ఇక మెరుగైన వైద్యం (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక మెరుగైన వైద్యం (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, ఫిబ్రవరి 7 (way2newstv.com):
అన్ని వర్గాల ప్రజలకు అధునాతన వైద్య సేవలు చేరువ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మరో కీలక నిర్ణయం అమలు కాబోతోంది. ఇప్పటి వరకూ అలంకారప్రాయంగా  ఉండే ఆరోగ్య ఉప కేంద్రాలకు అదనపు హంగులు చేకూర్చనున్నారు.వాటిని  ఈ-ఆరోగ్య కేంద్రాలుగా పరిపుష్ఠి కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దశలవారీగా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా ప్రజలకు ఈ-వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ-వైద్యం అమలుకు సన్నాహాలు పూర్తవ్వగా జిల్లాలో కూడా అందుకు తగ్గ కార్యాచరణ కొనసాగుతోంది.


ఇక మెరుగైన వైద్యం (కృష్ణాజిల్లా)

గడచిన కొన్ని సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖ పరంగా ప్రభుత్వం చూపుతున్న చొరవతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. ఎటువంటి అనారోగ్యానికైనా వీటినే ఆశ్రయించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అవసరమైన మౌలిక వసతుల కల్పన, అధునాతన వైద్య సేవలు చేరువ చేయడం, ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా వివిధ రోగ నిర్ధరణ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం వంటి చర్యలు పేద వర్గాలకు చెందిన రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ‌్ర దశలవారీగా మరిన్ని అధునాతన వైద్య సేవలు ప్రజలకు చేరువ చేసే దిశగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెల్‌నెస్‌ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నారు. ‌్ర గ్రామీణ ప్రాంతాలల్లో ఇప్పటి వరకూ తక్షణ వైద్య సేవలకు ఆరోగ్య ఉపకేంద్రాలే దిక్కుగా ఉంటున్నాయి. ఏఎన్‌ఎంల పర్యవేక్షణలో కొనసాగే ఉప కేంద్రాల్లో ఇప్పటి వరకూ అందుతున్న వైద్య సేవలు నామమాత్రమే అన్న విషయం బహిరంగ రహస్యమే.
కేంద్రాల్లో ఉండే ఏఎన్‌ఎంలకు వివిధ రకాల సర్వేల పేరుతో ఎక్కువగా కేంద్రాలకు దూరంగా ఉండే పరిస్థితులున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ వైద్యపరమైన అవసరాల కోసం దూరాభారంగా ఉండే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ-ఉప కేంద్రాలుగా తీర్చిదిద్ది వాటి ద్వారా ప్రాథమిక చికిత్స నుంచి ప్రసవాల వరకూ అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు.
ముందుగా ఆరోగ్య ఉపకేంద్రాల భవనాలను ఆధునికీకరించి, మరుగుదొడ్లు, విద్యుత్తు వంటి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తారు. అంతర్జాల సదుపాయం, ట్యాబ్‌లు సమకూరుస్తారు. కేంద్రాల్లోనే ప్రాథమిక వైద్యం అందిచే దిశగా శిక్షణ పొందిన ఏఎన్‌ఎంలను నియమిస్తారు. గర్భిణుల సంరక్షణ, బాలింతల ఆరోగ్య సేవలు, అంటువ్యాధులపై అవగాహన, దంత సంరక్షణ, కంటి వ్యాధులు. ఇతరత్రా ప్రాథమిక చికిత్సలు అన్ని కేంద్రాల ద్వారానే నిర్వహిస్తారు. టెలీపతి విధానం కూడా అందుబాటులో ఉంటుంది. కేంద్రానికి వచ్చే రోగుల స్థితిగతులను టెలీపతి విధానంలో వైద్యులకు తెలియచేసి, వారి సూచనల మేరకు తక్షణం అవసరమైన మందులు సమకూరుస్తారు. ఈ- ఆరోగ్య కేంద్రాల్లో డ్రగ్‌ వెండింగ్‌ మిషన్‌, టెలి మెడిసిన్‌, మల్టీపారామానిటర్‌, తదితరాలు ఉంటాయి. వైద్యుల సూచనల మేరకు డ్రగ్‌ వెండింగ్‌ మెషిన్‌ ద్వారా దాదాపు 40 రకాల వ్యాధులకు మందులు ఉచితంగా పొందవచ్చు. ఈ- కేంద్రాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం నియమించిన ప్రైవేటు సంస్థలు చూసుకుంటాయి.