ఈ రవాణా పర్మిట్ పై మండిపడుతున్న కొబ్బరి రైతులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈ రవాణా పర్మిట్ పై మండిపడుతున్న కొబ్బరి రైతులు

కాకినాడ, జూలై 5, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన ఈ-రవాణా పర్మిట్ విధానంపై కొబ్బరి వ్యాపారులు భగ్గుమంటున్నారు. ఈ-పర్మిట్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి ఎగుమతులు నిలిపివేశారు. దీంతో తొలి రోజు రెండు జిల్లాల్లో సుమారు రూ.ఐదు కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళితే... ఉభయ గోదావరి జిల్లాల నుండి నిత్యం సుమారు వంద లారీల్లో కొబ్బరికాయలు, కురిడీ కొబ్బరి తదితరాలు వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు లారీల్లో ఎగుమతి చేస్తుంటారు. ఎగుమతుల సందర్భంగా సంబంధిత వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఒక శాతం మార్కెటింగ్ సెస్సు చెల్లించి, పర్మిట్ తీసుకుంటారు. ఈ-పర్మిట్‌పై ఎగుమతులు నిర్వహిస్తుంటారు. 
 
 
 
ఈ రవాణా పర్మిట్ పై మండిపడుతున్న కొబ్బరి రైతులు
 
అయితే ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తిచెబుతూ కొత్తగా ఈ-పర్మిట్ విధానాన్ని నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం కొబ్బరి ఎగుమతులకు సంబంధించిన మార్కెటింగ్ సెస్సును ఆన్‌లైన్‌లో చెల్లించి, పర్మిట్‌ను జనరేట్ చేసుకోవాల్సివుంటుంది. దీనికి కంప్యూటర్ లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోను, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమవుతుంది. సాధారణంగా కొబ్బరి రైతులు, వ్యాపారుల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది. దీనికితోడు కొబ్బరి తోటలు ఉంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో తమను ఇబ్బందుల పాల్జేయడానికే ఈ పర్మిట్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కొబ్బరి వ్యాపారులు, రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తక్షణం ఈ పర్మిట్ విధానాన్ని రద్దుచేయాలనే డిమాండ్‌తో  కొబ్బరి ఎగుమతులు నిలిపివేశారు. పాత పర్మిట్ విధానం తిరిగి ప్రారంభించేవరకూ ఉద్యమిస్తామని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కొబ్బరి, కొబ్బరికాయల ఎగుమతిదారుల సంఘ అధ్యక్షుడు మద్దాల తమ్మారావు తెలిపారు. కొబ్బరి ఎగుమతులకు ప్రధాన కేంద్రమైన తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఈ-రవాణా పర్మిట్ విధానంలో అనేక ఇబ్బందులున్నాయని, వీటివలన వ్యాపారులు అనేక కష్టనష్టాలకు లోను కావాల్సి వస్తుందన్నారు. మొబైల్‌లో నెట్‌వర్క్ లేకపోయినా పర్మిట్ జనరేట్ కాదన్నారు. పాత విధానంలో ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని, ఈ-రవాణా పర్మిట్ వలన అదనంగా వచ్చే లాభం లేదని వివరించారు. కోనసీమ కురిడీ కొబ్బరి కాయల వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పేరి కామేశ్వరరావు మాట్లాడుతూ పెద్దగా చదువుకోని చిన్న వ్యాపారులకు ఈ-రవాణా పర్మిట్ పొందడం అంత సులభం కాదన్నారు. దీనివలన చిన్న, సన్నకారు రైతులకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆదివారం 100 లారీలు కొబ్బరి, కొబ్బరికాయల ఎగుమతులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.5 కోట్ల వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. అలాగే ప్రభుత్వానికి రావలసిన రూ.5 లక్షల మార్కెటింగ్ సెస్సుకు కూడా గండిపడింది. ఈ-రవాణా పర్మిట్ రద్దు చేసి పాత పర్మిట్ విధానం కొనసాగించే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు