మల్టీ నేషనల్ కంపెనీల చేతిలో మొక్క జొన్న రైతు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మల్టీ నేషనల్ కంపెనీల చేతిలో మొక్క జొన్న రైతు

రాజమండ్రి, డిసెంబర్ 18, (way2newstv.com)
గోదావరి లంక భూముల్లో మొక్కజొన్న విత్తన సాగు ఒక విషవలయంగా మారిపోతోంది. ఇక్కడి భూముల్లో రైతులకు పెట్టుబడులు పెట్టి మొక్కజొన్న సాగుచేయిస్తున్న పలు బహుళజాతి కంపెనీలు కారుచౌకకు ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్నాయి. అదే ఉత్పత్తిని ప్రాసెసింగ్, ప్యాకింగ్ అనంతరం భారీ ధరలకు విక్రయిస్తున్నాయి. మొత్తం మీద మొక్కజొన్న విత్తన సాగులో అహరహం శ్రమించే రైతులు ఘోరంగా చిత్తవుతున్నారు. వివరాల్లోకి వెళితే... గోదావరి నదీ జలాలతో పూనీతమై సారవంతమైన లంక భూములు ఇపుడు విత్తన రంగంలోని కొన్ని బహుళజాతి కంపెనీలకు ప్రయోగ క్షేత్రాలుగా మారాయి. గోదావరి నదీ తీరంలోని లంకల్లో సాగు చేసిన విత్తనాలే దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో మార్కెటింగ్ జరుగుతోంది. 
మల్టీ నేషనల్ కంపెనీల చేతిలో మొక్క జొన్న రైతు

ఇక్కడి రైతులకు బహుళజాతి కంపెనీలు పెట్టుబటి పెట్టి మొక్కజొన్న సాగుచేయిస్తున్నాయి. విత్తనం నుండి ఎరువులు, పురుగుమందుల వరకు ఆయా సంస్థలే రైతులకు అందిస్తాయి. దిగుబడి వచ్చాక పంటను రైతుల నుండి కొనుగోలుచేస్తుంటాయి. ఇందులో గతంలో పెట్టిన పెట్టుబడిని మినహాయించుకుని, మిగిలిన మొత్తం రైతులకు చెల్లిస్తుంటాయి. ఇంతవరకు బాగానేవున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, రైతులకు చెల్లించే ధరకు, ఆయా సంస్థలు మార్కెట్‌లో విక్రయించే ధరకూ హస్తిమశకాంతరం ఉంటోంది. రైతులు సాగు చేసిన మొక్కజొన్నను కిలో రూ.17 చొప్పున బహుళ జాతి కంపెనీలు కొనుగోలు చేసి అదే మొక్కజొన్నను ప్రోసెస్ చేసి, విత్తన మొక్కజొన్న గింజలను కేజీ రూ. 300కు మళ్ళీ రైతులకు విత్తన కిట్లుగా అమ్ముతున్నాయి. రైతు పండించిన పంట కేజీ రూ.17 అయితే, అదే విత్తన రూపంలో రూ.300కు రైతులు కొనుగోలు చేసుకుని సాగుచేస్తుంటారు.ఈ విత్తనోత్పత్తి మొక్కజొన్న సాగు రైతులకు కత్తిమీద సాముగా వుంది. చీడపీడల నివారణ మందులు కూడా అతి ఖరీదుగా ఉన్నాయి. మొక్కజొన్నకు వాడే సస్యరక్షణ, క్రిమి సంహారక మందులను కూడా బహుళజాతి కంపెనీలే రైతులకు అరువు ప్రాతిపదికన సరఫరాచేసి ఆనక దిగుబడిలో మినహాయించుకుంటున్నాయి. ఈ విత్తన మొక్కజొన్నకు వినియోగించే కొలాజిన్ అనే పురుగు మందు లీటరు సుమారు రూ.700. ఈ మందును పంట కాలంలో రెండుసార్లు వాడాల్సి వుంది.