ఏపీలో సగం హేచరీస్ కాకినాడలోనే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో సగం హేచరీస్ కాకినాడలోనే

కాకినాడ, ఫిబ్రవరి 22, (way2newstv.com
తుని నుంచి కాకినాడ వరకు బీచ్‌ రోడ్డులో అడుగడుగునా హేచరీలు దర్శనమిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక హేచరీలు ఉన్న తీరంగా దీనికి గుర్తింపు ఉంది.ఇటీవలి కాలంలో రొయ్యల సాగు పెరగడంతో వాటితో పాటు కొత్త హేచరీల ఏర్పాటు వేగంగా జరుగుతోంది.ఆదాయం బాగుందన్న  కారణంతో సీఏఏ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న హేచరీలపై ఇటీవల అధికారులు దాడులు నిర్వహించారు. వీటి వల్ల రైతులు నష్టపోతున్నారన్న  కారణంతో అనధికారిక హేచరీలను మూసివేశారు.రాష్ట్రంలో నాలుగు వందలకు పైగా హేచరీలు ఉండగా వాటిలో సగభాగం కాకినాడ తీరంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు రొయ్య పిల్లలను ఎగుమతి చేస్తున్నారు.


ఏపీలో సగం హేచరీస్ కాకినాడలోనే

హేచరీల నిర్వహణకు అనుమతులు తీసుకోవడం నిర్వాహకులకు సవాలుగా మారుతోంది. 2014-15 వరకు హేచరీలకు సంబంధించి పెద్దగా నిబంధనలు ఉండేవి కావు. 2009 నుంచి సీఏఏ (కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ) నిబంధనల అమలు తప్పనిసరి చేశారు.గతంలో పంచాయతీ అనుమతి ఉంటే హేచరీ పెట్టుకునే వెసులుబాటు ఉండడంతో వీటిని పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేశారు. అనంతరం సీఏఏ నిబంధనలు పాటించాలని చెప్పడంతో కొందరు తమ హేచరీలను సీఏఏ నిబంధనల ప్రకారం మార్పు చేసుకున్నా ఇప్పటికీ మరికొంత మంది ఎలాంటి అనుమతులు లేకుండానే హేచరీలు నిర్వహిస్తున్నారు. కాకినాడ తీరంలో తుని నుంచి ఉప్పాడ వరకు బీచ్‌రోడ్డులో సుమారు 200 హేచరీలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం హేచరీల్లో నిబంధనల ప్రకారం మౌలిక వసతులు లేవు.నాణ్యమైన రొయ్య పిల్లలు తయారు చేయాలంటే ఒక్కో రొయ్య పిల్లకు 19 పైసలు నుంచి 20 పైసల వరకు ఖర్చవుతుందని జాతీయ హేచరీల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ లక్కరాజు పేర్కొన్నారు.కాకినాడ తీరంలో ఉన్న హేచరీల్లో సీఏఏ నిబంధల ప్రకారం గుర్తింపు ఉన్నవి 80 వరకు ఉన్నాయి.రాష్ట్రంలో నెల్లూరు, ఒంగోలు, విశాఖ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో హేచరీలు ఏర్పాటు చేశారు.
ఏటా 50 బిలియన్ల సీడ్‌ ఉత్పత్తి మన రాష్ట్రంలో ఉన్న హేచరీల నుంచి ఏటా సుమారు 50 బిలియన్ల సీడ్‌ ఉత్పత్తి అవుతుందని సత్యనారాయణ లక్కరాజు చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమ్‌ బంగా, గుజరాత్‌ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రొయ్య పిల్లలను ఎగుమతి చేస్తున్నారు. ఏటా రూ.1000 కోట్ల టర్నోవర్‌ జరుగుతుంది.హేచరీల నిర్వహణకు సంబంధించి కాకినాడ తీర ప్రాంతం అనుకూలంగా ఉన్నా అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురవడం వల్ల హేచరీల నిర్వాహకులు సీఏఏ అనుమతులు పొందేందుకు వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది.