రోజా పై నటి వాణీవిశ్వనాథ్ పోటి! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రోజా పై నటి వాణీవిశ్వనాథ్ పోటి!

చిత్తూరు జూలై 5 (way2newstv.com) 
సినీ నటి రోజా ఎమ్మెల్యేగా ఎన్నికైన నగరి నియోజకవర్గాన్ని ఈసారి ఎలాగైన తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రోజాపై పోటీకి దింపే అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాడుతుండగా సినీ నటి వాణీవిశ్వనాథ్ తానున్నానంటూ ముందుకొచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు గతంలో ప్రకటించిన ఆమె ఇప్పుడు ఒకడుగు ముందుకేసి నగరి నుంచి రాజకీయ జీవితం ప్రారంభిస్తానని ప్రకటించి రోజాపై పోటీకి రెడీ అని చెప్పకనే చెప్పేశారు. చంద్రబాబు కూడా తనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కూడా నగరిలో రోజాకు సమవుజ్జీగా వాణీ విశ్వనాథ్ అయితేనే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం.2014ఎన్నికల్లో నగరి నుంచి రోజా గెలిచినప్పటికీ.. 

రోజా పై నటి వాణీవిశ్వనాథ్ పోటి!
ఆమెకు దక్కిన మెజారిటీ మాత్రం అంతంత మాత్రమే. కేవలం 858 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో రోజా గట్టెక్కారు. అవి కూడా మహిళ కావడంతో సానుభూతి కొద్దీ పడిన ఓట్లుగానే టీడీపీ అప్పట్లో అంచనా వేసింది. అందుకే గత ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమను బరిలోకి దింపిన టీడీపీ.. ఆయన అకాల మరణంతో 2019 ఎన్నికల్లో వాణీ విశ్వనాథ్‌కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. గాలి ముద్దు కృష్ణమ నాయుడు భార్య సరస్వతమ్మకు ఎమ్మెల్సీగా అవకాశమివ్వడంతో పార్టీ టికెట్‌పై గందరగోళం నెలకొనే పరిస్థితి లేదని అధిష్ఠానం భావిస్తోంది. రోజాపై మహిళా అభ్యర్థిని నిలబెట్టడమే సరైన నిర్ణయంగా టీడీపీ అంచనా వేస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా పనితీరుపై పెరిగిన వ్యతిరేకత, తమకున్న ఓటు బ్యాంకు చెక్కు చెదరక పోవడమే తమ బలంగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే రోజా మాటల దాడికి ప్రతిగా విమర్శనాస్త్రాలు సంధించే సమర్థత కూడా వాణీ విశ్వనాథ్‌కు ఉందని తెలుగుదేశం ఆశిస్తోంది. పైగా వాణీ విశ్వనాథ్ కూడా సినీ నటి కావడంతో రోజాపై సినీ స్టైల్లో డైలాగ్‌లు పేల్చి ప్రచారాన్ని పసందుగా మార్చే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు గానీ.. నగరి నుంచి రోజా, వాణీ విశ్వనాథ్ తలపడితే మాత్రం రాజకీయం సినీ రంగు పులుముకుని మరింత రంజుగా మారబోతోంది.కాగా తన తండ్రి నిర్ణయించే ముహుర్తం నాటికి టీడీపీలో చేరతానని వాణీ విశ్వనాథ్ ప్రకటించారు.