మున్సిపల్ ఎన్నికలకు మొదలైన కసరత్తు

మంచిర్యాల, ఫిబ్రవరి 8, (way2newstv.com)
మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు పురరపాలక శాఖ ప్రాథమిక కసరత్తు ఆరంభించింది. మున్సిపల్ ఎన్నికలు-2019 పేరిట కరసత్తు మొదలెట్టింది. ఇప్పటికే పురపాలక శాఖ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏమేమి చేయాలన్న దానిపై ఈ ప్రత్యేక విభాగం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేయనుంది. పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, బైంసా, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల కసరత్తును పర్యవేక్షించే బాద్యతను కేటాయించారు. అలాగే నూతనంగా ఏర్పాటైన ఖానాపూర్ పురపాలక సంఘంలో సైతం ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు ప్రారంభించారు.ప్రస్తుతానికి బిసి ఓటర్ల గణనకు షెడ్యూల్‌ను విడుదల చేసి ఇప్పటికే విలీన గ్రామాలతో పాటు పాత మున్సిపల్ పరిధిలోని బిసి, ఎస్సి, ఎస్టి ఓటర్ల గణన నిర్వహించారు. గణనకు సంబంధించిన వివరాలను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. 



మున్సిపల్ ఎన్నికలకు మొదలైన కసరత్తు

ఈ అభ్యంతరాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేపట్టి తుది జాబితాను రూపొందించి రాష్ట్ర కార్యాలయానికి అందించనున్నారు. వీటి ఆధారంగానే మున్సిపల్ చైర్మన్ పదవులను రిజర్వ్ చేయనుంది. ఇక రాష్ట్ర కార్యాలయంలో పని చేసే ఎన్నికల విభాగం దశల వారీగా పనులు నిర్దేశించనున్నారు. వాటిని పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులు పని చేయనున్నారు. ఈ గణన ఆధారంగానే జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్ సీట్లు రిజర్వు అవుతాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుత పాలకవర్గాల గడువు 2019 జులై 3 వరకు ఉండగా ఇప్పటి నుంచే ప్రక్రియ ఆరంభించడం చర్చనీయాంశంగా మారింది. 2014 మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు.కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు దీరాక పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో ఏడు నెలల ముందుగానే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ఆరంభించడం చర్చనీయాంశమైంది. విలీన గ్రామాల విషయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల వారు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయంపై స్పష్టత రాలేదని అంటున్నారు. అయితే కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా సకాలంలో ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల వారీగా ఓటర్ల గణనను పూర్తి చేసిన అధికార యంత్రాంగం ఆయా వార్డులను సైతం ఎవరికి కేటాయించాలనే విషయంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. మరో ఆరు నెలల తరువాత నిర్వహించే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మున్సిపాలిటీల వారీగా ప్రత్యేక విభాగాలు పని చేస్తుండడం గమనార్హం.
Previous Post Next Post