కార్పొరేట్ కంపెనీ చేతుల్లోకి అటవీ హక్కులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కార్పొరేట్ కంపెనీ చేతుల్లోకి అటవీ హక్కులు

రాజమండ్రి, మార్చి 6, (way2newstv.com)
కొండ కోనల్లో పుట్టి పెరిగిన ఆదివాసీలకు అటవీ హక్కులు అక్కరకు రాకుండా పోతున్నాయి. అడవి పుత్రుల బతుకులు పరాయి బతుకులుగా మారుతున్నాయి. సహజ సంపద నేపథ్యంలో కొండ కోనలు కార్పొరేట్ కంపెనీల హక్క్భుక్తంలోకి వెళ్తున్నాయి. బాక్సైట్ ఖనిజాన్ని తవ్వుకోడానికి వేలాది ఎకరాలు అటవీ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి ప్రయత్నించిన పాలకులు ఆ గడ్డపై పుట్టిన ఆదివాసీలకు మాత్రం అటవీ హక్కులు కల్పించడంలో విఫలమయ్యారు. రాష్ట్రంలో మొత్తం లక్షా 54 వేల 838 మంది గిరిజనులు అటవీ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటివరకు ప్రభుత్వం 85 వేల మంది వరకు ఆనుమతించి, దాదాపు 69 వేల మందికి రిక్తహస్తాలు చూపించింది.అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006లో అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో 27.39 శాతం గిరిజన జనాభా ఉన్నారు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 22.73 శాతం అటవీ భూములు విస్తరించివున్నాయి. 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, మూడు జాతీయ పార్కులతో సహా 16 రక్షిత ప్రాంతాలు, ఒక పులుల రిజర్వు, సుమారు 8,135 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించివున్నాయి. అటవీ భూములు అధికంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించివున్నాయి.
కార్పొరేట్ కంపెనీ చేతుల్లోకి అటవీ హక్కులు

ఆదివాసీల అటవీ హక్కు గుర్తించడంలో ప్రభుత్వాలు చారిత్రక అన్యాయానికి గురిచేశాయి. గిరిజనులు అటవీ భూములను సాగు భూములుగా మార్చుకుని జీవనం సాగిస్తున్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై చట్టం ప్రకారం వారికే హక్కు పత్రాలు ఇవ్వాల్సివుంది. అయితే నేటికీ లక్షలాది మందికి హక్కు పత్రాలు అందలేదు. గిరిజనులు తమకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.అనంతపురం, చిత్తూరు, కడప, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, శ్రీశైలం, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వన సంరక్షణ సమితులతో సహా కమ్యూనిటీ అటవీ హక్కులు ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తూ మొత్తం 6 లక్షల 52 వేల ఎకరాలకు 4,493 దరఖాస్తులు వచ్చాయి. సబ్ డివిజన్ కమిటీ నుంచి 2,654 దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీకి పంపించగా అందులో 1,319 దరఖాస్తులకు అనుమతి లభించింది. అదే విధంగా మొత్తం 6 లక్షల 52 వేల 780 ఎకరాల భూమిపై కమ్యూనిటీ హక్కు అడిగితే 4 లక్షల 34 వేల 355 ఎకరాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న వ్యక్తిగత పోడు భూములపై వ్యక్తిగత హక్కుల కోసం రాష్టవ్య్రాప్తంగా 3 లక్షల 36 వేల 577 ఎకరాలకు సంబంధించి లక్షా 50 వేల 345 మంది దరఖాస్తుచేశారు.వీటిని గ్రామ సభ పరిశీలించి సబ్ డివిజన్ కమిటీకి లక్షా 23 వేల 814 దరఖాస్తులను పంపించింది. సబ్ డివిజన్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ నివేదిక మేరకు 83 వేల 874 మందికి అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 36 వేల 577 ఎకరాల పోడు భూములపై తమకు హక్కు కావాలని ఆదివాసీలు కోరితే ప్రభుత్వం లక్షా 98 వేల 641 ఎకరాలకు అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ప్రజల ఆందోళన ఫలితంగా అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006లో వచ్చింది. ఈ చట్టం మేరకు ఆదివాసీలకు అటవీ భూములపై, ఇతర సాంప్రదాయక అటవీ నివాసితులకు, వ్యక్తిగత (పోడు భూమి), ప్రజల ఉమ్మడి (కమ్యూనిటీ) అటవీ హక్కులతో పాటు అటవీ వనరుల హక్కులు కూడా చట్టం గుర్తిస్తుంది. విశాఖ జిల్లా చింతపల్లి, జెర్రెల అటవీ ప్రాంతాల్లో బాక్సైట్ ఖనిజాల తవ్వకాల కోసం 1212 హెక్టార్ల భూమిని ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థకు 2015లో అప్పగించారు. ఈ బాక్సైట్ నిక్షేపాలున్న అటవీ ప్రాంతాల్లో గిరిజనుల పోడు భూమి హక్కులు, కమ్యూనిటీ, అటవీ వనరుల హక్కులు ఇంకా గుర్తించలేదు. అటవీ భూముల హక్కులకు సంబంధించిన అటవీ భూముల కొలతల సమయంలో, అలాగే హక్కు నిర్ధారణ ప్రక్రియలో అటవీ శాఖ అధికారుల అవాంఛనీయ జోక్యంతో పోడు భూమి హక్కును ఆదివాసీలు పొందలేకపోతున్నారు. చట్టపరంగా ఏర్పర్చిన జిల్లా స్థాయి, సబ్ డివిజన్ స్థాయి సమావేశాల తీర్మానాలకు అనుగుణంగా అటవీ శాఖాధికారులు సంతకాలు చేయకుండా కాలయాపన చేస్తూ ఆదివాసీలు పోడుభూమి హక్కు పొందే విషయంలో ఆటంకం కల్పిస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశగా దృష్టిసారించి, తమకు పోడు భూములపై హక్కులు కల్పించాలని ఆదివాసీలు కోరుతున్నారు.