గుంటూరు, మార్చి 22, (way2newstv.com)
పార్టీ టికెట్ దక్కడమే కష్టం.. ఒకవేళ దక్కినా గెలుస్తారో లేదో కూడా తెలియదు.. ఒకసారి గెలిచినా రెండోసారికి ప్రజలు ఇంటికే పరిమితం చేస్తారు.. మళ్లీ టికెట్ రావడం.. గెలవడంపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ.. ఇదంతా కూడా ధూళిపాళ్ల కుటుంబానికి వర్తించదు. ఎన్నికల్లో ఓటమే ఎరగని కుటుంబంగా రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించింది. అంతేగాకుండా.. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ఆ కుటుంబం మాత్రం టీడీపీ వెన్నంటే ఉంది. అందుకే కాబోలు పొన్నూరు నియోజకవర్గ ప్రజలు కూడా ధూళిపాళ్ల కుటుంబానికి అంతే అండగా ఉంటున్నారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన ధూళిపాళ్ల నరేంద్ర కూడా అదే ప్రభంజనం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఐదు వరుస విజయాలతో దూకుడుమీదున్న ఆయన డబుల్ హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్నాడు.గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. టీడీపీ ఏర్పడినప్పటి నుంచీ పొన్నూరులో విజయం సాధిస్తూనే ఉంది. ఇక్కడ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి టీడీపీలో కీలకపాత్ర పోషించారు.
నరేంద్ర సెంటిమెంట్ ను దాటేస్తారా
1983, 1985లో గెలిచి 1989లో ఓడిపోయారు. ఆయన మంత్రిగా కూడా పని చేశారు. ఆయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆయన కుమారుడు ధూళిపాళ్ల నరేంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన కూడా 1994నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు. ప్రత్యర్థి ఎవరైనా కానీ.. విజయం మాత్రం ఆయనదే కావడం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన ప్రతీసారి కొత్త ప్రత్యర్థితోనే పోటీ పడ్డారు. ఇలా ఐదుసార్లు కొత్త ప్రత్యర్థులతో పోటీపడిన నరేంద్ర ఈసారి కూడా మరో కొత్త ప్రత్యర్థినే ఢీకొనబోతున్నారు. అదేమిటోగానీ.. ఆయనపై పోటీ చేసిన వారెవరూ రెండోసారి బరిలోకి దిగలేదు.నరేంద్ర ఇప్పటివకు ఎవరెవరితో తలపడ్డారో చూద్దాం.. 1994లో కాంగ్రెస్ అభ్యర్థి తలశిల వెంకట రామయ్యపై.. 1999లో చిట్టినేని ప్రతాప్ బాబుపై, 2004లో మున్నవ రాజకిశోర్‌పై, 2009లో మారుపూడి లీలాధరరావుపై, 2014లో వైసీపీ అభ్యర్థి రావి వెంకటరమణపై విజయం సాధించారు. ఈసారి వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యతో తలపడుతున్నారు. అయితే.. పలుమార్లు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచినా.. పొన్నూరులో మాత్రం నరేంద్ర ఎదురులేని విజయాలను అందుకున్నారు. ఆరోసారి కూడా విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో నరేంద్ర ఉన్నారు.కానీ.. గుంటూరు జిల్లాకు ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. దానిని నరేంద్ర అధిగమిస్తారా.. లేదా అన్నదే ఇక్కడ ట్విస్ట్..! గుంటూరు జిల్లాలో మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివప్రసాదరావు, మాకినేని పెద్దరత్తయ్యలు కూడా ఐదుసార్లు విజయం సాధించి, ఆరోసారి ఓటమిపాలయ్యారు. జిల్లా నేతలకు ఇదొక బ్యాడ్ సెంటిమెంట్‌గా ఉంటోంది. అయితే.. బ్యాడ్‌సెంటిమెంట్ దాటుకుని ధూళిపాళ్ల నరేంద్ర చరిత్ర సృష్టిస్తారా.. లేక చతికిలపడుతారా..? అన్న దానిపై జిల్లాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.