ఖమ్మం కాంగ్రెస్ లో కుమ్ములాటలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఖమ్మం కాంగ్రెస్ లో కుమ్ములాటలు

భట్టి సన్మానికి దూరంగా నేతలు
ఖమ్మం, ఫిబ్రవరి 6, (way2newstv.com)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాల్లో 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొత్తం 4 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సత్ఫలితాలు సాధించినప్పటికీ గెలిచిన ఎమ్మెల్యేల్లో సయోధ్య లేకపోవడంతో పార్టీ శ్రేణులు మరింత ఇబ్బంది పడుతున్నాయి. ఈ జిల్లాకే చెందిన మధిర శాసనసభ్యుడు మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనప్పటికీ మిగిలిన ఐదుగురు శాసన సభ్యులు ఆయనకు పూర్తిస్థాయిలో మద్దతు పలికిన దాఖలాలు లేవు. సీఎల్‌పీ నేతగా ఎన్నికైన మల్లు భట్టివిక్రమార్కకు ఖమ్మం నగరంలో ఘన సన్మానం ఏర్పాటు చేయగా దీనికి కాంగ్రెస్ శాసనసభ్యుల్లో ఒకరిద్దరు మినహా ఎవరూ హాజరు కావడం లేదని తెలిసింది. 

 
ఖమ్మం కాంగ్రెస్ లో కుమ్ములాటలు

కేవలం భట్టి అనుచరులు మాత్రమే సన్మానం సమాచారాన్ని అందరికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగూడెంలో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, పినపాకలో గెలిచిన రేగా కాంతారావులకు గతంలో కూడా శాసన సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు గతంలో భట్టితో ఉన్న విభేదాలతో ఈ సన్మానానికి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వనమా వెంకటేశ్వరరావు గతంలోనే రాష్టమ్రంత్రిగా పనిచేయగా, రేగా కాంతారావు భట్టికి అనుకూలంగా ఉండరని ప్రచారం ఉంది. మల్లు భట్టివిక్రమార్క పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేస్తున్నప్పటికీ ఆయన కేవలం మధిర నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యేవారని, దీంతో మిగిలిన నియోజకవర్గాలలోని నేతలు ఆయనతో సఖ్యతగా ఉండేవారు కాదని, అందుకే ప్రస్తుత పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు చెప్పారు. వీటికి తోడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో రేణుకాచౌదరి వర్గం, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గంతో పాటు తటస్థులు భట్టివిక్రమార్క సన్మాన సభకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. కాగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు గత ఏడాదిన్నర కాలంగా అధ్యక్షుడు లేకపోవడం, కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ ఇతర పార్టీలకు దీటుగా నిర్మాణ పరంగా వెనుకబడటం వల్లే కాంగ్రెస్ పార్టీ నేతల్లో నైరాశ్యం కనిపిస్తోంది. పార్టీ నేతల మధ్య ఉన్న స్వల్ప విభేదాలను చర్చల ద్వారా సమసిపోయేలా చేసే నేత కోసం శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా పనిచేసిన భట్టి ఖమ్మం జిల్లాకంటే ఇతర జిల్లాలపైనే అధిక దృష్టి కేంద్రీకరించారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ జిల్లాలో అధిక స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్ సత్తా చాటామని పార్టీ నేతలు చెబుతున్నారు. మండల స్థాయి నేతలను సైతం ఒక్క తాటిపైకి తెచ్చి నిర్మాణపరమైన చర్యలు తీసుకోకపోతే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే భవిష్యత్తు ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలవుతామని నేతలు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదని, త్వరలో జరిగే మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో సత్ఫలితాలు రావాలంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని నేతల మధ్య సయోధ్య అవసరమని, అందుకు భట్టివిక్రమార్క చొరవ చూపాలని, లేనిపక్షంలో ఇప్పటి పరిస్థితులే తిరిగి ఎదురవుతాయని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు తెలిపారు.