గుంటూరు, అక్టోబరు 9 (way2newstv.com)
ఏపీ బీజేపీ వ్యూహం .. వ్యూహం.. అంటూనే పద్మవ్యూహంలో చిక్కుకుపోతోందా? ఏపీ కమలనాథులు తమ బుర్రలకు పదును పెంచడం లేదా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం బీజేపీ ఏపీలో ఎదగాలని చూస్తోంది. ఇటీవల జరిగిన ఎన్ని కల్లో ఈ పార్టీ ఎదుర్కొన్న పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి మాత్రం బీజేపీని ఇక్కడ కుదిరితే.. అధికారంలోకి లేదా .. కనీసం ప్రధాన ప్రతిపక్షం స్థాయికి చేర్చాలనే వ్యూహంతో బీజేపీ పెద్దలు స్కెచ్ గీస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని అభివృద్ధి చేసేందుకు ఏపీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీల నేతలకు గేలాలు వేస్తున్నారు.
ప్రధాని టూర్ పైనే బీజేపీ ఆశలు
ఇవన్నీ ఇలా ఉంటే.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వచ్చి.. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా ను ప్రారంభించే కార్యక్రమానికి స్థానిక బీజేపీ నేతలు మోకాలడ్డుతున్నారనే వార్తలు రావడం గమనార్హం. అంటే.. ప్రధాని వచ్చి.. ఈ భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే.. జగన్ సర్కారుకు ఏదో పెద్ద రేంజ్ వచ్చేస్తుందని, బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని రాష్ట్ర కమలనాథులు భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, వాస్తవంగా ఆలోచిస్తే.. ప్రధాని నరేంద్ర మోడీ రావడం ఇప్పుడు ఏపీకి అత్యంత అవసరం. ముఖ్యంగా ఆయన రాక.. బీజేపీకి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు.కేంద్రం ఏపీకి ఇచ్చిన, ఇస్తున్న వాటిని నేరుగా ప్రధాని నోట చెప్పించే ప్రయత్నం చేసి ఉంటే.. బీజేపీకి మంచి జరుగుతుందని అంటున్నారు. అదే సమయంలో ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీపైనా ఆయన నోటి ద్వారా వినిపించి ఉంటే బాగుంటుందని అంటున్నారు. ఇక, అత్యంత కీలకమైన నాయకుల చేర్పు, మార్పుపై ప్రధాని మోడీ పర్యటన అత్యంత ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏపీ బీజేపీపై ప్రధాని మోడీ పెద్దగా దృష్టి పెట్టలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది నాయకులు పార్టీలో చేరాలని అనుకున్నా.. దూరం అవుతున్నారు.ఏపీలో బీజేపీ పుంజుకోవడం కల్లేనని అనుకునేవారు కూడా ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటి వారి అభిప్రాయాలను తుడిచిపెట్టేలా ప్రధాని పర్యటనను తమకు అనుకూలంగా మలుచుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అలా కాకుండా కేవలం జగన్ కోణంలోనే చూస్తూ.. ప్రధాని పర్యటనను అడ్డుకుంటే.. అది బీజేపీకి తీరని శాపంగా మారుతుందని కూడా అంటున్నారు. మరి బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవం గ్రహించి.. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారో లేదో చూడాలి.