వసుంధర రాజస్థాన్ సెంటిమెంట్ మారుస్తారా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వసుంధర రాజస్థాన్ సెంటిమెంట్ మారుస్తారా...

జైపూర్, ఆగస్టు 24 (way2newstv.com)
రాజస్థాన్ లో తిరిగి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజే కొంగు బిగించారు. పార్టీలో తన ప్రత్యర్థులను కట్టడి చేయడంతో పాటుగా ప్రజల్లోకి వెళ్లాలని వసుంధర నిర్ణయించారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఒక సంప్రదాయం కొనసాగుతుంది. ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి పవర్ లోకి రావడం జరగదు. అయితే ఈ సంప్రదాయనికి తెరదించుతానని వసుంధర పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందని సర్వేలు వెల్లడి కావడం, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పరాజయం పాలవ్వడంతో వసుంధర ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీని విజయపథాన నడపాలన్న ధీమాతో ఉన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను పర్యటించనున్నారు. 
 
 
 
వసుంధర రాజస్థాన్ సెంటిమెంట్ మారుస్తారా...
 
గతంలోనే ఆమె గౌరవ్ యాత్ర పేరిట రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ జరిగిన గౌరవ యాత్రలో వసుంధర రాజే ఉదయ్ పూర్ డివిజన్ లోని దాదాపు 23 నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. తిరిగి ఈనెల 24వ తేదీ నుంచి సెప్టంబర్ 2వ తేదీ వరకూ మలి విడత యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రలో మొత్తం 165 నియోజకవర్గాల్లో వసుంధర ఆరు వేల కిలోమీటర్ల వరకూ ప్రయాణించనున్నారు. పూర్తిగా పార్టీ నిర్వహించే ఈ కార్యక్రమంలో వసుంధర స్థానిక సమస్యలపై స్పందిస్తూ వస్తున్నారు.రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2013 లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 163 స్థానాలను సాధించింది. 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ మొత్తం 25 స్థానాలను గెలుచుకుని తనకు తిరుగులేదని అన్పించుకుంది. కాంగ్రెస్ కు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 21 స్థానాలే లభించాయి. అయితే ఇటీవల జరిగిన అజ్మీర్ అల్వార్ లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మందల్ ఘర్ అసెంబ్లీ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో వసుంధర రాజేపై సొంత పార్టీలోనే అసంతృప్తులు బయలుదేరాయి. వసుంధరను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ అధిష్టానానికి కొందరు వినతి పత్రాలు కూడా అందజేశారు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం ఆమెపై నమ్మకం ఉంచినట్లు కనపడుతోంది.అందుకే పార్టీ అధిష్టానం వద్ద తన పట్టు ఏంటో తెలియజెప్పాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తనకు నమ్మకమైన మదన్ లాల్ సైనీని నియమించేలా పావులు కదిపారు. నిజానికి చాలా మంది బీజేపీ నేతలు గజేంద్ర సింగ్ కు పార్టీ రాష్ట్ర బాధ్యతలను అప్పగించాలని భావించినా వసుంధరరాజే గట్టిగా పట్టుబట్టడంతో ఆమె సూచన మేరకే సైనీని నియమించారు. వసుంధర రాజే పార్టీలోని తన ప్రత్యర్థులకు చెక్ పెట్టడానికి, తానేంటో నిరూపించుకోవడానికి ఈ గౌరవ్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో కూడా తాను కీలక భూమిక పోషించనున్నట్లు నేతలకు సంకేతాలు పంపడంతో నేతలంతా వసుంధరనే అనుసరిస్తున్నారు. మొత్తం మీద వసుంధర పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో? లేదో చూడాలి. దూకుడు మీదున్న కాంగ్రెస్ ను ఎలా కట్టడి చేయగలరన్నది ఇప్పుడు ప్రశ్న.