అమరావతి, జూన్26, 2018 (way2newsyv.com)
కేంద్రరాష్ట్రాల మధ్య నలుగుతున్న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఇష్యూ.. సుప్రీంకోర్టుకు చేరింది. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని ఏపీ సర్కార్ సుప్రీంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన హామీల అమలుపై కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి ప్రతిగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నవ్యాంధ్రపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గణాంకాలతో సహా వివరించింది ప్రభుత్వం. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, ఆ విషయాన్ని పక్కన బెట్టిందని అఫిడవిట్‌లో కేంద్రం తీరును తప్పుబట్టింది రాష్ట్రప్రభుత్వం. అంతేకాక హోదా ఉన్న రాష్ట్రాలతో సమానంగా పన్ను రాయితీలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టింది. ఈ నాలుగేళ్లలో కేంద్రం సాయం అంతంత మాత్రమేనని కోర్టుకు తెలిపింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నిర్దిష్ట కాలపరిమితిలోగా నెరవేర్చాలంటూ కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ప్రత్యేక హోదా పొందుతున్న ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా అన్నీ ఇస్తామంటూనే ఆంధ్రప్రదేశ్‌పై మాత్రం వివక్షతో వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సమానంగా ప్రయోజనం కలిగే నిధులు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఆచరణలో మాత్రం అలాంటిదేమీ లేదు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ లో ఇదే ప్రధానాంశం.
ఇదీ సంగతి..
ఓ గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే చాలా కష్టించాల్సిన రోజులివి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అలాంటిది. ఏకంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధిలోకి రావాలి. రాజధాని సైతం నిర్మించుకోవాలి. పరిపాలనకు సంబంధించిన ప్రతీ పనినీ కొత్తగా నిర్మించుకోవాలి. అంతేనా.. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని.. పక్కా ప్రణాళికతో క్యాపిటల్ కు పునాదులు వేయాలి. ఇవన్నీ సాకారం కావాలంటే కేంద్రప్రభుత్వం సాయం ఉండాలి. ఈ విషయం తెలిసీ మోడీ సర్కార్..నవ్యాంధ్రను నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్ కావాలన్నది ప్రజల ఆకాంక్ష. ప్రభుత్వ ఆశయమూ అదే. కానీ ప్రజల అభీష్టాన్ని కేంద్రం పట్టించుకోవడంలేదు. గత ఎన్నికల్లో బీజేపీకి ఏపీ జనాలు ఎందుకు ఓట్లు వేశారో కూడా మరచిపోయిందని టీడీపీ నేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. నవ్యాంధ్రకు నిధులు ఇవ్వడం అంటే దేశాభివృద్ధిలో భాగంగానే ఇస్తున్నట్లు. దేశ సమగ్రాభివృద్ధి తమ లక్ష్యమని చెప్పుకునే మోడీ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేసినట్లని చెప్తున్నారు.