కూలితే అంతే సంగతులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కూలితే అంతే సంగతులు

నిజామాబాద్, ఆగస్ట్ 26 (way2newstv.com): 
జిల్లాలో చాలా చోట్ల ప్రభుత్వకార్యాలయాల భవనాలు, పాఠశాలలు శిథిలావస్థకు చేరుకొన్నాయి. రెండేళ్ల కిందట ఉమ్మడి జిల్లాలోని శిథిలభవనాలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆయా నివాసాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో చూసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కురుస్తోన్న జోరువానలతో ప్రమాదం పొంచి ఉంది. యంత్రాంగం అప్రమత్తం కాకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు.
ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయటం..ఆ తర్వాత వదిలేయటం ప్రభుత్వ యంత్రాంగానికి అలవాటుగా మారింది. శిథిలావస్థలోని భవనాలు వర్షాలకు కూలే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిని గుర్తించి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన ఉన్నా ఉమ్మడి జిల్లాలో అధికారులు ఆ దిశగా ఆలోచనే చేయకపోవటం గమనార్హం.
 
 
 
కూలితే అంతే సంగతులు 
 
ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఇళ్లు శిథిలావస్థకు చేరి, గోడలు బీటలువారి ఉంటాయి. అవి కూలితే వాటిల్లో ఉండేవారేగాక..పక్కంటివారు కూడా ప్రమాదం బారినపడే అవకాశం ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో ఇలాంటి నివాసాలను మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక విభాగం గుర్తించి ఇంజినీరింగ్‌ విభాగానికి నివేదిస్తుంది. వారు ఆయా భవనాలను పరిశీలించిన అనంతరం తీవ్రతను బట్టి తాఖీదులిస్తారు. ప్రత్యామ్నాయం చూసుకొనేందుకు వారం రోజుల సమయాన్ని ఇస్తారు. తీవ్రత ఉంటే అదే ఆఖరి గడువు. కాస్త పర్వాలేదనుకుంటే మరమ్మతులు చేయించుకోవాలని సూచిస్తారు. పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఉంటే మరో 15 రోజులు గడువిస్తారు.
రెండేళ్ల కిందట జారీ చేసిన నోటీసుల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే కొన్నిచోట్ల నివాసితులే తమ ఇళ్లను బాగు చేయించుకోవటం..పునర్నిర్మాణం చేసుకోవటం మినహా యంత్రాంగం చొరవ చూపిన దాఖలాలు లేవని చెబుతున్నారు. నిజామాబాద్‌ నగరంలోని కోటగల్లీ, దుబ్బా, కసాబ్ గల్లీ, ఖిల్లా పాత్రం, గాజులపేట్‌ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో నోటీసులు జారీ చేశారు. వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటో చూడటం మరిచారు.
యంత్రాంగం శిథిల భవనాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించటానికి రెండు కారణాలు ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారి తరఫున స్థానిక నాయకులు ఒత్తిడి తీసుకురావటంతో తదుపరి చర్యలు లేకుండా వదిలేస్తున్నారు. కొందరు యజమానులు నోటీసులు అందాక సిబ్బందికి అంతో ఇంతో ముట్టజెప్పి తమ జోలికి రాకుండా చూసుకుంటున్నారు. కానీ ఇలా ప్రమాదకరంగా ఉన్న ఇళ్లలో నివాసం ఉంటే జరిగే నష్టం విషయంలో అధికారులు అవగాహన కల్పించటం లేదు. అలా చేస్తే స్వచ్ఛందంగా ఖాళీ చేయటమా.., మరమ్మతులు చేపట్టడమో చేసుకుంటారు. తద్వారా ప్రమాదం నుంచి తప్పించుకున్నవారవుతారు. ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా విధులు నిర్వహిస్తే ప్రాణ నష్టాన్ని నివారించినవారవుతారు.