శిశువుకి సౌకర్యాలెక్కడ..? (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శిశువుకి సౌకర్యాలెక్కడ..? (గుంటూరు)

గుంటూరు, ఫిబ్రవరి 7 (way2newstv.com):  శ్వాసకోశ సంబంధ వ్యాధులు, బరువు తక్కువగా ఉండటం, నెలలు నిండకుండానే జన్మించడం వంటి రుగ్మతలతో ఉన్న పసి నలుసుల్ని గుంటూరు సర్వజనాసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. గాలిలో దీపాల్లా ఉన్న ఆ పసిప్రాణాల్ని అత్యాధునిక వైద్య సదుపాయాల దన్నుతో అరచేతులడ్డుపెట్టి కాపాడే నిపుణులైన వైద్యులు నిరంతరం పని చేస్తున్నారు. అయితే ప్రాణావసర సేవలకు అవసరమైన ఉపకరణాలు సక్రమంగా అందుబాటులో లేని దుస్థితి వెక్కిరిస్తోంది. ఆ విభాగానికి రూ.కోటి వెచ్చించి 10 వెంటిలేటర్లు కొన్నారు. స్క్రూ ఊడిపోయిందనో, బోల్టు పడిపోయిందనో ఆరింటిని పక్కన పడేశారు. పోనీ అవేవీ పనికిరాని వస్తువులా అంటే.. అదీ కాదు. వాటి విలువ సాక్షాత్తు ప్రాణమే. అవును.. అవి నిత్యం ప్రాణాలు నిలిపేవి. 


శిశువుకి సౌకర్యాలెక్కడ..? (గుంటూరు) 

సర్వజనాసుపత్రిలోని పరికరాలు మరమ్మతులకు గురైతే బాగు చేసేందుకు నియమించిన టెలిమ్యాట్రిక్‌ అండ్‌ బయోమెడికల్‌ సర్వీసెస్‌(టీబీఎస్‌) ప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సకాలంలో స్పందించని వారికి ఏ శిక్ష విధిస్తారు? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కలెక్టరు హెచ్చరించినా వారి పనితీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. గుత్తేదారు సంస్థ నిర్లక్ష్యం పసి ప్రాణాల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది.
సర్వజనాసుపత్రిలో ఏదేని పరికరం, యంత్రం మరమ్మతులకు గురైతే బాధ్యతగా భావిస్తూ మరమ్మతులు చేయించేందుకు టీబీఎస్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయినప్పటికీ వెంటిలేటర్లు వంటి ఎంతో విలువైన పరికరాల మరమ్మతులు చేయడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులు బాగానే అవి పని చేసేలా చూడగలిగారు. ఆ తర్వాత తిరిగి యథావిధి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నాలుగే పని చేస్తున్నాయి. గత మూడు నెలల నుంచి మరమ్మతులకు గురైన ఆరింటిని ఎందుకు బాగు చేయలేకపోతున్నారని వైద్యులు అడిగే ప్రశ్నకు సమాధానమే కరవైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులను కాపాడేందుకు అవసరమైన వెంటిలేటర్లకు మరమ్మతులు చేయకపోవడం క్షమించరాని నేరంగా భావించాలని పలువురు సూచిస్తున్నారు.
ఎన్‌ఐసీయూలో 20 వార్మర్లు పనిచేయడంలేదని వైద్యులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని పరీక్షించిన సాంకేతిక నిపుణులు కొన్నింటికి ప్రోబ్స్‌ పాడయ్యాయని, మరికొన్నింటికి బోల్టులు పోయాయని తేల్చారు. నెలలు గడుస్తున్నా బాగు చేయడంలేదు. పోనీ అవేవీ పనికిరాని వస్తువులా అంటే.. అదీ కాదు. వాటి విలువ సాక్షాత్తు ప్రాణమే. అవును.. అవి నిత్యం ప్రాణాలు నిలిపేవి. చిన్నపిల్లల విభాగంలోని ఎన్‌ఐసీయూలో ఉన్న 57 వార్మర్లలో 37 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన 20 పరికరాలను బాగు చేసేందుకు ఎంత సమయం అవసరమవుతుందని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఆ విభాగంలో నిత్యం 70 నుంచి 80 మంది శిశువులు చికిత్స పొందుతుంటారు. ఆ పరికరాలు పనిచేయనందున కొన్నిసార్లు ఒకేదానిలో ఇద్దరు పసిబిడ్డలను ఉంచి చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. దీనివల్ల ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్‌ వ్యాపించి కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులే హెచ్చరిస్తుండటం గమనార్హం. అయినప్పటికీ వార్మర్ల కొరతతో ఒకేదానిలో ఇద్దరేసి ఉంచి చికిత్స అందించక తప్పడంలేదని వారు తెలుపుతున్నారు.