ప్రచారమే పరమావధి ఇద్దరు చంద్రులదీ ఓకే స్టైల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రచారమే పరమావధి ఇద్దరు చంద్రులదీ ఓకే స్టైల్

హైద్రాబాద్, ఆగస్టు 23, (way2newstv.com)
రాష్ట్రాలు అప్పుల కుప్పగా మారినా ఫర్వాలేదు. సొమ్ములు కుమ్మేద్దాం. సంక్షేమం. ప్రచారం. పనుల జోరు ఈమూడూ ఈ ఏడాది వెల్లువెత్తాలి. ఖజానా కరవు ప్రజలకు తెలియకూడదు. అప్పు పుడితే చాలు దూసి తెచ్చేయడమే. పదిమందికి పంచేయడమే. నాలుగైదు అభివృద్ధి పనులు చేసినట్లు చూపించడమే. ఇదీ తెలుగు రాష్ట్రాల పరిస్థితి. గడచిన అరవయ్యేళ్లలో చేసిన రుణాల కంటే రెట్టింపు మొత్తాలను గడచిన నాలుగేళ్లలో తెచ్చిపెట్టిన ఘనత రెండు రాష్ట్రప్రభుత్వాలకు దక్కుతుంది. ఒక్కొక్కరకమైన సాకుతో అవసరాలను మించి ఖర్చులను చేశారు ముఖ్యమంత్రులు. అభివృద్ధి అనేది పైపై మెరుగు మాత్రమే. పర్మినెంట్ రాజకీయ ప్రయోజనమనేది అసలు ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజకీయంగా అనేక రకాల మార్పులకు ప్రాతిపదికలు ఏర్పడ్డాయి. అటు తెలుగుదేశం, ఇటు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. కనీసం మరొక టర్మ్ అధికారం నిలబెట్టుకోవాల్సిన అవసరం రెండు పార్టీలకు ఏర్పడింది. అటు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంతోపాటు ఇటు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు పట్టాలెక్కి ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలంటే పదేళ్లు పడుతుంది. అందుకే రెండు పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో పట్టు నిలుపుకోవడం కోసం పరిపరివిధాలా కష్టపడుతున్నాయి.కాంగ్రెసు ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఒక రికార్డు సృష్టించారు. 
 
 
 
ప్రచారమే పరమావధి ఇద్దరు చంద్రులదీ ఓకే స్టైల్
 
అంతకుముందు సంక్షేమం పేరు చెబితే ఎన్టీరామారావు మాత్రమే గుర్తుకు వచ్చేవారు. ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్, రైతులకు ఉచితవిద్యుత్తు వంటి పథకాలు ప్రజల్లో శాశ్వతమైన కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. అందుకే అన్ని పక్షాలు కలిసి మహాకూటమి కట్టినా, చిరంజీవి వంటి గ్లామర్ హీరో రంగంలో ఉన్నా కాంగ్రెసును 2009లో గట్టెక్కించగలిగారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటైనా వాటిని కొనసాగించకతప్పని పరిస్థితి కొత్తప్రభుత్వాలకు ఏర్పడింది. వై.ఎస్. సంక్షేమాన్ని మరిపించే స్కీములు పెట్టడం టీఆర్ఎస్, టీడీపీలకు సాధ్యం కాలేదు. కల్యాణ లక్ష్మి, పింఛన్లు వంటవి ప్రవేశపెట్టినా పనికావడం లేదని గ్రహించి రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. ఇవే తరహా పథకాలు ఆంధ్రప్రదేశ్ లోనూ అమలవుతున్నాయి. ఫలితం అంతంతమాత్రంగానే కనిపిస్తోందని గుర్తించి నిరుద్యోగ భృతి ని విజయదశమి నాటికి ప్రారంభించాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. వై.ఎస్. వేసిన సంక్షేమ పథకాల పునాదుల మీద కొత్త పథకాలతో పునరధికారాన్ని సాధించాలనే తాపత్రయం రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది.కేవలం సంక్షేమం కోసమే ప్రజలు టీడీపీ, టీఆర్ఎస్ లను ఎన్నుకోలేదు. ప్రజలు అంతకుమించి అభివృద్ధిని ఆశించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో గతం నాటి వెనకబాటు తనం పోయి శాశ్వత అభివృద్ధికి బాటలు పడతాయని కాంక్షించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటివాటిని ఈదిశలోనే కేసీఆర్ రూపకల్పన చేశారు. వైసీపీని కాదని టీడీపీని ఎన్నుకున్నకారణం కూడా ఇలాంటిదే. కొత్తరాజధాని నిర్మాణం , నూతన రాష్ట్రానికి మౌలిక వసతుల కల్పనల విషయంలో చంద్రబాబు ట్రాక్ రికార్డు ఉపయోగపడతుందని భావించారు. అందువల్లనే శాశ్వతమైన పనులపైనా టీడీపీ దృష్టి సారించాల్సి వస్తోంది. కానీ తెలంగాణతో పోల్చి చూసినప్పుడు ఏపీ వెనకబడే ఉందని చెప్పాలి. ఈ లోపాన్ని సరిదిద్దుకుని వేగంగా పనులు చేపట్టడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రగతిని చూపించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. పోలవరం పనుల విషయంలోనూ పూర్తి చేసి చూపిస్తేనే ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందనే భావన టీడీపీలో నెలకొంది.
ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే అద్భుతాలు ఆవిష్కరించాలన్న విషయంలో ఇద్దరు చంద్రులకు స్పష్టత ఉంది. అమరావతి డిజైన్లను ఆమోదించేశారు. ఇక పనులు చేపట్టడమే. అలాగే తెలంగాణలో కాళేశ్వరం పనులు కూడా సగానికిపైగా పూర్తి చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా పనులూ వేగం పుంజుకున్నాయి. రెండు పడకల ఇళ్లపైనా కనీస లక్ష్యాలను పూర్తి చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. 22 లక్షల ఇళ్లు అంటూ కాంగ్రెసు చేసిన ప్రచారాన్ని తిప్పికొడుతూ రెండు లక్షల అరవై వేల ఇళ్లేనంటూ కేసీఆర్ తేల్చి చెప్పారు. అయితే వీటన్నిటినీ పూర్తి చేయడానికి అంచనాలు మించి డబ్బులు ఖర్చుపెడుతున్నారు. కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. వచ్చే ప్రభుత్వాలపై భారీ రుణభారం పడబోతోంది. ప్రభుత్వాలు అప్పుల విషయంలో విచక్షణ కోల్పోతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. ఎఫ్ఆర్బీఎం వంటి చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయమార్గాల పేరిట ప్రభుత్వాలు పక్కదారి పడుతున్నాయి. తెలంగాణలో ప్రత్యేక కార్పొరేషన్లు నెలకొల్పి అప్పులు తెస్తుంటే ఆంధ్రాలో అమరావతి బాండ్లవంటివి పుట్టుకొస్తున్నాయి. ఈ రుణాల ఊబి ఎవరిని ముంచుతుందో కాలమే తేల్చాలి.