మార్కెట్ ను ముంచెత్తుతున్న వేరుసెనగ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మార్కెట్ ను ముంచెత్తుతున్న వేరుసెనగ

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 23, (way2newstv.com)
వరుసగా వచ్చిన వర్షాభావ పరిస్థితులతో గత కొన్నేళ్ల నుంచి వేరుశనగ పంట దిగుబడి నామమాత్రంగానే ఉండేది. ఎంజికెఎల్‌ఐ కాలువల ద్వారా చెరువులను నింపడంతో భూగర్భ జలాలు పెరగడంతో ఈ యాసంగిలో రైతులు తమ పొలాలలో వేరుశనగను భారీగా విత్తుకోవడం జరిగింది. కాలువల ద్వారా నీరు రావడం, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతో రైతులు తమ పొలాలకు సరిపడు నీరు అందించారు. దీనితో వేరుశనగ గింజ గట్టిగా ఉండి అధిక దిగుబడులు వచ్చాయి. గత వారం రోజుల నుంచి నాగర్‌కర్నూల్ మార్కెట్‌యార్డుకు భారీగా వేరుశనగ అమ్మకం కోసం రైతులు తెస్తున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో వేరుశనగకు మంచి ధర ఉన్నప్పటికి, మార్కెట్‌కు భారీగా వేరుశనగ దిగుబడులు వస్తుండటంతో ఒక్కసారిగా ధర తగ్గిందని చెప్పవచ్చు. స్థానిక మార్కెట్‌యార్డులో వ్యాపారుల మాయాజాలం అధికారుల సహాయ సహకారాలతో కొనసాగుతుండటంతో రైతులకు గిట్టుబాటు ధర అందడంలేదు. రైతులు ఎవరి వద్ద అప్పులు తీసుకుంటారో వారికే తమ దిగుబడులను అమ్ముకోవాల్సి వస్తుంది, దీనికి వ్యాపారికి సంబంధించిన స్థలంలోనే వాటిని కుప్పలుగా పోస్తే ఆ వ్యాపారే ధర నిర్ణయించడం జరుగుతోంది. 


 మార్కెట్ ను ముంచెత్తుతున్న వేరుసెనగ

మిగతా వ్యాపారులు అతి తక్కువగా టెండర్‌లో కోడ్ చేస్తారని, రైతుకు చెందిన ఆసామియే దానిని ధర నిర్ణయించి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒకరి స్థలంలో, మరో వ్యాపారి ఎట్టిపరిస్థితులలో కూడా కొనుగోలు చేయరు. ఈ విషయం సంబంధిత మార్కెట్‌యార్డు అధికారులకు తెలిసే జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు ఇప్పటి వరకు సుమారు 15వేల క్వింటాళ్ల వేరుశనగ రాగా, రాబోయే మరికొన్ని రోజుల్లో ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. మంగళవారం స్థానిక మార్కెట్‌యార్డులో వేరుశనగ ధరలను పరిశీలిస్తే కనీస మద్దతు ధరగా రూ.3800లు ఉండగా, గరిష్ట్ధర రూ.5200గా, కనిష్ట్ధర రూ.4011గా ఉంది. సరాసరి నాగర్‌కర్నూల్ మార్కెట్‌యార్డులో వేరుశనగను 4900 చొప్పున కొనుగోలు చేసినట్లు అధికార రికార్డులు తెలుపుతున్నాయి. మార్కెట్‌యార్డుకు వచ్చిన దాంట్లో ఎక్కువగా రూ.3800 నుంచి రూ.4300ల మధ్యనే కొనుగోలు చేశారని, గరిష్ట ధరతో కొద్దిగానే కొనుగోలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏ ధరకు ఎంత కొనుగోలు చేశారో రికార్డు ఉంటే వాస్తవాలు తెలుస్తాయన్నారు. వేరుశనగ గింజ కూడా గట్టిగా ఉండటంతో మంచి ధర వస్తుందని ఆశించామని, కాని వ్యాపారులు సిండికేట్‌గా ఉండి ధరను నిర్ణయిస్తుండటంతో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుందని పలువురు రైతులు వాపోతున్నారు. యాసంగిలో వేరుశనగ పంట మంచిగా పండినందున మంచి ధర వస్తుందని, అప్పులు తీరుతాయని ఆశించామని, కాని ధరలేకపోవడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న, వరి, కందులు మాదిరిగానే వేరుశనగను కూడా ప్రభుత్వం నూనె గింజల ఉత్పత్తి ద్వారా కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటేనే మాకు గిట్టుబాటు ధర వస్తుందని, ఈ మేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలన్నారు