ఒంగోలు, డిసెంబర్ 7, (way2newstv.com)
రాజకీయాల్లో ఏ నాయకుడు ఎప్పుడు ? ఏ పార్టీ మారతాడో చెప్పడానికి అవకాశం లేని రోజులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతున్నారంటూ.. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. ఇక, ఇప్పుడు మరింత మందిని పార్టీకి రాజీనామా చేయించడం ద్వారా టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేయాలని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలకు వైసీపీ వల విసిరింది.ప్రకాశం జిల్లాలో టీడీపీ తరఫున నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వీరిలో ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మరోకరు ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడు.
ప్రకాశంలో మరింత స్ట్రాంగ్ గా ఏలూరు
వీరిలో ఇద్దరు కమ్మ వర్గానికి చెందిన నాయకులు వైసీపీకి అనుకూలంగా ఉండేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బాలినేని శ్రీనివాస్, కొడాలి నానితో ఈ ఇద్దరికీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలు పార్టీ మారేందుకు రెడీ అయ్యారనే సంకేతాలు వస్తున్నాయి.ఇక, మిగిలిన మరో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విషయం చర్చకు వస్తోంది. ఏలూరి సాంబశివరావుపై కూడా ఆయన సామాజిక వర్గానికే చెందిన మంత్రి కొడాలి నాని ద్వారా గేలం వేసిందట వైసీపీ. ఏలూరి మాత్రం ఖరాఖండీగా తాను టీడీపీలోనే ఉంటానని చెప్పేశారట. ఆయన పార్టీ మారతారని ప్రచారం అయితే జరుగుతున్నా.. అందుకు తగ్గకారణాలు మాత్రం కనిపించడం లేదు. ఏలూరు సాంబశివరావు వివాదాలకు దూరంగా ఉంటూ నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. అదే సమయంలో ఆయన టీడీపీలోనే కొనసాగుతారని చెప్పేందుకు బోలెడు కారణాలు కనిపిస్తున్నాయి. ఆయనకు టీడీపీ రెండు సార్లు టికెట్ ఇచ్చి గెలిచేలా ప్రోత్సహించింది. కోరినన్ని నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటును అందించింది. దీంతో బలమైన నాయకుడిగా ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్నారు.ఇంత వ్యతిరేకత లోనూ చంద్రబాబు తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఓడించడంతో రాజకీయ వర్గాల్లోనే ఆయన హైలెట్ అయ్యారు. ఇక, ఆయన వ్యాపారాలు అన్నీ కూడా తెలంగాణలోను, హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఏపీలో ఏ ఒక్కటీ లేదు. పోనీ.. ఏపీ ప్రభుత్వం వేధిస్తుందని చెప్పడానికి. తెలంగాణలోనూ ఆయనకు రాజకీయ గురువు అయిన నామా నాగేశ్వరావు ఖమ్మం ఎంపీగా టీఆర్ఎస్ పార్టీలో చక్రం తిప్పుతున్నారు. కాబట్టి ఆయన ఆశీస్సులు ఏలూరి సాంబశివరావుకి పుష్కలంగా ఉన్నాయంటున్నారు.ఇక నియోజకర్గంలో అటు లీడర్‌గాను, ఇటు పార్టీ పరంగాను ఏలూరి సాంబశివరావు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతే ఏలూరి సాంబశివరావుకు చంద్రబాబు దగ్గర ఇంకా ప్రయార్టీ పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఏలూరి సాంబశివరావు పార్టీ మారడన్నది క్లారిటీ వచ్చేసింది.