతో చాకచక్యంగా పిల్లలకు కుడతారు. ఈ చెవిపోగులు కుట్టేవారికి టిటిడి బస్సుపాసులు, గుర్తింపుకార్డులు అందచేస్తుంది. ఇక కాటేజీలవద్దకే చెవిపోగులు కుట్టేవారు రావాలంటే మాత్రం 100 రూపాయలు చెల్లించాలి. 1979లో ప్రారంభమైన ఈ చెవిపోగులు కుట్టే కేంద్రంలో భక్తులు తమ చిన్నారులకు చెవిపోగుల కుట్టించుకుని మొక్కులు తీర్చుకుంటారు.