సిట్టింగ్ ఎంపీకి కేసీఆర్ మార్క్...చికిత్స

ఖమ్మం, ఫిబ్రవరి 8, (way2newstv.com )
ముందస్తు ఎన్నికల ఫలితాలతో ఊపుమీదున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం సన్నద్ధం అవుతోంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలక వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ఆయన జాతీయ నేతలతో పలు దఫాలు చర్చలు కూడా జరిపారు. అంతేకాదు, ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం చేపట్టబోతున్నారు. మరోవైపు, ఇటీవల వెలువడుతున్న సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉండడంతో రాష్ట్రంలోని మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకుని, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే పలు వ్యూహాలు సిద్ధం చేసేశారు. 


సిట్టింగ్ ఎంపీకి కేసీఆర్ మార్క్...చికిత్స

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గానూ 16 గెలవాలన్న పట్టుదలతో ఆయన ఉన్నట్లు పలుమార్లు వెల్లడించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకే దాదాపుగా సీట్లు కేటాయిస్తానని చెబుతున్నారు. అయితే, కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే టీఆర్ఎస్ అభ్యర్థులను ఫైనల్ చేసే ప్రక్రియను ప్రారంభించిన ఆ పార్టీ అధినేత.. ఓ సిట్టింగ్ ఎంపీకి సీటు నిరాకరించబోతున్నారని సమాచారం. ఆయనే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వర్రావుపై పది వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణ వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పొంగులేటి కూడా కారెక్కేశారు. ఆయన టీఆర్ఎస్‌లో ఉన్నా ఆధిపత్య పోరు వల్ల ఆ పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నారని, ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ప్రతికూల ఫలితాలు రావడానికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డేనన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈయన వల్లే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం పది స్థానాల్లో టీఆర్ఎస్ ఒక్క చోట మాత్రమే విజయం సాధించిందని ఆ జిల్లాలోని నేతలు ఆరోపణలు చేస్తుండడడంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అయితే, ఆయన స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.
Previous Post Next Post