దారి మళ్లుతున్న హోర్డింగ్స్ ఆదాయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దారి మళ్లుతున్న హోర్డింగ్స్ ఆదాయం

అనంతపురం, నవంబర్ 30, (way2newstv.com)
అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా భారీ హోర్డింగ్‌లు, బోర్డులు కనిపిస్తుంటాయి. వాటిపై అడ్వర్‌టైజ్‌మెంట్లు కళకళలాడుతుంటాయి. కానీ నగరపాలక సంస్థకు చెందాల్సిన ప్రచార పన్ను అందకపోగా ఖజానా వెలవెలబోతుంటుంది. టీడీపీ హయాంలో ఐదేళ్లూ ప్రచార పన్నుకు భారీగా కన్నం వేసినట్లు తెలుస్తోంది. యాడ్‌ ఏజెన్సీ నిర్వాహకులకు అధికారులు, అప్పటి పాలక వర్గంలోని నేతలు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏటా జనాభాకు అనుగుణంగా పన్ను పెంచాల్సి ఉన్నా.. గత పాలక వర్గం ఐదేళ్లూ ఎలాంటి మార్పు చేయకపోవడంతో నగరపాలక సంస్థ ఖజానాకు చేరాల్సిన రూ.లక్షల ఆదాయం ఇతరుల జేబుల్లోకి వెళ్లిపోయింది. నగరపాలక సంస్థ పరిధిలో ప్రకటనల బోర్డులపై ఏటా లైసెన్స్‌డ్‌ యాడ్‌ ఏజెన్సీ నిర్వాహకులు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. 
దారి మళ్లుతున్న హోర్డింగ్స్ ఆదాయం

టీడీపీ హయాంలో నగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడిన ఐదు నెలల తర్వాత ప్రచార పన్ను చెల్లింపునకు గెజిట్‌ తయారు చేసి, కౌన్సిల్‌ అనుమతులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక చదరపు మీటరు వైశాల్యం గల స్థలంలో దీపాలు అమర్చకుండా ఏర్పాటు చేసే ప్రకటనకు రూ.500, ఒక చదరానికి మించితే రూ.800, ఇలా ప్రతి అదనపు 2.50 చదరపు మీటరుకు రూ.800 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. అలాగే 5 చదరపు మీటర్లకు రూ.2,800 వసూలు చేయాలని గెజిట్‌లో పొందుపరిచారు.ఇక 5 చదరపు మీటర్ల స్థలంలో దీపాలు అమర్చిన వాహనాలపై బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తే బోర్డుకు రూ.5 వేలు, 0.50 చదరపు మీటర్ల స్థలంలో తెరపైన ల్యాండర్న్‌ స్లైడ్స్‌ ప్రకటనలకు(పబ్లిక్‌ప్లేస్‌) రూ.2 వేలు, 0.50 చదరపు మీటర్ల నుంచి 2.50 చదరపు మీటర్లకు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. సినిమా హాల్‌లో స్లైడ్స్‌కు(కలర్, కలర్‌ లేనివి) రూ.1,300, షార్డు(ట్రైలర్‌ ఫిలిం సహా 150మీ) రూ.4,000, షార్టు ట్రైలర్‌ ఫిలిం 150 మీటర్ల నుంచి 300 వరకు రూ.9 వేలు చెల్లించాలని గెజిట్‌లో పేర్కొన్నారు. కానీ పన్ను వసూళ్లపై కనీస దృష్టి సారించలేదు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో ప్రచారానికి హోర్డింగ్‌లు, బోర్డుల ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తిగల వారిని ఆహా్వనించి వేలంపాట నిర్వహిస్తారు. కానీ టీడీపీ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు వేలంపాటను పూర్తిగా రద్దు చేశారు.నగరంలో 20 యాడ్‌ ఏజెన్సీలుండగా ఆయా ఏజెన్సీల పరిధిలో 258 బోర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అనధికారికంగా మరో 10 ఏజెన్సీలు నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండానే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా మరో 250 హోర్డింగ్‌లు అనధికారికంగా వేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా రూ.లక్షల్లో నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. ప్రస్తుతం నగరపాలక సంస్థలో కొన్ని యాడ్‌ ఏజెన్సీల నిర్వాహకులు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో కుమ్మక్కయ్యారు. రూ.వేలల్లో మామూళ్లిచ్చి రూ.లక్షల్లో పన్ను ఎగ్గొడుతున్నారు.  టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఓ టీపీఓ  (కీలక అధికారి), మరో ఇద్దరు టీపీఎస్‌ల నిర్వాకంతోనే ఈ అక్రమ బాగోతం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో యాడ్‌ ఏజెన్సీ విధానాన్ని వేలం పాటలో నిర్వహించకుండా వివిధ కమర్షియల్‌ ప్రాంతాలకు టీపీఎస్‌లే పంచుకున్నారు. వారి పరిధిలోనే యాడ్‌ ఏజెన్సీ నిర్వహణ జరిగేలా చూసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గత పాలకులు, అధికారులు మీకు..మాకు అన్న ధోరణిలో నగరపాలక సంస్థ ఆదాయానికి గండికొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదే సదరు కీలక అధికారి, టీపీఎస్‌లు వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లగా వారు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.