జీఐఎస్ పరిధిలోకి నిర్మాణాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జీఐఎస్ పరిధిలోకి నిర్మాణాలు

 అక్రమాల అడ్డుకట్టవేసేందుకు ప్లాన్
హైద్రాబాద్, ఫిబ్రవరి 6, (way2newstv.com)
 మహానగరంలో అక్రమ నిర్మాణాలు, అనుతుల ఉల్లంఘనకు బ్రేక్ వేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని బల్దియా భావిస్తోంది. ఇందుకుగాను సర్కిల్, జోన్, ప్రధాన కార్యాలయాల వారీగా అనుమతులు జారీచేసే సంబంధిత అధికారులే అనుమతి తీసుకున్న నిర్మాణదారుడు అనుమతి ప్రకారం నిర్మాణం చేపడుతున్నాడా లేదంటే దాన్ని ఉల్లంఘించి నిర్మిస్తున్నాడా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో మూడుసార్లు తనిఖీలు చేసి నిర్మాణం కొనసాగుతున్న తీరుకు సంబంధించి ఫొటోలను కొత్తగా ఏర్పాటు చేయనున్న మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్)లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది.


 జీఐఎస్ పరిధిలోకి నిర్మాణాలు

 అనుమతులను జారీ చేసే సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారులు అనుమతి జారీ అయిన తర్వాత పునాదుల దశలో ఓసారి, స్లాబ్ దశలో మరోసారి భవన నిర్మాణ పనులు తుది దశలో మరోసారి మొత్తం మూడుసార్లు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, వాటికి సంబంధించిన ఫొటోలు, ఇచ్చిన అనుమతి, జరుగుతున్న నిర్మాణం తీరు, ఆ రెండింటి మధ్య వ్యత్యాసంపై నివేదికలను ఈఎంఐఎస్ సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్ని రకాల అనుమతులను ఆన్‌లైన్‌లో పెట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు తీసుకున్న అనుమతుల ప్రకారం నిర్మాణాలు జరిగేందుకు వీలుగా ఈ సరికొత్త ఎంఐఎస్ సిస్టమ్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నారు. భవనం పూర్తయ్యేలోపు మూడుసార్లు తనిఖీలు నిర్వహించి ఫొటోలు, డీవియేషన్ సమాచారాన్ని అప్‌లోడ్ చేయని సంబంధిత అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా వేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతి అధికారికి సిస్టమ్‌లో ప్రత్యేకంగా ఓ డ్యాష్ బోర్డును ఏర్పాటుచేసి, రోజువారీగా వారు తనిఖీలు చేయాల్సిన నిర్మాణ అనుమతుల వివరాలను వారికి గుర్తుకొచ్చేలా ఈ విధానాన్ని రూపొందిస్తున్నారు. అంతేగాక, ఈ విధానాన్ని సర్కిల్ స్థాయి టౌన్‌ప్లానింగ్ ఏసీపీ మొదలుకుని కమిషనర్, సిటీ చీఫ్ ప్లానర్, జోనల్ కమిషనర్‌లతో పాటు సాధారణ ప్రజలు సైతం వీక్షించేలా అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. డీవీయేషన్స్ సమాచారాన్ని ఎప్పటికపుడు బహిర్గతం చేయటంతో అటు అనుమతులిచ్చిన అధికారులు, నిర్మాణదారులు సైతం అక్రమాలకు పాల్పడకుండా ఉంటారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.నగరంలోని అన్ని నిర్మాణాలను త్వరలో జీఐఎస్ పరిధిలోకి తీసుకురావాలని కమిషనర్ దాన కిషోర్ యోచిస్తున్నారు. అసెస్‌మెంట్ చేసిన, చేయని ఆస్తులన్నీ కూడా జీఐఎస్ పరిధిలోకి వస్తే ఆస్తి పన్ను వర్తింపు, వసూళ్లలో ఎక్కడా కూడా అక్రమలు చోటుచేసుకునే అవకాశాలు తగ్గవచ్చునని భావిస్తున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల తర్వాత జీఐఎస్‌కు సంబంధించిన టెండర్లను చేపట్టి ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.