అక్రమానికే అందలం (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అక్రమానికే అందలం (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, మార్చి 26 (way2newstv.com): రెవెన్యూ అధికారుల పట్టింపులేనితనం ఇసుక అక్రమ వ్యాపారులకు వరంగా మారింది. ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా పెన్‌గంగ నది నుంచి ఇసుక అక్రమ రవాణా వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రతినిత్యం 100కు పైగా ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతున్నా సంబంధిత అధికారులే పట్టించుకోవడం  లేదు.  ఆదిలాబాద్‌, తాంసి, భీంపూర్‌, తలమడుగు మండలాలకు చెందిన కొందరు ట్రాక్టర్‌ యాజమానుల కన్ను భీంపూర్‌, తాంసి మండలాలకు సరిహద్దు గుండా ప్రవహిస్తున్న పెన్‌గంగ నదిపై పడింది. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో నదీలోని నీళ్లు కొద్దికొద్దిగా అడుగంటుకుపోతుండడంతో నదీ పరివాహాక ప్రాంతంలోని తాంసి(కె), గోల్లాఘాట్‌, అంతర్గాం, వడూర్‌ గ్రామాల సమీపల్లో ఇసుక దిబ్బలు బయటపడుతున్నాయి. విలువైన ఇసుకను తరలించేందుకు ట్రాక్టర్‌ యాజమానులు నది వరకు ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేసుకుని గత కొన్ని రోజులుగా పగలంతా ఇసుకను తవ్వి తీసి రాత్రివేళల్లో రవాణా చేస్తున్నారు. 


అక్రమానికే అందలం (ఆదిలాబాద్)

తాంసి, భీంపూర్‌, తలమడుగు మండలాలతో పాటు జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు, సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణానికి సరఫరా చేస్తూ జోరుగా ఇసుక అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.పెన్‌గంగ నదిలో తవ్వి తీసిన ఇసుకను ప్రతినిత్యం 50కిపైగా ట్రాక్టర్లలో తాంసి, తలమడుగు, భీంపూర్‌, ఆదిలాబాద్‌ మండలాలతో జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకను రూ. 1800 నుంచి రూ. 2 వేల వరకు అమ్ముతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి కూడా నయాపైసా రాయల్టీ చెల్లించడం లేదు. ప్రతినిత్యం రూ. వేలల్లో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. స్థానిక రెవెన్యూ, ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతోందని విమర్శలు వినవస్తున్నాయి. ఇసుకను తవ్వి తీయడంతో పెన్‌గంగా నదీ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటుకుపోతున్నాయని పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇసుకను తీయడంతో గుంతలు ఏర్పడి, ప్రమాదకరంగా మారుతున్నాయి. వర్షాకాలం నీళ్లు నిండుగా ఉన్న సమయంలో స్నానానికి వెళ్లిన వారు గుంతలో మునిగిపోయి మృతి చెందుతున్నారు. పశువులు మృతి చెందుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక వ్యాపారాన్ని అడ్డుకోవాలని తాంసి, భీంపూర్‌ మండలాల ప్రజలు కోరుతున్నారు.