విశాఖపట్టణం, ఏప్రిల్ 5 (way2newstv.com)
విశాఖలో ఇపుడు హాట్ టాపిక్ గాజువాక సీటు. అక్కడ నుంచి బిగ్ సెలెబ్రిటీ పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. చాలా కాలం తరువాత ఓ ప్రముఖ సినీ నటుడు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తున్నారని చెప్పాలి. సరిగా పాతికేళ్ల క్రితం అంటే 1994 ఎన్నికల్లో అన్న నందమూరి తారక రామారావు అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత మళ్ళీ సినీ ప్రముఖులు ఎవరూ ఈ వైపు చూడలేదు. ఇక పవన్ విషయానికి వస్తే అనూహ్యంగా ఆయన ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక్కడ నుంచి పోటీ పడడం ద్వారా ఉత్తరాంధ్రా జిల్లాల్లో హవా చాటాలాని ఆయన ఆరాటంగా కనిపిస్తోంది. అయితే అన్ని చోట్లా బలమైన అభ్యర్ధులు లేని కారణంగా కనీసం విశాఖలోనైనా పవనాలు అనుకూలంగా వీస్తాయని పవన్ అంచనా వేస్తున్నారు.ఇవన్నీ ఇలా ఉంచితే అసలు పవన్ గాజువాకలో గెలుస్తారా అన్న డౌట్లు అందరిలోనూ ఇంకా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్ధి పల్లా శ్రీనివాస్ బలంగా ఉన్నారు.
జనసేనకు అభిమానుల అండ దొరికేనా
అతి పెద్ద సామాజికవర్గం యాదవులు ఆయన వెంట ఉన్నారు. పల్లాకు కార్మిక వర్గాల్లో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. దానికి తోడు బంధుగణం గాజువాక అంతటా ఉంది. పక్కా లోకల్ ముద్ర ఉండడమే కాకుండా పిలిస్తే పలుకుతాడు అన్న పేరు కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, గాజువాక భూ సమస్యకు పరిష్కారం కనుగొనడంతో ఓటు బ్యాంక్ బాగానే పటిష్టంగా ఉంది. దాంతో పవన్ గెలుపు పై టీడీపీ గట్టి పట్టు పడుతోంది.మరో వైపు చూసుకుంటే వైసీపీ కూడా బలంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి ఇప్పటికి అచ్చంగా మూడవసారి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రతీ ఎన్నికకూ తన బలాన్ని పెంచుకుంటూ పోతున్నారు. మొదటిసారి 2009 ఎన్నికల్లో పోటీ చేసినపుడు 34 వేల ఓట్లను తెచ్చుకుని రన్నర్ గా నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మూడవ స్థానం వచ్చింది. ఇక 2014 నాటికి వైసీపీ తరఫున పోటీ చేసి 75 వేల ఓట్లను తెచ్చుకున్నారు. ఇపుడు ఏకంగా లక్ష ఓట్లు తనకు వస్తాయని నాగిరెడ్డి ధీమాగా ఉన్నారు. దానికి లెక్కలు ఆయనకు ఉన్నాయి. తన ఓటు బ్యాంక్ ఎక్కడా చీలలేదని, పైగా గతం కంటే పెరిగిందని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు.ఇక జనసేనకు అండదండలు అభిమానులు అనే చెప్పుకోవాలి. వీరాభిమానులు పవన్ పార్టీలో ఉన్నారు. వారంతా జనసేన గెలుపు కోసం పరిశ్రమిస్తున్నారు. పైగా ఇక్కడ కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు పవన్ని గెలిపిస్తారని జనసేన కోటి ఆశలు పెట్టుకుంది. ఐతే నాన్ లోకల్ నినాదం బాగా ఉంది. అలాగే జనసేనకు నిర్మాణాత్మక బలం లేదు. దాంతో బూత్ లెవెల్ వరకూ పార్టీని తీసుకెళ్ళి ఓట్లు వేయించే యంత్రాంగం లేదు. పైగా మిగిలిన రెండు పార్టీలు గట్టిగా ఉన్నాయి. దాంతో పవన్ గెలుపు అన్నది ప్రభంజనమైన అభిమానం ఉంటేనే తప్ప సాధ్యపడని అంటున్నారు. చూడాలి మరి