ఇసుకాసుర దందా (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇసుకాసుర దందా (ఖమ్మం)

ఖమ్మం, ఫిబ్రవరి 9 (way2newstv.com): 
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు.. ఆ తరువాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో అధికారులు విధుల్లో నిమగ్నం కావటంతో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఏడాదిగా మైనింగ్‌ అధికారులు మున్నేటి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో వారి పని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి ట్రాక్టర్లను పట్టుకొని కేవలం రూ.5 వేలు జరిమానా విధించి వదిలేస్తుండటంతో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. వీరికి రాజకీయ అండదండలు ఉండటంతో అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం తుంగలో తొక్కిన అక్రమార్కులు ఏకంగా ఎనిమిది గ్రామాలకు తాగునీరు అందించే నాగిలిగొండ తాగునీటి పథకం వద్దనే ఇసుకను ఎత్తుతుండటం గమనార్హం. ఏది ఏమైనా గనులశాఖ, రెవెన్యూ, పోలీస్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, మండల పరిషత్తు అధికారులు దృష్టి పెట్టి అక్రమాన్ని నిరోధించకపోతే భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు తాగునీటి పథకం మూలన పడే ప్రమాదం ఉంది.



ఇసుకాసుర దందా (ఖమ్మం)

చిన్నమండవ సమీపంలో మున్నేటిలో ఉన్న తాగునీటి పథకానికి 500 మీటర్లు లోపు ఎలాంటి ఇసుక తవ్వకాలు చేపట్టరాదని హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. తాగునీటి పథకానికి సమీపంలో ఇసుక కోసం తవ్వకాలు చేపడితే ఆ ప్రభావం ఎనిమిది గ్రామాల తాగునీటి సరఫరాపై పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇటీవల వరకూ తాగునీటి పథకం సమీపంలో తవ్వకాలు చేపట్టలేదు. నెల రోజులుగా చింతకాని, ముదిగొండ మండలాలకు చెందిన వందలాది ట్రాక్టర్ల ద్వారా పెద్ద ఎత్తున ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. చింతకాని మండలం చిన్నమండవ, తిమ్మినేనిపాలెం సమీపంలో ఉన్న మున్నేటి రేవులను మూసి వేస్తున్నట్లు.. ప్రభుత్వ పథకాలకు కూడా అక్కడ నుంచి ఇసుకను రవాణా చేయవద్దని కలెక్టర్‌ కర్ణన్‌ కూడా రెండు నెలల కిందట ఆదేశాలు జారీ చేశారు. చింతకాని మండలంలో ఉన్న ఇసుక రేవులను మూసివేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటన కూడా చేశారు. కలెక్టర్‌ ఆదేశాలను సైతం అక్రమార్కులు తుంగలో తొక్కారు. నిత్యం 400 నుంచి 600 ట్రిప్పుల ఇసుకను రాత్రింబవళ్లూ పెద్ద ఎత్తున ఖమ్మంతో పాటు పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో నిత్యం రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల మేరకు ఇసుక అక్రమంగా తరలుతోంది. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకునేందుకు మైనింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవెన్యూ, పోలీస్‌, మండల పరిషత్తు శాఖలకు అధికారాలు ఉన్నా.. ఆయా శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
రాత్రింబవళ్లూ.. నెల రోజులుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు విడతల వారీగా జరగడంతో అధికారులు బిజీగా ఉంటారని భావించి అక్రమార్కులు బరితెగించారు. రాత్రింబవళ్లూ ఇసుకను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. తాగునీటి పథకానికి కేవలం 10 అడుగుల దూరంలో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టారు. వారం రోజుల కిందట అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 ట్రాక్టర్లు, మున్నేటిలో ఉన్న ఓ జేసీబీని చింతకాని తహసీల్దార్‌ భద్రకాళి సీజ్‌ చేశారు. అయినా అక్రమం ఆగకపోవడం గమనార్హం. అధికారులు పట్టుకున్న ట్రాక్టర్లకు కేవలం రూ.5 వేలు మాత్రమే జరిమానా వేసి వదిలివేస్తుంటంతో తిరిగి అదే రోజు వారు తిరిగి అక్రమానికి తెగబడుతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ రోజుకు నాలుగు నుంచి ఆరు ట్రిప్పుల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుంది ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకను రూ.6 వేల చొప్పున బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో ట్రాక్టర్‌ ద్వారా అక్రమార్కులకు రూ.30 వేలు వస్తోంది. వీరికి రూ.5 వేలు జరిమానా వేసినా పెద్దగా లెక్క చేయడం లేదు. ఒక్కో ట్రాక్టర్‌ వారంలో నాలుగు, అయిదు సార్లు పట్టుబడ్డా.. అధికారులు కేవలం రూ.5 వేల జరిమానా వేసి వదిలేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇసుక అక్రమాలను అరికట్టాల్సిన గనుల శాఖ అధికారులు మున్నేటి వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. స్థానికులు ఇసుక అక్రమ రవాణా గురించి అధికారులకు ఫోన్‌ ద్వారా తెలియజేస్తే ఇది మా పరిధిలోకి రాదు.. మరో శాఖ అధికారికి చేయండని చెబుతుండటం గమనార్హం. ఇసుక అక్రమ రవాణా గురించి తాగునీటి పథకం పరిధిలో ఉన్న 8 గ్రామాల ప్రజలు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు వేసుకొని కలెక్టరేట్‌ ముట్టడి చేయటానికి సన్నద్ధం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.