ఏపీలో టిక్ టాక్ రాజకీయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో టిక్ టాక్ రాజకీయాలు

నెల్లూరు, ఫిబ్రవరి 21, (way2newstv.com)
ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కిపోయాయి అనడానికి సోషల్ మీడియా చూస్తే చాలు. ఇప్పుడు కామెడీ కోసం అంతా చేస్తున్న టిక్ టాక్ నుంచి అన్నిటా రాజకీయాలే దర్శనమిస్తున్నాయి. టైమింగ్ ను ఉపయోగించుకుని రైమింగ్ తో రెచ్చిపోతున్నారు నెటిజెన్లు. ఇటీవల ఒక వీడియో లో నిరుపేద మహిళ టిక్ టాక్ లో చేసిన కామెంట్స్ నే కాపీ చేసి మరికొందరు ఎవరికి నచ్చినట్లు వారు పోస్ట్ చేసేస్తూ హడావిడి మొదలు పెట్టారు. మా చంద్రన్న పసుపు కుంకుమ కింద పదివేలు ఇచ్చాడు. చంద్రన్న సెల్ పంపాడు మరి ఓటెవరికి వేస్తారు అని అడిగితే ఇంకెవరికి జగన్నన్నకు అంటూ సాగే ఈ సంభాషణ నెటిజెన్లను కడుపుబ్బా నవ్విస్తుంది.వరుసపెట్టి టిడిపి నుంచి వైసిపిలోకి సాగుతున్న వలసల నేపథ్యంలో మరో వార్త సంచలనమే అయ్యింది.


ఏపీలో టిక్ టాక్ రాజకీయాలు

బ్రేకింగ్ న్యూస్ పేరుతో ఫేక్ న్యూస్ లు టీవీల్లో వచ్చినట్లు తయారు చేసే ఫోటోలు వీడియో లు ప్రజలను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నాయి. తాజాగా నెటిజెన్ల బారిన పడ్డారు టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు. ఇటీవల పాలిట్ బ్యూరో సమావేశానికి డుమ్మా కొట్టడం అధినేతపై అలిగి అంటీముట్టనట్లుగా ఉంటున్న తీరును పూర్తిగా వాడేసుకుంటున్నారు కొందరు. వైసిపిలోకి అశోక్ గజపతి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టేశారు. టిడిపి కి చెందిన ఎంపి లు ఎమ్యెల్యేలు వెళ్ళిన నేపథ్యంలో ఈ ఫేక్ వార్తలను ప్రజలు ముందు నమ్మేస్తూ తరువాత నిజం తెలిసాక నవ్వుకుంటున్నారు.ఇటీవల మెగాస్టార్ సోదరుడు నాగబాబు పరోక్షంగా జనసేన కు తనవంతు సాయం చేస్తూ వస్తున్నారు. నా ఛానెల్ నాఇష్టం అంటూ యూట్యూబ్, ఫేస్ బుక్ లలో తన వ్యాఖ్యలు తోను చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ పోస్ట్ చేస్తూ, ఛానెల్స్ పత్రికల్లో వచ్చే వార్తలపైనా తనదైన శైలిలో సెటైర్స్ విసురుతున్నారు ఆయన. తాజాగా నాగబాబు టిడిపి పై చిన్న వీడియో తయారు చేసి సెటైర్ విసిరారు. ఒక చిన్నారి సైకిల్ తొక్కుతుంటే, మరో చిన్నారి సైకిల్ కిందపడేసి కాలితో తన్నుతూ ఉంటాడు. కాసేపటి తరువాత ఆ వీడియో లో ప్రత్యక్షమైన నాగబాబు సైకిల్ తొక్కితే ఆరోగ్యం. సైకిల్ ను తొక్కేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆరోగ్యం అంటూ తెలుగుదేశం సింబల్ తో ఒక ఆట ఆడుకున్నారు. ఇలా ఎవరికీ తోచినట్లు వారు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచార యుద్ధం పార్టీల్లో దడ పుట్టించేస్తుంది. సినిమాలు, సీరియల్స్ కన్నా ప్రజలకు వినోదాన్ని పంచి పెడుతూ ఉండటం విశేషం.