అధికారాలు సరే.. నిధులెక్కడ..? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అధికారాలు సరే.. నిధులెక్కడ..?

ఆదిలాబాద్, ఆగస్ట్ 14 (way2newstv.com)
గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ప్రత్యేక అధికారులకు పగ్గాలు అప్పగించినా నిధుల కొరత వారిని వెంటాడుతోంది. ప్రతి చిన్న సమస్యకు ఆర్థిక తోడ్పాటు అవసరమైన ఈ పరిస్థితుల్లో పంచాయతీలు సాధారణ నిధులతోనే వెళ్లదీయాల్సి వస్తోంది. 14వ ఆర్థిక సంఘం నిధులు నిర్వహణకు వెచ్చించే అవకాశం ప్రత్యేక అధికారులకు లేకపోవడంతో పేరుకే అధికారం అన్న రీతిలో వారు మధన పడుతున్నారు. నిత్యం సమస్యల పేరుతో వచ్చే ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి కావాల్సిన పరిస్థితి..
 
 
 
అధికారాలు సరే.. నిధులెక్కడ..?
 
విభజిత ఆదిలాబాద్‌ జిల్లాలోని పాత 200 పంచాయతీల్లో సర్పంచుల అయిదేళ్ల పదవీకాలం గత నెలతో ముగిసింది. షెడ్యూల్‌ ప్రకారం గత నెలలో పంచాయతీల ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు సిద్ధం చేశారు. అయితే వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. బీసీ జనాభాలో తేడాలు ఉన్నాయని, బీసీ జనాభాను గుర్తించి ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో పల్లె పోరు వాయిదా అనివార్యమైంది. ఆగస్టు 2 నుంచి జిల్లాలోని నూతనంగా ఏర్పాటైన మొత్తం 467 పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది.
పంచాయతీ పాలక వర్గాలు లేని పక్షంలో ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోనున్నాయి. 2006లో ఎన్నికైన పంచాయతీ పాలక వర్గాల గడువు 2011లో గడువు పూర్తి కావడంతో అప్పట్లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అనంతరం 2013లో ఎన్నికలు నిర్వహించారు. ఆ రెండేళ్లు పంచాయతీలకు కేటాయించే ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరిన తరువాత పెండింగ్‌ నిధులు విడుదలయ్యాయి. ఈసారి కూడా అదే సమస్య పునరావృతం కానుంది. తద్వారా గ్రామాలను నిధుల సమస్య వెంటాడనుంది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఏటా ప్రతి వ్యక్తికి రూ.240 చొప్పున జిల్లా రూ.27 కోట్ల వరకు 14వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి. జిల్లాలో విడుదలైన 14వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులతో ఇపుడు గ్రామాలలో అభివృద్ధి పనులతో పాటు పంచాయతీ వీధిదీపాలు, విద్యుత్తు ఛార్జీలు, పారిశుద్ధ్య పనులతో పాటు ఇతర అత్యవసర పనులు చేపట్టాల్సి ఉంది. ఇక ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు ఆగితే సాధారణ నిధుల(ఇంటి పన్నుల)పై ఆధారపడాల్సి వస్తుంది. ఎక్కువ గ్రామాల్లో ఇంటి పన్ను 50 శాతం నుంచి 60 శాతం వసూలు కావడం గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పల్లెలో వచ్చే సమస్యల పరిష్కారానికి నిధుల కొరత ఏర్పడుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
జిల్లాలోని కొన్ని పల్లెలు పన్నులంటేనే ఇప్పటి వరకు ఎరుగవు. అలాంటి పల్లెలను ప్రభుత్వం నూతన పంచాయతీలుగా గుర్తించింది. పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు తీసుకున్న వారు వచ్చీ రాగానే పన్నుల వసూళ్ల గురించి చెబితే వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. చాలీ చాలని నిధులతో సమస్యల పరిష్కారం ఇబ్బందిగా మారింది. ఇది వరకు మేజర్‌ పంచాయతీలో ఉన్న పల్లెలు కొన్ని ఇపుడు పంచాయతీలుగా మారాయి. ఆ గ్రామాలకు గతంలో మేజర్‌ పంచాయతీకి మంజూరైన నిధుల్లో నుంచి 30 శాతం వరకు దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు చేసేవారు. కానీ ఇపుడా పరిస్థితి లేదు. దాదాపు 500 జనాభా ఉన్న పంచాయతీకి రూ.1.3 లక్షలు మాత్రమే నిధులు రానున్నాయి. దీంతో ఆ నిధులతో ఏయే అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం ఎలా చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. గ్రామ పంచాయతీలకు జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు వారి నిధుల్లో నుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.