ఇంగ్లీషుపై జనసేనాని అనవసర రాద్దాంతం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంగ్లీషుపై జనసేనాని అనవసర రాద్దాంతం

అనంతపురం, నవంబర్ 28, (way2newstv.com)
పవన్ కళ్యాణ్ రాజకీయమే అలా సాగుతోంది. సినిమా నటుడిగా పీక్స్ లో ఉన్న వేళ రాజకీయం అనడమే ఒక రాంగ్ అనుకుంటే వచ్చిన తరువాత సీరియస్ పాలిటిక్స్ చేయకుండా పార్ట్ టైం చేయడం మరో రాంగ్ స్టెప్. పోనీ చేసిందేందో తానే సొంతంగా చేస్తున్నానని అనిపించుకోకపోవడం పొరపాటు రాజకీయం. ఇక 2019 ఎన్నికల్లో పొత్తులు లేవంటూ చెప్పి ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ అధినాయ‌కుని, ఆయన గారి వారసుని సీట్ల వైపు కన్నెత్తి చూడకుండా ప్రచారం చేయడం మరో తడబాటు. సరే ఇవన్నీ జనానికి అర్ధమై తన పార్టీతో పాటు తానూ రెండు సీట్లలో ఓడాక కూడా నిజాలు తెలుసుకోకపోవడం కూడా రాంగ్ రూటే. 
ఇంగ్లీషుపై జనసేనాని అనవసర రాద్దాంతం

ఇక ఇపుడు అ అంటే అమరావతి, ఇ అంటే ఇసుక, ఇ అంటే ఇంగ్లీష్ అంటూ బాబు బాటలో నడవడం విచిత్ర రాజకీయం. ఇపుడు బాబు సైడ్ అయిపోయినా కూడా ఇంగ్లీష్ పై పోరాటం అంటూ చేయడమే వింతలో కెల్ల వింత రాజకీయం. టీడీపీ తమ్ముళ్ళు ఇసుక కొరత అన్నారు. ఇపుడు టన్నులకు టన్నుల ఇసుక దొరికేస్తోంది. మధ్యలో జగన్ సర్కార్ జారీ చేసిన జీవో మూలంగా ఇంగ్లీష్ బోధనను పెద్ద ఇష్యూగా చేద్దామనుకుని మొదట ప్రయత్నం చేసింది చంద్రబాబే. దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి వచ్చారు. చంద్రబాబు ఒక మాట అంటే రెండు మాటలతో ఇంగ్లీష్ పై పవన్ కళ్యాణ్ గట్టిగానే తగులుకున్నారు. నిజానికి ఇంగ్లీష్ బోధన ప్రజలు వద్దు అనుకుంటూ ఈ పాటికే పెద్ద ఉద్యమం వచ్చేసేది. కానీ జనాభిప్రాయం మరోలా ఉంది. తమకూ పైసా ఖర్చు లేకుండా ఇంగ్లీష్ చదువులు సర్కార్ బడులలో కావాలనుకుంటున్నారు. సర్వేలు సైతం ఇదే చెబుతున్నాయి. పైగా మీ పిల్లలు ఇంగ్లీష్ లో చదువుకోవాలా మా పిల్లలు మాత్రం మట్టికొట్టుకుపోవాలా అంటూ అట్టడుగు జనం గుస్సా అవుతున్నారు. దీనికి మతం రంగు పూయాలన్నా కూడా అసలు వర్కౌట్ కాలేదు. దాంతో విషయం అర్ధమైన చంద్రబాబు మేము ఇంగ్లీష్ మీడియం వద్దనలేదు, తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి అంటున్నారు. అది సర్కార్ జీవోలోనే ఉంది. అంటే బాబు యూటర్న్ తీసుకున్నట్లే లెక్క. ఇపుడు కూడా పవన్ కళ్యాణ్ తగ్గకుండా ఇంకా ఇంగ్లీష్ అని రోడ్డెక్కడానికి రెడీ అవడమే రాంగ్ రాజకీయమంటేనూ.తెలుగు భాషను బతికించడానికి ఉద్యమం చేయడం వేరు. ఇంగ్లీష్ బోధన ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు అందిస్తామంటే అడ్డుకోవడం వేరు. నిజానికి తెలుగుని బతికించాలంటే ప్రభుత్వ పాఠశాలలతో కుదిరేది కూడా కాదు, ప్రైవేట్ స్కూళ్ళ మీద ఎవరైనా ఉద్యమం చేయగలరా. అక్కడ తెలుగు కూడా ఒక పాఠ్యాంశంగా పెట్టమని డిమాండ్ చేయగలరా. సరే పిల్లల మీద ప్రయోగాలు, రాజకీయాలు పక్కన పెడితే భాష బతకడానికి ఏంచేయాలో మేధావులు, భాషావేత్తలు తెలుసుకోవాలి. ఇంతవరకూ బాష విషయంలో వారు ఏం చేశారో కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి సర్కార్ బడులలో చదువుకునే ముప్పయి, నలభై శాతం పిల్లల మీద ప్రతాపం చూపడమంటేనే జనం వ్యతిరేకిస్తున్నారు.అసలు సినిమాల్లో నుంచి వచ్చిన నటుడిగా పవన్ కళ్యాణ్ చెప్పాలి.అక్కడ తెలుగు ఎంత చక్కగా వర్ధిల్లుతోందో. ఇక రాజకీయ నాయకులు తాము పార్లమెంట్ లో ఏ భాష మాట్లాడుతున్నారో కూడా చెప్పాలి. మేధావులు ఇంగ్లీష్ మోజుని ఎందుకు విడవడంలేదో కూడా చెప్పాలి. ఇవన్నీ ఇలా ఉంచుకుని కేవలం రాజకీయం కోసం ఇంగ్లీష్ వద్దు అంటే జనంలో వచ్చే వ్యతిరేకతకు ఎవరైనా బలి కాక తప్పదు. పవన్ కళ్యాణ్ తెలుగు అభిమానాన్ని కాదనలేరు కానీ ఆయన చేయాల్సిన ఉద్యమం పిల్లల భవిష్యత్తు మీద కాదు, భాషను బతికించేందుకు పెద్ద ఉద్యమమే చేయాలి. అలా కాకుండా రాంగ్ రూట్లో వెళ్తే ఇబ్బందులు తప్పవేమో.