కరీంనగర్, మార్చి 26 (way2newstv.com):
పల్లె వాతావరణంలో ఉన్న గ్రామ పంచాయతీలు కాలనీలుగా మారిపోయాయి. నగర, పురపాలికల పరిధిలోకి చేరడంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక హోదా గుర్తింపు లభించే అవకాశం ఏర్పడింది. జిల్లాలోని పుర, నగరపాలక సంస్థల పరిధిలో చుట్టూ ఉన్న గ్రామాల్లో పట్టణీకరణ పెరిగిపోవడంతో సమీప గ్రామాలన్నీ పురపాలికల్లో విలీనం అయ్యాయి. విలీన గ్రామాలన్నీ ఈ నెల 8 నుంచి పురపాలికల్లో కలుపుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడంతో ఆ గ్రామాలు సమీప డివిజన్ల పరిధిలో కలిసిపోయాయి. ఈ మేరకు ఈనెల 14న రికార్డులు స్వాధీనం చేసుకోవడంతో విలీన ప్రక్రియను పురపాలిక అధికారులు పూర్తి చేశారు. పైగా కరీంనగర్‌లో పంచాయతీ బోర్డుల స్థానంలో నగరపాలక సంస్థ, వార్డు కార్యాలయాలుగా బోర్డులు ఏర్పాటు చేశారు. విలీనమైన గ్రామాల్లో కనీస సౌకర్యాలు మెరుగుపర్చేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి.ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. తెల్లకార్డుదారులు, బీపీఎల్ పరిధిలో ఉన్న వారికి రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వనున్నారు. దీంతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ తీసుకునే వీలుంటుంది. జనాభా ఆధారంగా తాగునీటి ట్యాంకులు నిర్మించడం, నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.న గరంలో, పట్టణాల్లో వార్డుల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పనులు త్వరగా పూర్తి కానున్నా యి. దీంతో ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం ఉండదు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించే వీలు కలుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచవచ్చు.
పల్లెకు వరం (కరీంనగర్)
పారిశుద్ధ్య పనులు ఇక మెరుగుపడనున్నాయి. వార్డుల వారీగా చెత్త సేకరణకు ఇంటింటా రిక్షాలు తిప్పడం, వారానికోసారి వీధుల్లో మురుగుకాల్వలు శుభ్రం చేయడం, ప్రతిరోజు రహదారులు ఊడ్వడం వంటి పనులు చేపడతారు. నగర వీధులకు సమానంగా పారిశుద్ధ్య నిర్వహణపై తనిఖీలు చేసే అవకాశం ఉంటుంది. గ్రామ స్థాయిలో ఉన్న ధరలకు, పురపాలికలతో పోల్చుకుంటే రెట్టింపు మేర డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగావకాశాలు, శిక్షణ కేంద్రాలు, కొత్త, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు కొత్తగా విలీనమైన గ్రామాలకు మూడేళ్ల వరకు ఎలాంటి పన్నుల భారం లేకపోయినప్పటికీ పట్టణాల అభివృద్ధికి పన్నులను క్రమబద్ధీకరించనున్నారు.
జిల్లాలోని మున్సిపాలిటీలకు ఆనుకుని ఉన్న 15 గ్రామాలు విలీనం కావడంతో ఆ గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ప్రస్తుతం మేయర్, ఛైర్మన్, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పనిచేస్తారు. కమిషనర్, మేనేజర్, ఉపకమిషనర్, రెవెన్యూ అధికారి, పట్టణ ప్రణాళిక అధికారి, ఇంజినీరింగ్ అధికారులు, పారిశుద్ధ్య పర్యవేక్షకుడు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు, బిల్‌కలెక్టర్లు వంటి అధికారులు డివిజన్ల వారీగా ఉంటారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం లభిస్తుంది.
పురపాలికల్లో విద్యుత్తును పొదుపుగా వినియోగించుకోవడం కోసం ఆ శాఖ ఉచితంగా ఎల్‌ఈడీ వీధి దీపాలు బిగించనుంది. శివారు కాలనీల్లో సైతం వీధి దీపాలు ఏర్పాటు చేస్తారు. సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఖాళీ స్థలాలను అందంగా తీర్చిదిద్దనున్నారు. గ్రామపంచాయతీల్లో ఉన్న ఖాళీ స్థలాలు స్వాధీనం చేసుకోవడంతో పార్కులను ఉపయోగంలోకి తీసుకువస్తారు. శ్మశాన వాటికలు, చిన్న మార్కెట్లు నెలకొల్పనున్నారు. రహదారి విస్తరణ చేయడం, కచ్చితంగా రోడ్డుకు కొంతమేర స్థలం వదలాల్సి ఉంటుంది. భవన అనుమతులకు పైరవీకారుల చుట్టూ తిరగకుండా లైసెన్స్ సర్వేయర్లతో ఆన్‌లైన్ ద్వారా అనుమతులు తీసుకోవచ్చు.