ఇబ్రహీంపట్నం జూన్ 26 (way2newstv.com):
ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. బిజెపి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతుందని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బిజెపి సిద్ధంగా ఉందని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మర్రిగూడలో మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ మాట్లాడుతూ.... బిజెపి తలపెట్టిన మార్పు కోసం జన చైతన్య యాత్రకు విశేష స్పందన వస్తుందని, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారని కె లక్ష్మన్ అన్నారు.యాత్రకు పెరుగుతున్న ఆదరణ, స్పందనను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎగతాళిగా మాట్లాడుతున్నారని, కేసీఆర్ తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నట్లు అర్ధమవుతుందన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి మైండ్ గేమ్ మొదలు పెట్టిన కేసీఆర్.. 100 సీట్లు వస్తాయని చెపుతున్నారని, అదే నిజమైతే మరి ఇతర పార్టీల నుంచి నాయకులను ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు.
ముందస్తు ఎన్నికలకు బిజెపి సిద్ధమే - డాక్టర్ కె లక్ష్మన్..బిజెపి యాత్రకు పెరుగుతున్న ఆదరణ ప్రజల దృష్టిని మరల్చడానికి మైండ్ గేమ్ మొదలు పెట్టిన కేసీఆర్... బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్
టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు ఒరిగిందేమీ లేదని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. అనంతరాన్ జరిగిన జరిగిన బహిరంగ సభలో డాక్టర్ లక్ష్మన్ మాట్లాడుతూ..మార్పుకోసం బిజెపి జనచైతన్య యాత్రకు వస్తున్న విశేష స్పందనతో ముఖ్యమంత్రి కేసీఆర్ పీఠం కదులుతున్నదని, సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తన ప్రశ్నలకు మూడు రోజుల్లో సమాధానం చెప్పాలన్నారు. సర్వేల పేరిట కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, 100 సీట్లు వస్తాయని చెబుతున్న సీఎం కేసీఆర్ ఎందుకు ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామన్న కేసీఆర్ మాట ఏమైందని, నాలుగేళ్లు గడిచినా విశ్వనగరం ఊసే ఎత్తడం లేదన్నారు. హైదరాబాద్ నగరంలో రోడ్లపై ఒక్క గుంత కనిపించిన నగదు బహుమతి ఇస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్.. ఇవాళ రోడ్లపై గుంతలపై ఏం సమాధానం చెబుతారని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కార్‌కు ఎలా కర్రుకాల్చి వాత పెట్టాలో తెలంగాణ ప్రజానీకానికి బాగా తెలుసని, మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్న టీఆర్ఎస్ కు ప్రజలు తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మజ్లిస్ పార్టీ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. ముందస్తు ఎన్నికలొచ్చినా బిజెపి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, ఇబ్రహీంపట్నం సభలో డాక్టర్ లక్ష్మన్ పునరుద్ఘాటించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తక్షణం ఎన్నికలకు రావాలని డాక్టర్ లక్ష్మన్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్.. ఈ నాలుగేళ్లలో ఎందరికి ఉద్యోగాలిచ్చారని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు.రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్రృహల్లో కూరుకుపోయారని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. ఎక్కడో ఎర్రవెల్లిలో ఇళ్లు కట్టించిన రాష్ట్రమంతా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించామని చెప్పుకోవడవం సిగ్గుచేటని, జర్నలిస్టులను సైతం ఇళ్లపేరిట మోసం చేశారని కేసీఆర్‌పై డాక్టర్ లక్ష్మన్ ధ్వజమెత్తారు. కోటి ఎకరాలను సాగునీరు, ఇంటింటికి తాగునీరు, కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి హామీలను తుంగలో తొక్కారని, నాలుగేళ్లయినా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ఎందుకు నెరవేర్చలేదని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు. ప్రజాప్రయోజనాలను విస్మరించి కేవలం కాంట్రాక్టర్లు, నాయకుల జేబులు నింపే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంట పథకాలపైనే దృష్టి పెట్టారని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తామని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి పీఠమెక్కి దళితులను దగా చేశారన్నారు. మోదీ నాలుగేళ్ల పాలనలో పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేశారని, వివిధ అభివృద్ధి పథకాలతో దేశంలో పేదరికాన్ని నిర్మూళించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి సుకన్య యోజన, ఎస్సీ, ఎస్టీ యువత కోసం ముద్రా యోజన, ప్రభుత్వ పథకాలు నేరుగా పేదలకు చేరేందుకు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ప్రధాని ఆవాస్ యోజనతో పాటు.. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు 12 వేల రూపాయాలు ఇస్తున్నారని, ఇప్పటికే దేశంలో ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చి వాటికి మహిళల ఆత్మగౌరవ నిలయాలుగా నామకరణం చేశారన్నారు. వంటింట్లో కట్టెల పొయ్యితో వంట చేస్తూ.. కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లులకు ఇక అలాంటి కష్టాలు ఉండకూడదన్న ఉద్దేశంతో దేశంలోని 8 కోట్ల పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని, తెలంగాణలో 20 లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. మోదీ అమలు చేస్తున్న ప్రజాకర్షక పథకాల వల్లే ఇవాళ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిజెపి విజయబావుటా ఎగురవేస్తూ వస్తుందని, ఇవాళ దేశంలోని 21 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉందని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. సబ్ కా సాథ్- సబ్ కా వికాస్ నినాదంతో అభివృద్ధిలో దూసుకుపోతున్న మోదీ చరిష్మాను చూసి ఓర్వలేని కాంగ్రెస్.. కర్ణాటకలో బిజెపిని అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు జేడీఎస్‌తో అనైతిక పొత్తుకు పూనుకున్నదని, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకే కాంగ్రెస్‌తో జట్టు కట్టామని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామే చెప్పారని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు అనేక నిధులు ఇచ్చిందని, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద కేంద్రం రూ.194 కోట్లు ఇచ్చిందని, అలాగే స్వచ్ఛభారత్ అభియాన్ కింద జిల్లాకు రూ. 6 కోట్లు, హరితహారం కింద రూ.16 కోట్లు, 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు జిల్లాలోని పంచాయతీలకు రూ.76 కోట్లు ఇచ్చిందని, ఈ నిధులన్నీ ఎక్కడ పోయాయని డాక్టర్ లక్ష్మన్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద రూ. 42 కోట్లు, రైతుల భూసార పరీక్షల కోసం కోటిన్నర రూపాయలు, జిల్లాలో పేదలకు 5 వేల ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అభివృద్ధి కోసం రూ.69 కోట్లు, స్వచ్ఛభారత్ అభియాన్ కింద రూ. 77 లక్షలు, మొక్కల పెంపకం కోసం రూ. 5 కోట్లు, గ్రామీణ ప్రాంత పంచాయతీల అభివృద్ధికి రూ. 14 కోట్లు కేంద్రం ఇచ్చిందని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఈ నాలుగేళ్లలో రూ. 88 కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయన తెలిపారు. బిజెపి అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతులకు రణాలు మాఫీ చేస్తామని, రైతులకు ఉచితంగా బోరు బావులు వేయించి ఇస్తామని, రైతు రుణాల వడ్డీలు ప్రభుత్వమే చెల్లిస్తుందని డాక్టర్ లక్ష్మన్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చే ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకే బిజెపి మార్పు కోసం జనచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టిందని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. ఒక్క అవకాశం ఇచ్చి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపికి అధికారం కట్టబెట్టాలని డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు. మంచాల మండలంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, తగిన పరిహారంతో పాటు మృతుల కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డాక్టర్ లక్ష్మన్ డిమాండ్ చేశారు.