విజయవాడ, అక్టోబరు 16, (way2newstv.com)
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే విషయం తెలిసిందే. బహుశ ఈ సూత్రాన్ని అనుసరించారేమో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఏరికోరి పాత మిత్రులతో కూటమికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన పరోక్షంగా బయటపెట్టేశారు కూడా. తాను కేంద్రంలోని బీజేపీతో విభేదించి తప్పుచేశానని చెంపలేసుకున్నారు. అదే సమయంలో పవన్‌తో విభేదాల ను కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఆ తప్పు మరోసారి చేయబోనని ప్రకటించారు. దీనిని బట్టి చంద్రబా బు ఆలోచన మాత్రం కుదిరితే.. ఇప్పటికిప్పుడే.. ఆయన అటు బీజేపీతోను, ఇటు జనసేనతోనూ పొత్తుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది.
పాత మిత్రులతో జతకు చంద్రబాబు ప్రణాళికలు
అయితే, ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలనే చంద్రబాబు నైజానికి అటు బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ `ఊ` అంటాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ రెండు పార్టీలను ఒక్కసారి పరిశీలిస్తే.. అధికారమే పరమావధిగా అడుగులు వేస్తున్న పార్టీ కేవలం బీజేపీనే. తాను అధికారం కోసం రాలేదని, కనీసం పాతికేళ్లు ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలపై పోరాటం చేసేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తానని ప్రకటించిన జనసేనాని పవన్ ప్రకటన ఇక్కడ ప్రస్థావనార్హం. ఇటీవల ఎన్నికల్లో ఆశించిన మేరకు సీట్లు దక్కక పోయినా.. పవన్ ఎక్కడా దిగాలు పడలేదు.తన పార్టీ నుంచి జంపింగులు జరుగుతున్నా.. ఆయనలో ఎక్కడా గాబరా కనిపించలేదు. సో.. దీనిని బట్టి పవన్.. అధికారం కోసం టీడీపీతో చేతులు కలుపుతాడని భావించలేమని అంటున్నారు పరిశీలకులు. ఇక, బీజేపీ విషయానికి వస్తే.. అధికారం కోసం అర్రులు చాస్తున్న పార్టీగా దీనిని పేర్కొనవచ్చు. అదే సమయంలో ఒకరితో పొత్తు పెట్టుకుని తప్పు చేయరాదనేది పార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది. 2014లో పొత్తు పెట్టుకున్న టీడీపీ తమ వల్ల గెలిచిందని చెప్పుకొనే కమల నాథులు .. సొంతంగానే పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు.పైగా గతంలో మోడీ హఠావో.. అని చంద్రబాబు పిలుపు నివ్వడాన్ని కేంద్రంలోని పెద్దలు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. తన మాటకు ఎదురు చెప్పేవారిని సహించే గుణం మోడీకి లేదని ఆయనతో చనువుగా మెలిగిన నాయకులు చెప్పే మాట. ఇలా ఎలా చూసుకున్నా.. బీజేపీ ధోరణికి, చంద్రబాబు ధోరణికి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. చంద్రబాబు మళ్లీ ఎన్డీఏ గూటికి వచ్చే ప్రయత్నం చేసినా తాము చేర్చుకోమని అమిత్ షా ఇప్పటికే చెప్పేశారు. తలుపులు టీడీపీకి మూసేశామని ఎన్నికలకు ముందు షా చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త మైత్రి కోసం పాత మిత్రులతో కలిసేందుకు చేతులు చాచినా.. అందుకునేందుకు వారెవరూ సిద్ధంగా లేరనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.