నిధులు మురిగిపోతున్నాయ్.. (నెల్లూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిధులు మురిగిపోతున్నాయ్.. (నెల్లూరు)

నెల్లూరు, ఫిబ్రవరి 9 (way2newstv.com): 
మౌలిక వసతుల కల్పనకు నిధులు కుమ్మరిస్తున్నా ఫలితం నామమాత్రమే. ప్రజాప్రతినిధులు, అధికారులు పనుల నాణ్యతపై దృష్టిసారించడం లేదు. క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల పాత్ర అంతే. ఒక వైపు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మరోవైపు మార్చి గడువు సమీపిస్తున్నా పనుల వేగిరం లేదు. నిధులు మురిగిపోయే పరిస్థితిగా ఉంది. నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. అధికారులే స్వయంగా పనులు బాగా చేయలేదని, మళ్లీ బాగు చేస్తామని చెప్పడం విశేషం. కార్పొరేషన్‌ పరిధిలోని గాంధీనగర్‌, వేదాయపాళెం, ఆటోనగర్‌, బాలాజీనగర్‌, హరినాథపురం, నక్కలోళ్ల సెంటర్‌ పలు చోట్ల సిమెంటు రోడ్లు, కాల్వల పనులు సరిగా చేయక దెబ్బతింటున్నాయి.


నిధులు మురిగిపోతున్నాయ్.. (నెల్లూరు)

సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో 14వ ఆర్థిక సంఘం నిధులతో చేస్తున్న పనుల్లో నాణ్యతడొల్లగా మారింది. ఈ నిధులతో పట్టణమంతా చేస్తున్నారు. ఇవి సరిగా చేయడంలేదు. ఇంజినీరింగు అధికారులు దగ్గరుండి చేయింలేని పరిస్థితి. సరిపడు సిబ్బంది లేక అన్ని పనులు పర్యవేక్షించలేకున్నారు. పాలకులు, రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు. నాయుడుపేట పురపాలక సంఘం బీఎంఆర్‌నగర్‌లో రూ.20లక్షల నిధులతో సీసీ రోడ్డు వేశారు.  పట్టుమని పది నెలలుకూడా కాకముందే పగుళ్లు తీసింది. పెద్ద సిమెంటు రోడ్డు పగలడంతో నాసిరకం బట్టబయలు అవుతోంది. దాన్ని కప్పి పుచ్చేందుకు పైన పూత పూశారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇంజినీరింగు అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
జిల్లాలోని కావలి, ఆత్మకూరు, గూడూరు, వెంకటగిరి పురపాలక సంఘాల్లోనూ ఇదే తీరు. ప్రతి పనిని స్థానిక రాజకీయ నాయకులు వారి అనుచరులు చేయడంతో అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది.  నాణ్యతపై దృష్టి సారించడంలేదు. ఇంజినీరింగు అధికారులపై రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తే పనులు నాణ్యతగా జరిగే అవకాశముంది.దీంతో దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుంది.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సొంత జిల్లా కావడంతో భారీగా నిధుల వరద కురిపిస్తున్నారు. జిల్లా అభివృద్ధి జరగాలని మంత్రి ఆకాంక్ష. కానీ ఆమేరకు పనుల్లో నాణ్యత ఉండటం లేదు.పనుల నాసిరకం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. పని చేసి చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. నిధులు ఖర్చుపెడుతున్నా సరిగా చేయలేదనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. జిల్లాలోని సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళిక నిధులు రూ.15 కోట్లు కేటాయించారు. వీటిలో రూ.3 కోట్ల పనులకు మాత్రమే టెండర్లు పూర్తి చేశారు. మిగిలిన రూ.12 కోట్లకు టెండర్ల ప్రక్రియ జరగాల్సి ఉంది. గూడూరు పురపాలక సంఘం పరిధిలో ఉప ప్రణాళిక నిధులు రూ.32కోట్లతో నాలుగు ప్యాకేజీలుగా కేటాయించారు. రెండు సార్లు టెండర్లు వేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. ఈ పనులు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు.
ఈ ఏడాది మార్చి 15కల్లా అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంది. అప్పటి వరకూ చేసిన పనులకు బిల్లులు చెల్లింపులు జరుగుతాయి. ఒక్కో పురపాలక సంఘంలో రూ.10కోట్ల నుంచి రూ.20కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇక నెల్లూరు కార్పొరేషన్‌లో వందల కోట్ల పనులు శరవేగంగా చేస్తున్నారు. మిగిలిన పట్టణాల్లో ఊపులేదు. గుత్తేదారులు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు. తొందరగా చేసేందుకు తగిన యంత్రసామగ్రి, కూలీలు లేరు. నాయుడుపేట పురపాలక సంఘంలో రూ.15కోట్ల నిధులకు టెండర్లు పూర్తి చేసి పనులు సగం పూర్తి కావచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న తంతుచూస్తే మొత్తం పనులు పూర్తయ్యేందుకు ఇంకా మూడునాలుగు నెలలు పట్టనుంది.