కొత్త మార్కెట్లు (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొత్త మార్కెట్లు (కరీంనగర్)

కరీంనగర్, ఫిబ్రవరి 9 (way2newstv.com): 
దుమ్ము, ధూళిలో.. ఎక్కడపడితే అక్కడ కూరగాయలు అమ్మకుండా.. ప్రజల దగ్గరికే మార్కెట్లు నిర్మించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో చిన్న మార్కెట్లపై దృష్టిసారించారు. వీధులకు దూరంగా ఉండకుండా స్థలాలు ఉన్న చోట్ల నాలుగైదు డివిజన్లకు ఒక మార్కెట్‌ నిర్మించేందుకు నిధులు సైతం కేటాయించారు. ఈ మేరకు పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కరీంనగర్‌ నగర పరిధిలో జనాభా ప్రాతిపదికన చిన్న మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు కాలనీల సంఖ్య పెరిగాయి. ఇప్పుడున్న మార్కెట్లకు కాలనీవాసులు రావాలంటే వ్యయ, ప్రయాసలకోర్చి రావాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రధాన కూరగాయల మార్కెట్‌తో పాటు కశ్మీర్‌గడ్డ, శనివారం అంగడీబజారు, రాంనగర్‌లో ఉన్నాయి. 


కొత్త మార్కెట్లు (కరీంనగర్)

వీటిలో రద్దీ పెరిగిపోవడం, లోపలి భాగంలో కూరగాయలు అమ్ముకోవడానికి స్థలం లేకపోవడంతో రోడ్ల మీద కూర్చొని అమ్మకాలు చేస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్యలు వస్తున్నాయి. వీధుల్లో చిన్న మార్కెట్లు నిర్మించడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రధాన కూరగాయల మార్కెట్లకు రాకుండా కట్టడి చేసే అవకాశం ఉంది. దీంతో రద్దీ తగ్గిపోవడం, విక్రయదారులు సైతం ఒకేచోటుకు రాకుండా విభజించడంతో సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారులపై, నడకదారులను ఆక్రమించుకొని కూరగాయలు అమ్ముకునే విధానానికి స్వస్తి పలకనున్నారు.
జనాభా ప్రాతిపదికన వీటిని నిర్మిస్తుండటంతో అన్ని హంగులతో నిర్మాణాలు చేస్తున్నారు. నగర పరిధిలో మొత్తం నాలుగు చిన్న మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించగా అందులో ఇందిరానగర్‌, చైతన్యపురి, హౌసింగ్‌బోర్డుకాలనీ, రాంపూర్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. స్థల సమస్యలు లేనిచోట చకచకా నిర్మాణ పనులు అవుతున్నాయి. ఒక్క రాంపూర్‌ తప్పిస్తే మిగతా ప్రాంతాల్లో పనులు సాగుతున్నాయి. మొదటి విడత నిధుల కింద ఇందిరానగర్‌, చైతన్యపురి మార్కెట్ల నిర్మాణం చేపట్టారు. హౌసింగ్‌బోర్డుకాలనీకి రూ.25 లక్షలు కేటాయించగా అందులో సగం మేర పనులు అయ్యాయి. ఇందులో కూరగాయలు, మాంసం అమ్మకాలు కూడా ఉండనున్నాయి.
నగరంలోని 48వ డివిజన్‌లో చైతన్యపురిలో రూ.17.50లక్షలతో నిర్మాణం పూర్తయింది. షెడ్డు నిర్మాణం పూర్తి కాగా, గోడలకు ఆకర్షించేలా కూరగాయల చిత్రాలను వేయించాల్సి ఉంది. మొత్తం 40-50 మంది కూరగాయల విక్రయదారులు కూర్చొని అమ్ముకునేలా గద్దెలు నిర్మించారు. ప్రధాన రహదారికి ఆనుకొని అందంగా తీర్చిదిద్దడంతో ఆ ప్రాంతవాసులను ఆకర్షిస్తోంది. పెద్ద మార్కెట్లకు పోటీగా చిన్న మార్కెట్లను నగరపాలక అభివృద్ధి చేస్తుండటంతో సమీప కాలనీవాసులకు సౌకర్యంగా ఉంటోంది. ప్రధాన మార్కెట్లకు రాకుండా దగ్గరుండీ తాజా కూరగాయలు కొనుగోలు చేయవచ్చు. కాలి నడకన, ఉదయం పూట నడకకు వచ్చే వారికి ఎంతో ఉపయోగపడనుంది. చైతన్యపురి మార్కెట్‌కు అయితే ఇతర గ్రామాల ప్రజలు సైతం వచ్చే అవకాశం ఉంది. ఇందిరానగర్‌-ఆదర్శనగర్‌ మార్కెట్‌ పూర్తయి ఆరు నెలలు కావస్తుండగా ఇప్పటికీ ప్రారంభోత్సవం చేయలేదు. ప్రస్తుతం చైతన్యపురి కూరగాయల మార్కెట్‌ నిర్మాణ పనులు పూర్తి కాగా దీనిని కూడా ప్రారంభించాల్సిన సమయం వచ్చింది.