కంచుకోటపైనే జగన్ దృష్టంతా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కంచుకోటపైనే జగన్ దృష్టంతా

విశాఖపట్టణం, ఆగస్టు 24, (way2newstv.com) 
విశాఖ జిల్లాలోని యలమంచలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకూ ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ యలమంచలి నియోజకవర్గంలో విజయం సాధించింది. గత ఎన్నికల్లోనూ యలమంచలిని పసుపు పార్టీ తన ఖాతాలో వేసుకుంది. అప్రతిహతంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ జైత్రయాత్రకు చెక్ పెట్టాలన్నది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచన.జగన్ పాదయాత్ర యలమంచలి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఇక్కడ ప్రధానంగా ఏటికొప్పాక కొయ్యబొమ్మలు ఫేమస్. అయితే కొంతకాలంగా వీటికి సరైన మార్కెటింగ్ లేక పరిశ్రమ కుదేలైపోయింది. ఇక నియోజకవర్గంలోని రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక, యలమంచలి మున్సిపాలిటీలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అధికార పార్టీ నేతల అవినీతిని ఈ సందర్భంగా జగన్ బయటపెడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 
 
 
 
కంచుకోటపైనే జగన్ దృష్టంతా
 
నాలుగున్నరేళ్ల నుంచినియోజకవర్గంలో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జగన్ పాదయాత్రతో వచ్చే ఎన్నికల్లో యలమంచలి నియోజకవర్గంలో ఫ్యాన్ రెపరెపలాడుతుందన్న ధీమా వైసీపీ నేతల్లో కన్పిస్తోంది. అందుకోసమే ఆయన ఈ నియోజకవర్గంలో పాదయాత్రను ఎక్కువ కిలోమీటర్లు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్కువ రోజులు జగన్ యలమంచలిలోనే పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.యలమంచలి నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి 1955, 1967, 1972ల్లో సి.వి.ఎస్.రాజు, సత్యనారాయణ, కె.వి.కాకర్లపూడిలు గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు విజయం సాధించింది. 1962, 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా వి.సన్యాసినాయుడు రెండు సార్లు గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు ఇక్కడ విజయం దక్కలేదు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఎక్కువసార్లు పప్పల చలపతిరావు విజయం సాధించారు. చలపతిరావు ఇక్కడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించి కాంగ్రెస్ విజయం సాధించంది. యు.వి రమణమూర్తి రాజు ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావు పై తెలుగుదేశం అభ్యర్థి రమేష్ బాబు దాదాపు ఏడు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.అయితే గతంలో కన్నా వైసీపీకి ఇప్పుడు బలం పెరిగింది. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ఇప్పుడు వైసీపీలో చేరడం ఆ పార్టీకి కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న కన్నబాబు జగన్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించకముందే పార్టీలో చేరారు. ఆయనే పాదయాత్ర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే కన్నబాబుపై గతంలో రుణం ఎగవేత ఆరోపణలు వచ్చాయి. అయితే తాను ఎటువంటి తప్పు చేయలేదని కన్నబాబు చెబుతున్నారు. వచ్పే ఎన్నికల్లో యలమంచలిలో టగ్ ఆఫ్ వార్ నడుస్తుందన్నది విశ్లేషకుల అంచనా.