కన్ఫ్యూజన్ లో కోడెల
గుంటూరు, ఫిబ్రవరి 7, (way2newstv.com)
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. రాజకీయ వ్యూహం ఏంటి? ఆయన ఎలా అడుగులు వేయాలని అనుకుంటు న్నారు. మరో రెండు మాసాల్లోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు? ఇప్పుడు గుంటూరు రాజకీయ తెరమీద ఇలాంటి ప్రశ్నలు ఎన్నో కదలాడుతున్నాయి. ముఖ్యంగా కొందరైతే.. కోడెల సార్ కన్ఫ్యూజ్ అయి.. పార్టీని కూడా కన్య్పూజ్ చేస్తున్నారా? అని చర్చించుకుంటున్నారు. మరి ఇంతగా ఎందుకు ఒక్కసారి కోడెల సెంట్రిక్‌గా గుంటూరు టీడీపీ రాజకీయం మారిపోయింది? అనేది చూద్దాం.అన్నగారు ఎన్టీఆర్ హయాంలోనే టీడీపీలోకి వచ్చిన కోడెల ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా కూడా పార్టీని విడిచి పెట్టక పోగా ఎప్పుడూ ఆయన పార్టీకి ఏదో ఒకరూపంలో అండగా నిలుస్తూనే ఉన్నారు.
సత్తెనపల్లా... నరసరావు పేట...
తను ఎదిగిన నియోజకవర్గం నరసరావు పేటపై ఆయనకు మక్కువ ఎక్కవ. అలాగని ఆయన ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదు. పార్టీ అధిష్టానం చెప్పినట్టు ఆయన నడుచుకున్నారు. తనంత సీనియర్ పార్టీలో చాలా తక్కువ మంది ఉన్నా.. ఏనాడూ ఆయన పార్టీ లైన్‌ను వ్యతిరేకించి మాట్లాడిందికానీ, అధిష్టానం చంద్రబాబు ఆదేశాలను దాట వేసింది కానీ లేవనేది అక్షర సత్యం. ఇలాంటి నేపథ్యంలోనే గత 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ చెప్పినట్టు తన సొంత నియోజకవర్గం నరసరావు పేటను వదులుకున్నారు. గుంటూరులోని కీలకమైన మరో నియోజకవర్గం సత్తెన పల్లినుంచి పోటీ చేసి .. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై 700 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, మరో రెండు మాసాల్లోనే జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కోడెలముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేయాలా? లేదు సత్తెన పల్లి నుంచి బరిలోకి దిగాలా? అనే ది ప్రధాన ప్రశ్న. ఈ రెండు విషయాల్లో ఇప్పటి వరకు కూడా కోడెల తన నిర్ణయాన్ని అధిష్టానం ముందు వ్యక్తీకరించలేదు. నిజానికి ఇప్పుడు చంద్రబాబు కోడెల కోరుకున్న సీటును ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. అయితే, ఆయన వదులుకునే సీటులో కొత్త అభ్యర్థిని ప్రకటించాలి.నరసరావు పేటను వదులుకున్నా.. ఇక్కడ కొత్త అభ్యర్థి అవసరం. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పుంజుకుని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొంత కష్టపడాలి. లేదు. సత్తెనపల్లిని వదులుకున్నా.. ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోడెల తనన నిర్ణయాన్ని ముందుగానే ప్రకటిస్తే.. మంచిదికదా? ! అంటున్నారు తమ్ముళ్లు. ఆయన చివర్లో నిర్ణయం తీసుకుని ఎక్కడ పోటీ చేసినా ఆయన ఖాళీ చేసే మరో నియోజకవర్గంలో అప్పటికప్పుడు కొత్త అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీకి ఇబ్బంది తప్పదు. మరి స్పీకర్ గారు ఏం ఆలోచిస్తున్నారో … ఆయన పోటీ విషయంలో కన్‌ఫ్యూజన్ ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను, జిల్లా పార్టీని తీవ్రమైన గందరగోళంలో పడేస్తోందన్నది మాత్రం నిజం.
Tags:
Andrapradeshnews