అమంచి ఎగ్జిట్ తో కరణానికి కలిసొచ్చింది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమంచి ఎగ్జిట్ తో కరణానికి కలిసొచ్చింది

ఒంగోలు, ఫిబ్రవరి 23, (way2newstv.com)
కరణం బలరాం.. పరిచయం అక్కరలేని పేరు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్న తనది, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. అయితే అది నిన్నటి మాట. ఇప్పుడు కరణం నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి కరణాన్ని పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో పార్టీ అధిష్టానం ఉండటంతో ఇది ఆయనకు కలసి వస్తుందా? రాదా? అన్న చర్చ ప్రారంభమయింది. నిజానికి కరణానికి..చీరాలకు ఏమాత్రం సంబంధం లేదు. జిల్లాలో పేరున్న నేత కావడంతో ఆయనను చీరాలలో పోటీకి దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.చీరాల నియోజకవర్గంలో ఇటీవల పార్టీని వీడిన ఆమంచికి మంచి పట్టుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా, 2014 లో సొంతంగా నవోదయ పార్టీని పెట్టి దానిపై పోటీ చేసినా విజయం ఆమంచినే వరించింది.


అమంచి ఎగ్జిట్ తో కరణానికి కలిసొచ్చింది

ఈ రెండు ఎన్నికల్లో గెలుపునకు ఆమంచి వ్యక్తిగత పరిచయాలు, పట్టు కారణమని చెప్పకతప్పదు. ఆమంచి పార్టీని వీడనంతవరకూ చీరాలపై పెద్దగా టీడీపీ ఆలోచనను పెట్టలేదు. చీరాల టిక్కెట్ తమ ఖాతాలోనే వేసుకుంది టీడీపీ. కానీ ఆమంచి ఊహించని విధంగా పార్టీకి గుడ్ బై చెప్పడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఐదేళ్ల పాటు అభివృద్ధి పనుల పేరిట వందల కోట్ల నిధులు మంజూరు చేయించుకుని మరీ ఆమంచి దెబ్బ తీశారని చంద్రబాబు సయితం సీనియర్ల సమావేశంలో వ్యాఖ్యానించడం గమనార్హంఅయితే ఆమంచిని ఎదుర్కొనే లీడర్ చీరాలలో లేరనే చెప్పాలి. ఎమ్మెల్సీ పోతుల సునీత, జజ్జనం శ్రీనివాసరావు లాంటి వారు ఆమంచికి పోటీ ఇవ్వలేరని అధిష్టానానికి తెలియంది కాదు. అందుకే ఆమంచి పార్టీని వీడిన వెంటనే కరణం బలరాంను చీరాలకు ఆఘమేఘాల మీద పంపింది. కరణం బలరాంకు ఇప్పటి వరకూ ఎక్కడ టిక్కెట్ కేటాయించాలన్న దానిపై స్పష్టత లేదు. కరణం బలరాంకు అద్దంకి లో ఉన్న బలం చీరాలలో లేదు. అయితే జిల్లా స్థాయిలో ఆయనకు పట్టు ఉండటంతో కరణాన్ని అక్కడకు పంపారంటున్నారు. ఆమంచి పార్టీని వీడిన వెంటనే చీరాలలో బాణాసంచా కాల్చింది కూడా కరణం బ్యాచే. చంద్రబాబు నుంచి కూడా పోటీకి రెడీగా ఉండాలని కరణానికి సమాచారం అందిందంటున్నారుదీంతో కరణం బలరాం గత కొద్దిరోజులుగా చీరాలలోనే మకాం వేశారు. తెలుగుదేశం క్యాడర్ చెదిరిపోకుండా సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఆమంచిపై ప్రతి సమావేశంలోనూ విరుచుకుపడుతున్నారు. తాను బీసీలకే చీరాల టిక్కెట్ ఇవ్వాలని కరణం బహిరంగ సభల్లో స్పష్టం చేయడం వెనక కూడా తాను పోటీ చేస్తే ఆ ఓటు బ్యాంకు తనకు దక్కాలనే ఆ వ్యాఖ్యలు చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. చీరాలలో టీడీపీ జెండా ఎగరాలంటే కరణం ఒక్కరే కరెక్ట్ కాండిడేట్ అని అధినేత నమ్ముతున్నారు. అందుకోసమే కరణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే స్థానికంగా బలంగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను నాన్ లోకల్ అయిన కరణం బలరామకృష్ణమూర్తి ఢీకొనడం అంత ఈజీకాదు. మొత్తం మీద చీరాలలో ఇద్దరు కృష్ణుల మధ్య పోరు రసవత్తరమనే చెప్పాలి