రూ.11,538 కోట్ల బ‌డ్జెట్‌కు బ‌ల్దియా కౌన్సిల్ ఆమోదం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రూ.11,538 కోట్ల బ‌డ్జెట్‌కు బ‌ల్దియా కౌన్సిల్ ఆమోదం

హైదరాబాద్ ఫిబ్రవరి 9,(way2newstv.com)
2019-20 సంవ‌త్స‌రానికిగాను న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ను నేడు జ‌రిగిన జీహెచ్ఎంసీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఏక‌గ్రీవంగా ఆమోదించింది. మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న శ‌నివారం ఉద‌యం జీహెచ్ఎంసీ వార్షిక బ‌డ్జెట్‌పై జ‌రిగిన స‌మావేశానికి క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్‌, ఎమ్మెల్సీలు స‌య్య‌ద్ అమీన్ జాఫ్రీ, ఎం.ఎస్‌.ప్ర‌భాక‌ర్‌రావు, ఎం.ఏ.స‌లీమ్‌, ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, కౌస‌ర్ మోయినుద్దీన్‌, బ‌లాల‌, మాధ‌వ‌రం కృష్ణారావు, డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, ఎక్స్అఫిసియో స‌భ్యులు, కార్పొరేట‌ర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా 2019-20కి గాను రూ. 11,538 కోట్ల‌తో బ‌డ్జెట్‌ను మేయ‌ర్ రామ్మోహ‌న్ ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్‌లో జీహెచ్ఎంసీ బ‌డ్జెట్‌గా రూ. 6,150 కోట్లు, జీహెచ్ఎంసీకి అప్ప‌గించిన ఇత‌ర కార్పొరేష‌న్లైన హౌసింగ్ కార్పొరేష‌న్‌, హైద‌రాబాద్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌ల‌కు మిగిలిన రూ. 5,388 కోట్లను కేటాయించారు.


రూ.11,538 కోట్ల బ‌డ్జెట్‌కు బ‌ల్దియా కౌన్సిల్ ఆమోదం

 జీహెచ్ఎంసీకి రూ. 3,210 కోట్లు రెవెన్యూ ఆదాయం కాగా మ‌రో రూ. 733 కోట్లు క్యాపిట‌ల్ రిసీట్స్‌గా ల‌భించ‌నుంది. మిగిలిన నిధుల‌ను బాండ్లు, బ్యాంకు రుణాల రూపంలో సేక‌రించ‌డం జ‌రుగుతుంద‌ని మేయ‌ర్ ప్ర‌క‌టించారు. రెవెన్యూ ఆదాయంలో అధిక శాతం రూ. 1,694 కోట్లు ఆస్తిప‌న్ను రూపంలో ల‌భించ‌నున్న‌ది. జీహెచ్ఎంసీ బ‌డ్జెట్‌లో రూ. 6,150 కోట్ల‌లో రెవెన్యూ వ్య‌యం రూ. 2,808 కోట్లు కాగా క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 3,342 కోట్లుగా ఉన్న‌ట్టు మేయ‌ర్ పేర్కొన్నారు. 14 ఫైనాన్స్ క‌మిష‌న్ కింద రూ. 418.82 కోట్లు భార‌త ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి అంద‌నున్నాయ‌ని తెలిపారు. న‌గ‌రంలో సిగ్న‌ల్ ఫ్రీ ర‌వాణా వ్య‌వ‌స్థ ఏర్పాటుకు నిర్ధేశించిన రూ. 3,500 కోట్ల‌ను బాండ్లు, రుణాల ద్వారా సేక‌రించాల‌ని గ‌తంలోనే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, వీటిలో రూ. 2,500 కోట్లు రుణంగాను, మ‌రో వెయ్యి కోట్లు బాండ్ల రూపంలో అవ‌స‌రాన్ని బ‌ట్టి తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రూ. 395 కోట్ల‌ను బాండ్ల రూపంలో సేక‌రించామ‌ని, వీటి ద్వారా ఇప్ప‌టికే నాలుగు ఫ్లైఓవ‌ర్ల నిర్మాణం పూర్తి అయ్యింద‌ని, మ‌రికొన్ని పురోగ‌తిలో ఉన్నాయ‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ద్వారా రూ. 5,188 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో ఇప్ప‌టికే 30,562 ఇళ్ల నిర్మాణం ముగింపు ద‌శ‌కు వ‌చ్చాయ‌ని, ఈ ఇళ్ల‌ను కేటాయింపును రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి అందే విధివిధానాల ఖ‌రారు అనంత‌రం చేప‌ట్ట‌నున్నామ‌ని బొంతు రామ్మోహ‌న్ స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా చేప‌డుతూనే చెత్త‌, వ్య‌ర్థ ప‌దార్థాల నుండి విద్యుత్ ఉత్పాద‌న‌, ఎరువు త‌యారు చేస్తున్నామ‌ని తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాల‌యాల్లో ఉద్యోగుల స‌మ‌య‌పాల‌న ఖ‌చ్చితంగా పాటించ‌డానికి బ‌యో మెట్రిక్ హాజ‌రు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింద‌ని, న‌గ‌రంలో వీధిదీపాల నిర్వ‌హ‌ణ‌కు రూ. 44కోట్లు కేటాయించిన‌ట్టు మేయ‌ర్ రామ్మోహ‌న్ ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని గ్రీన్ సిటీ రూపొందించేందుకు కోటి మొక్క‌ల‌ను నాటనున్నామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న కాల‌నీలు, బ‌స్తీల అభివృద్దికి జీహెచ్ఎంసీ బ‌డ్జెట్‌లో త‌గు మొత్తంలో బ‌డ్జెట్ కేటాయింపులు జ‌రిపామ‌ని వివ‌రించారు. కాగా ఈ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై ప‌లువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల‌తో పాటు స‌భ్యులు ప‌లు సూచ‌న‌లు అంద‌జేశారు. పూర్తిస్థాయి చ‌ర్చ అనంత‌రం బ‌డ్జెట్‌ను స‌భ్యులు చ‌ప్ప‌ట్ల‌తో ఆమోదించారు.