వరంగల్, ఫిబ్రవరి 2, (way2newstv.com)
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నాణ్యమైన రహదారులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలి సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ శాఖను ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో ఆ శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఏ పంచాయతీలో రోడ్ల విస్తీర్ణం ఏ మేరకు ఉంది, దాని నాణ్యత ఎలా ఉంది, మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఎలాంటిది, ఎంత ఖర్చవుతుంది, ఎన్ని చోట్ల కొత్తగా రోడ్లు వేయాల్సి ఉంటుంది తదితర వివరాలన్నింటినీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పంచాయతీల పరిధిలో ఉన్న మొత్తం రోడ్లలో 6617 కి.మీ. మేర రోడ్లు మట్టిరోడ్లేనని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అన్ని పంచాయతీలకు బి.టి. రోడ్లను నిర్మిస్తామని సిఎం స్పష్టం చేసినందున ప్రస్తుతం పంచాయతీల్లో గ్రావెల్ (మట్టి) రోడ్ల విస్తీర్ణం ఎంత ఉంది, దాని స్థానంలో బి.టి.రోడ్లను నిర్మించడానికయ్యే ఖర్చు తదితరాలపై అధ్యయనం జరుగుతోంది.
పంచాయితీల్లో బీటీ రోడ్లపై అధ్యయనం
రహదారుల నిర్మాణంతో పాటు నిర్వహణ విషయంలోనూ ఆ శాఖ అధికారులు దృష్టి పెడుతున్నారు. రహదారుల నిర్మాణం కోసం నిధుల కొరత లేదని స్వయంగా సిఎం స్పష్టం చేయడంతో రంగంలోకి దిగిన ఇంజనీరింగ్ అధికారులు రహదారుల నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. రహదారుల నిర్మాణానికి వేసవి కాలమే అనుకూలం కావడంతో అప్పటికల్లా అన్ని గ్రామాల్లో రహదారులను సిద్దం చేసే దిశగా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్లకు రూ.12 వేల కోట్లను కేటాయించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం కోసం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో మరింత పెద్దఎత్తున నిధులను కేటాయించే అవకాశం ఉంది. గ్రామాల్లోని మట్టి రోడ్లు త్వరలో బిటి రోడ్లుగా రూపుదిద్దుకోనున్నాయి. రోడ్ల నిర్మాణంతో పాటే ఇరవైపులా మొక్కలను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆ శాఖ అధికారులు ప్రణాళికలోనే పొందుపర్చనున్నారు
Tags:
telangananews