ప్రయోగత్మకంగా ఆలయాలు, నర్సరీల్లో అమలు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 5 (way2newstv.com):
ప్లాస్టిక్ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, దాని నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం అరణ్య భవన్ లో జీఎస్ గ్రీన్ బయో డిగ్రేడబుల్ సంస్థ రూపొందించిన కంపోస్టబుల్ బ్యాగ్స్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. మొక్క జొన్న పిప్పితో తయారు చేసిన కాంపోస్టాబుల్ బ్యాగ్స్, గ్లాస్ లు, కప్స్ 180 రోజుల్లోనే సులభంగా మట్టిలో కలిసిపోతాయని సంస్థ ప్రతినిదులు మంత్రికి వివరించారు.
పర్యావరణహిత బ్యాగుల వినియోగంపై దృష్టి
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణహిత బ్యాగుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని, ముందుగా ప్రయోగత్మకంగా కొన్ని ఆలయాలు, నర్సరీల్లో కంపోస్టబుల్ బ్యాగ్స్ వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకానికి ప్లాస్టిక్ కవర్లను వాడతారని, దానికి బదులు పర్యావరణహిత సంచులను వాడేలా చూస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్, కాలుష్య నియంత్రణ మండలి మెంటర్ సెక్రటరీ అనిల్ కుమార్, జీఎస్ గ్రీన్ బయో డిగ్రేడబుల్ సంస్థ ప్రతినిదులు గోపు సదానంద్, అనూప్ చారి, తదితరులు పాల్గొన్నారు.