రామసుబ్బారెడ్డి వర్గంలో మోదం.... ఆది వర్గంలో ఖేదం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రామసుబ్బారెడ్డి వర్గంలో మోదం.... ఆది వర్గంలో ఖేదం

కడప, ఫిబ్రవరి 13, (way2newstv.com)
జమ్మలమడుగు పంచాయతీ కొలిక్కి వచ్చిందా? పైకి అంతా ఓకే గా కన్పిస్తున్నప్పటికీ ఎన్నికల సమయానికి రెండు వర్గాలు ఒక్కటవుతాయా? నేతలు ఒక్కటయినా క్యాడర్ వారి కలయికను సమర్థిస్తుందా? జమ్మలమడుగును వదులుకునేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గం అంగీకరిస్తుందా? ఎంపీగా గెలవలేనని తెలిసీ ఆదినారాయణరెడ్డి ఈ ప్రతిపాదనకు అంగీకరించడానికి కారణమేమైనా ఉందా? ఇవే ప్రశ్నలు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమమయ్యాయి.జమ్మలమడుగు పంచాయతీ తీరిపోయిందని అంతా అనుకుంటున్న దశలో ఆ నియోజకవర్గంలో కొత్త చర్చ మొదలయింది. 


రామసుబ్బారెడ్డి  వర్గంలో మోదం.... ఆది వర్గంలో ఖేదం

కడప లోక్ సభకు ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తారు. ఇందుకు ఆయన అంగీకారం తెలిపారు. జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం నుంచి రామసుబ్బారెడ్డి పోటీ చేస్తారు. ఆయనకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆది నారాయణరెడ్డి కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారు. ఇంత జరిగినా ఒకరి గెలుపునకు ఒకరు సహకరించుకుంటారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అనే చెప్పాలి.ఎందుకంటే చంద్రబాబుతో పంచాయతీ ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు కలసి జమ్మలమడుగులో పర్యటించిన సందర్భం లేదు. వేర్వేరుగా తమ అనుచరులతో సమావేశమయిన తీరు ఇందుకు అద్దం పడుతుంది. ఈ ప్రతిపాదనపై ఆదినారాయణరెడ్డి అనుచరుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేగా ఉంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మంత్రి పదవి వస్తుందని, ఎంపీగా పోటీ చేస్తే ఏమొస్తుందన్న అనుచరుల ప్రశ్నలకు మంత్రి ఆదినారాయణరెడ్డి సమాధానం చెప్పలేకపోతున్నారు.రామసుబ్బారెడ్డి వర్గంలో మాత్రం జోష్ కన్పిస్తోంది. చాలా రోజుల తర్వాత తమ నేతకు వచ్చిన అవకాశంగా వారు చెప్పుకొంటున్నారు. రామసుబ్బారెడ్డి వరుస ఓటములతో ఆయన క్యాడర్ కుంగిపోయి ఉంది. ఈసారి ఆదినారాయణరెడ్డి కూడా జత కలవడంతో తమ నేత గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని వారు భావిస్తున్నారు. కానీ ఆదినారాయణరెడ్డి వర్గం మాత్రం రామసుబ్బారెడ్డిని పరోక్షంగా దెబ్బకొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తున్నాయి. ఒక్కసారి జమ్మలమడుగు తమ చిరకాల ప్రత్యర్థి చేతిలోకి వెళితే తమ నేత రాజకీయ జీవితం ఇబ్బందుల పాలవుతుందని ఆది అనుచరులు భావిస్తున్నారు. సో….అనుకున్నంత ఈజీ కాదు రెండు వర్గాలు కలవడం అన్నది జమ్మలమడుగులో విన్పిస్తున్న మాట.