అగ్రగామి సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాం అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో సీఎం కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అగ్రగామి సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాం అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 16, (way2newstv.com)
తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలం లోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్అన్నారు.  నేడు యావత్ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించింది. సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలాన్నీ నేడు పునరుత్తేజం పొందాయి. బుధవారం నాడు స్వతంత్ర దినోత్సవం సందర్బంగా అయన చారిత్రాత్మకమైన గొల్కోండ కోట లో జాతీయ పతాకాన్ని ఎగురవేసారు.తరువాత అయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మనిషి కేంద్రంగారూపొందిన ప్రణాళికలు పేద వర్గాలకు చేయూత ఇచ్చి నిలబెడుతున్నాయి. సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అండదండలు కల్పిస్తున్నాయి. సకల రంగాలలో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణా ఆనతి కాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. తనను తాను నిర్మించుకుంటూ జాతి నిర్మాణానికి దోహదం చేస్తున్నదని అన్నారు. 
 
 
 
అగ్రగామి సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ
వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాం
అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం
స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో సీఎం కేసీఆర్
 
ఈ నాలుగు సంవత్సరాల విలువైన సమయాన్ని తెలంగాణ భవిష్యత్తుకు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నం. గంభీరమైన దృక్పథంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణా ప్రస్థానం సాగుతున్నది. తెలంగాణాలో వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకున్నది. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించి, రైతులలో ఆత్మ విశ్వాసం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముందుగా 17 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి, రాష్ట్రంలోని 35.29 లక్షల మంది రైతులకు ఉపశమనం కలిగించింది. సమైక్య రాష్ట్రంలో ఎగబెట్టిన ఇన్ పుట్ సబ్సీడీలను తెలంగాణ ప్రభుత్వం సత్వరమే చెల్లించిందని కేసీఆర్ వెల్లడించారు. 
 వ్యవసాయ ట్రాక్టర్ల కు రవాణా పన్ను రద్దు చేసింది. ప్రభుత్వం ఒక వైపు శాశ్వత పరిష్కార చర్యలుచేపడుతూనే మరోవైపు ఆత్మహత్య చేసుకున్న రైతులకుటుంబాలకు ఇచ్చే పరిహారాన్నిఆరు లక్షలకు పెంచింది. గత పాలకుల హయాంలో ఎరువులు విత్తనాల కోసం రైతులు నానా అగచాట్లు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం ఆ పరిస్థితిని నివారించింది. రానున్న రోజుల్లోనూ రైతాంగం ప్రయోజనాలు రక్షించే విషయంలో ఇదే విధంగా రాజీ లేని వైఖరితో ముందుకుపోతామని, కల్తీ వ్యాపారాలను ఉక్కుపాదం మోపి అణిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. దేశంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం,భూ రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండడం కోసం దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసింది. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం చేసిన కృషితో దాదాపు 94 శాతం భూముల యాజమాన్యాల హక్కుల విషయంలో స్పష్టత వచ్చింది. పంట కాలంలో రైతులు పెట్టుబడి లేక, అప్పుల కోసం చేయిచాస్తున్నరు. రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులకు పెట్టుబడి సమస్యను పరిష్కరించాలని “ రైతుబంధు” పేరు తో అపూర్వమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతుకు ఎకరానికి 4000 రూపాయల చొప్పున రెండు పంటలకు కలిపి 8000 రూపాయలు ఈ పథకం ద్వారా అందిస్తున్నది. రైతు బంధు చెక్కుల పంపిణీ పల్లెలలో పండుగ వాతావరణాన్ని సృష్టించిందని అయన అన్నారు.
 గోదావరి జలాల వినియోగం కోసం మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని, కేంద్రం ఆమోదాన్ని పొంది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం కేసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో ఏటా 25 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తున్నది. బ్యాంకుల ద్వారా కూడా అదనపు నిధులు సమకూరుస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి సమైక్య రాష్ట్రంలో ఉద్దేశ్యపూర్వకంగా పెండింగులో పడేసిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తున్నది. ఇప్పటికీ పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా ద్వారా కొత్తగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నదని ముఖ్యమంత్రిఅన్నారు. అంతరించి పోయిన వృత్తుల మీద ఇంకా ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపించటం. ఈ మూడు వ్యూహాలకు తగిన విధంగా వివిధ పథకాలను ప్రభుత్వం అమలు లోకి తెచ్చింది. చేనేత, పవర్ లూం కార్మికుల స్థితి గతులు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి వివిధ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చింది. నేత కార్మికులు నేసె వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంచే చీరల కోసం చేనేత ఉత్పత్తులను అదేవిధంగా పవర్లూం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని చవిచూస్తున్నారు.. 40వేల కోట్ల రూపాయలతో 40కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణా ప్రజా సంక్షేమంలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం అమలవుతున్నది. ఇప్పటి వరకు 12,974 ఎకరాలు కొనుగోలు చేసి, 5,065 మంది దళితులకు పంపిణీ చేసింది. గర్భిణులను ప్రసవ సమయంలో దవాఖానకు తీసుకురావడానికి, ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డతోపాటు సురక్షితంగా, ఉచితంగా ఇంటికి చేర్చేందుకు ‘అమ్మఒడి’ పథకం ద్వారా ప్రభుత్వం వాహనాలను సమకూర్చింది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల్లో తల్లీబిడ్డలకు ప్రతీరోజు పౌష్టికాహారం అందిస్తున్నది. హైదరాబాద్ నగరంలో వైద్యసేవలను మరింత విస్తరించి, పేదలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతీ పదివేల మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. 40 బస్తీ దవాఖానాలు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. కేసీఆర్ కిట్స్ ఆసుపత్రులలో సురక్షిత ప్రసవాలు జరగాలనే ప్రధాన లక్ష్యంతో ప్రవేశ పెట్టిన పథకం కెసిఆర్ కిట్స్. ఈ పథకం క్రింద నిరుపేద గర్భిణులకు 12,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఆడపిల్లను ప్రసవించిన తల్లికి ప్రోత్సాహకంగా మరో 1,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. దీనితోపాటు నవజాత శిశువులకు, బాలింతలకు కావల్సిన 16 రకాల వస్తువులతోకూడిన 2,000 రూపాయల విలువైన కిట్ ను కూడా అందిస్తున్నది. ఈ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగడంతోపాటు, సమర్థవంతంగా మాతా, శిశు సంరక్షణ జరుగుతున్నది. తెలంగాణా సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా పొందాలంటే స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలి. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానికుల హక్కులు పరిరక్షించటం కోసం, ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకల్ కేడర్ ఉద్యోగాలలో 95 శాతం అవకాశాలు స్థానికులకే లభించే విధంగా చట్టం చేసింది. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుస్దాధ్యం చేసేవరకు విశ్రమించలేదు. నేడు అదే సంకల్పబలంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పునరంకిత మవుతున్నాను. ఈ ప్రయాణంలో ప్రజలే నాకు అండదండ. వారి దీవెనలే ప్రేరణ. తెలంగాణ విజయయాత్ర ఇదే విధంగా కొనసాగేందుకు తగిన బలాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అందించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ జై హింద్ అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.