కర్నూలు, ఫిబ్రవరి 4 (way2newsv.com): త్వరితగతిన పనులు పూర్తి చేసేలా పాఠశాలల వారీగా కాంట్రాక్టర్లు పనులు అప్పగించారు. ఇప్పటివరకు పరిశీలిస్తే కేవలం ఐదు ప్రహరీలు మాత్రమే పూర్తయ్యాయి. 95 పాఠశాలల వద్ద వివిధ దశల్లో ఉండగా 180 పనులు నేటికీ ప్రారంభించలేదు. ఉపాధి హామీ నిధుల కింద పనులకు రూ.48.74 కోట్లు కేటాయించారు. పనులను పూర్తిచేయగల కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా రాజకీయ నేతల సిఫార్సుల మేరకు ఎవరికిపడితే వారికి అప్పగించారు. ఫలితంగా పనుల మధ్యలోనే బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. కాస్త ఊరటగా ఉపాధి నిధులు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ నిధులు వస్తే తుదిదశలో ఉన్న నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
బడులకు రక్షణేదీ..? (కర్నూలు)
ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులు రాత్రైతే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. చీకటి పడితే మైదానాల్లో మందుబాబులు హల్‌చల్ చేస్తున్నారు. తలుపులు పగలగొట్టి కంప్యూటర్లు, విలువైన వస్తువులు చోరీ చేస్తున్నారు. ఇలాంటి వాటి నుంచి రక్షణ కల్పించేందుకు ప్రహరీల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. క్షేత్రస్థాయిలో అడుగులు ముందుకు పడని పరిస్థితి. నిధుల కోసం కొన్నిచోట్ల గుత్తేదారులు ఎదురు చూస్తుండగా.. మరికొన్నిచోట్ల గ్రూపు రాజకీయాలతో పనులే ప్రారంభం కావడం లేదు.
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీల నిర్మాణానికి గతేడాది ఆగస్టు నుంచి అధికారులు శ్రీకారం చుట్టారు. కస్తూర్బా, ఏపీ మోడల్ పాఠశాలలు, ఉన్నత, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత వంటి 215 పాఠశాలల్లో 280 ప్రహరీల నిర్మాణాలను మూడు విడతలుగా చేసేలా ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 1,16,649 మీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని గుత్తేదారులకు లక్ష్యం విధించారు. పనులను మండలాభివృద్ధి అధికారులు కేటాయించగా సమగ్ర శిక్షాభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) పర్యవేక్షణ చేస్తోంది.
ప్రహరీల నిర్మాణంలో కొన్నిచోట్ల స్థల హద్దుల సమస్యలతో పది వరకు నిలిచిపోయాయి. మరికొన్ని గ్రూపు రాజకీయాలతో అటకెక్కాయి. ప్రధానంగా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో వైసీపీ, టీడీపీ నేతలు మేం చేస్తామంటే మేం చేస్తామంటూ పనుల కోసం పోటీపడ్డారు. ఇక్కడ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన వ్యక్తి అవడం, అధికార పార్టీ బాధ్యుడు నిధులు మంజూరు చేయిస్తుండడంతో పనుల విషయంలో పొంతన కుదరడం లేదు. రచ్చుమర్రి మోడల్ స్కూలు, వగరూరు ఉన్నత పాఠశాలలో ఇదే పరిస్థితి నెలకొంది. కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీలోనే రెండు వర్గాలు ఉండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే మణిగాంధీ, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విష్ణువర్దన్‌రెడ్డి మధ్య విబేధాలతో ప్రహరీల నిర్మాణాలు అసలు మొదలే కాలేదు. ఇలా ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారు 30 పాఠశాలల్లో పనులు ఆగిపోయాయి.
కర్నూలు కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సెలవుల తర్వాత వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. తాళాలు పగులగొట్టి మరీ మద్యం, విందు చేసుకున్నట్లు ఆనవాళ్లు కనపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడుమూరు నియోజకవర్గ పరిధి సి.బెళగల్‌లోని ముడుమాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు బెంచీలకు నిప్పు పెట్టినట్లు ఫిర్యాదు అందింది. ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే. నిత్యం విద్యను అభ్యసించాల్సిన తరగతి గదుల్లోకి అడుగుపెట్టగానే విద్యార్థుల కంటపడుతున్నవి చాలానే ఉంటున్నాయి. కొన్ని పాఠశాలల్లో మద్యం సీసాలు, కండోమ్‌లు, కాల్చి పడేసిన సిగరెట్లు, పేకముక్కలు దర్శనమిస్తున్నాయి. కొందరు యువకులు సాయంత్రం వేళల్లో మైదానాల్లో కూర్చొని పార్టీలు చేసుకుంటున్నారు. ఈమధ్యకాలంలో ఫ్రీ ఫ్యాబ్రిక్ మరుగుదొడ్లు నిర్మించగా రాత్రి సమయాల్లో నీటి ట్యాంకులు, కొన్ని సామగ్రిని దొంగలించడంతోపాటు మరుగుదొడ్ల తలుపులు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే విద్యాలయాల్లో కంప్యూటర్లు అపహరణకు గురైనట్లు కేసులు సైతం నమోదయ్యాయి. ఇలాంటి వాటి నుంచి రక్షణ కల్పించాలంటే ప్రహరీలు పూర్తి చేసి గేట్లు ఏర్పాటుచేయాలని స్థానికులు విన్నవిస్తున్నారు. సాయంత్రం వేళల్లో పోలీసుల గస్తీతోపాటు ప్రత్యేకంగా వాచ్‌మెన్‌లను ఏర్పాటుచేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు.
Tags:
telangananews