నామినేటెడ్ పదవులు.. ఎమ్మెల్యేలకు టెన్షన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నామినేటెడ్ పదవులు.. ఎమ్మెల్యేలకు టెన్షన్

గుంటూరు, అక్టోబరు 10, (way2newstv.com )
వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమ జిల్లా, నియోజకవర్గం పరిధిలోని నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు కారణం. నామినేటెడ్ పోస్టుల భర్తీకి జగన్ ఓకే చెబితే ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? తమ అనుచరులకు పదవులు ఇచ్చే ఛాన్స్ వచ్చింది కదా? అన్న అనుమానం రావచ్చు. కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ తమకు తలనొప్పి తెచ్చి పెడుతుందని ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయ కమిటీలతో, మార్కెట్ కమిటీ పాలకవర్గాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ముఖ్యంగా మార్కెట్ కమిటీలకు విపరీతమైన గిరాకీ ఉంది. 
 నామినేటెడ్ పదవులు.. ఎమ్మెల్యేలకు టెన్షన్

మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎదిగిన వారు అనేక మంది ఉండటంతో ఈ పదవులకు డిమాండ్ పెరిగింది. గత ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ విజయానికి శ్రమించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 నియోజకవర్గాలను గెలుచుకుందిఅయితే నామినేటెడ్ పోస్టుల భర్తీలో జగన్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు కేటాయించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తమ ప్రధాన అనుచరులకు అనేక చోట్ల ఎమ్మెల్యేలు పదవులు ఇవ్వలేకపోతున్నారు. ఎన్నికల్లో కష్టపడిన వారిని గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అగ్రనాయకత్వం చెబుతున్నప్పటికీ వారిని ఎంపిక చేయడం వైసీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఒకరిని ఎంపిక చేస్తే మరొకరు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.ఈ పరిస్థితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు మంత్రి మోపిదేవి వెంకటరమణ వద్దకు చేరుకుని తమ గోడు చెప్పుకున్నారట. నిబంధనలతో తమ అనుచరులకు పదవులు ఇవ్వలేకపోతున్నామని ప్రకాశం,గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు మోపిదేవి ముందు వాపోయారట. అయితే మోపిదేవి మాత్రం నిబంధనలను ఎట్టిపరిస్థితుల్లో సడలించలేమని, దానికి అనుగుణంగానే ఎంపిక చేసి జాబితాను పంపాల్సి ఉంటుందని తెలపడంతో వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు డీలా పడ్డారట. నామినేటెడ్ పోస్టుల భర్తీతో వైసీపీలో అసంతృప్తులు రగులుకుంటాయన్నది ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి విన్పిస్తున్న మాట. మరి దీనిని పరిష్కరించుకునే బాధ్యత కూడా సంబంధిత ఎమ్మెల్యేపైనే ఉంటుందని పార్టీ అగ్రనాయకత్వం మొహం మీదనే చెప్పి పంపేస్తుందట.