రేపే అధికారిక ప్రకటన... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రేపే అధికారిక ప్రకటన...

అసమ్మతి నేతల టెన్షన్ 
విజయవాడ, మార్చి 14, (way2newstv.com)
పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరికొన్ని రోజలు సాగనుంది. ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులను సైతం అధికారికంగా ప్రకటించక పోవడం గందరగోళానికి దారి తీస్తోంది. క్షేత్ర స్థాయిలో నెలకొన్న ఈ పరిస్థితిఎలా ఉన్నప్పటికి వలసలు, అసమ్మతి నేతల అలకలు కొనసాగుతుండ టంతో టిడిపి,వైసిపి అధినేతలు వేచి చూసే ధోరణే కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 16వ తేది వరకు ఈ ఉత్కంఠ పరిస్థితి తప్పని స్థితి నెలకొంది. టిడిపి.వైసిపిల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు ఆ రోజుకే కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. మరోవైపు 18,19,25 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని, ఆ రోజు నామినేషన్లు వేయాలని అభ్యర్థులు సిద్ధమవు తున్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం నాడు తొలిజాబితా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం సాగింది. దీనికి తగ్గట్టే బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ అభ్యర్థుల జాబితా ఊసే లేకుండా సాగింది. విలేకరులు అడిగినప్పటికీ స్పష్టమైన సమాధానం రాలేదు. గురువారం పొలిట్‌బ్యూరో సమావేశం జరుగుతుందని, ఆ తరువాత కొందరు అభ్యర్థులతో జాబితా వెలువరించే అవకాశం ఉందని టిడిపి నేతలు చెబుతున్నా అది పాక్షికంగానే ఉంటుందని సమాచారం. 


 రేపే అధికారిక ప్రకటన... 

వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 16 వ తేది అభ్యర్థుల వివరాలను ప్రకటించనుండటంతో, అదే రోజు టిడిపి జాబితా కూడా వెలువడనుందని తెలిసింది. ఇడుపులపాయలో వైఎస్‌కు నివాళులర్పించిన అనంతరం అభ్యర్థుల జాబితాను అక్కడే జగన్‌ ప్రకటించనున్నారు. ఆ తరువాత గుంటూరు జిల్లా గురజాల చేరుకుని ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. జనసేన, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబందించిన సమావేశం కూడా ఈ నెల 16వ తేదిన జరగనుంది. ఈ భేటీ తరువాత ఆ పార్టీలు పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. బాబు నివాసం వద్ద ఉద్రిక్తత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసం వద్ధ బుధవారం వేర్వేరు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అడ్డుగా పెట్టిన బారికేడ్లను నెట్టివేశారు. పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అనంతపురానికి చెందిన ఓ కార్యకర్త వైకుంఠం ప్రభాకరచౌదరికి సీటు ఇవ్వొద్దని కోరుతూ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పుఅంటించుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. పూర్తి సెక్యూరిటీలో ఉండే ఆ ప్రాంతానికి పెట్రోలు డబ్బా ఎలావచ్చిందనేది భద్రతను ప్రశ్నార్థకం చేసింది. పోలవరం అభ్యర్థి మొడియం శ్రీనివాసరావుకు సీటివ్వాలని, ఇవ్వొద్దని రెండు గ్రూపుల నాయకులు వాగ్వివాదానికి దిగారు. సిఎం భద్రత కోసం పెట్టిన బారీకేడ్లను పక్కకు విసిరిపారేశారు. నరసరావుపేట సీటు ప్రస్తుత స్పీకర్‌ కోడెలకు ఇవ్వొద్దని నియోజకవర్గ కార్యాలయంలో నేతలు నిరసన చేపట్టారు. రంపచోడవరం సీటు విషయంలోనూ సిఎం ఇంటివద్ద టిడిపి నాయకులు గొడవకు దిగారు. తాజా ఎన్నికల్లో పలువురు టిడిపి నేతలు తమ వారసులను రంగంమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పరిటాల సునీత అనంతపురం జిల్లాలో రెండు సీట్లను కోరారు. దీనికి బాబు తిరస్కరించి రాప్తాడు నియోజకవర్గాన్ని మాత్రమే కేటాయించడంతో ఆమె పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు శ్రీరామ్‌ ఆ నియోజకర్గం నుండి పోటీ చేస్తారని ప్రకటించారు. బుధవారం నాడే శ్రీరామ్‌ ప్రచారం కూడా ప్రారంభమైంది. అయితే, శ్రీరామ్‌ అభ్యర్థిత్వంకు సంబంధించి పరిటాల కుటుంబ సభ్యుల్లోనే విభేదాలు ఉన్నట్లు వార్తలువచ్చాయి. ఈ జిల్లాకే చెందిన జెసి సోదరులిద్దరూ ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. తమ బదులు తమ వారసులు పవన్‌కుమార్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలకు టిక్కెట్లు కేటాయించాలని వారుకోరారు. దీనికి బాబుకూడా అంగీకరించినట్లు తెలిసింది. నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి కూడా అనారోగ్యకారణాలతో ఈ సారి ఎన్నికల బరినుండి తప్పుకుని, తన కుమార్తె సుజలకు స్థానం కేటాయించాలని కోరినట్లు తెలిసింది. కర్నూలుకు చెందిన రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్‌ కూడా తన కుమారుడు భరత్‌కు కర్నూలు శాసనసభ టిక్కెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కెఇ కృష్ణమూర్తి కూడా తన కుమారుడు శ్యామ్‌బాబును బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే కార్యకర్తలకు చెప్పినట్లు తెలిసింది. బొజ్జల గోపాలకష్ణారెడ్డి, మురళీమోహన్‌, అయ్యన్నపాత్రుడు కూడా వారసులను ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. వీరి విజ్ఞఫ్తులపై తుది నిర్ణయం తీసుకున్న తరువాతే అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.