గుంటూరు, మార్చి 23 (way2newstv.com)
సీనియర్ రాజకీయ నేత, మంత్రి పత్తిపాటి పుల్లారావుతో ఈ ఎన్నికల్లో రాజకీయాల్లోకి కొత్త అయిన విడుదల రజని తలపడుతున్నారు. చిలుకలూరిపేట నుంచి మరోసారి తెలుగుదేశం పార్టీ తరపున పత్తిపాటి పుల్లారావు పోటీ చేయనుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విడుదల రజని పేరు దాదాపుగా ఖరారైంది. ఎన్ఆర్ఐ అయిన ఆమె రాజకీయాలకు కొత్త. ఆరు నెలల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె వెంటనే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. అప్పటి నుంచే ఆమె నియోజకవర్గంలో పెద్దఎత్తున కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఈసారి పత్తిపాటికి బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.పారిశ్రామికవేత్త అయిన పత్తిపాటి పుల్లారావు 1999 నుంచి చిలుకలూరిపేటలో వరుసగా నాలుగుసార్లు పోటీ చేసి మూడుసార్లు విజయం సాధించి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ పై ఆయన సుమారు 10 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ క్యాబినెట్ లో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి కూడా కేటాయించారు.
చిలకలూరిపేటలో టఫ్ ఫైట్
దీంతో నియోజకవర్గంలో గతంలో బాగానే అభివృద్ధి పనులు చేయించారు. ఇది ఆయనకు చాలా మేలు చేసే అవకాశం ఉంది. ఇరవై ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండటంతో ప్రతీ గ్రామంలో ఆయనకు పట్టుంది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది. అయితే, ఆది నుంచీ టీడీపీ వైపు ఎక్కువగా నిలిచే బీసీలు ఈసారి ఎటువైపు ఉంటారనేది దానిపై చిలుకలూరిపేట గెలుపొటములు ఆధారపడి ఉంటాయి.కమ్మ, రెడ్డి, కాపు సామాజకవర్గ ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నా ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లే కీలకం. వైసీపీ అభ్యర్థి విడుదల రజనీ బీసీ వర్గానికి చెందిన నాయకురాలు. దీంతో ఆమె వైపు బీసీలు ఎక్కువగా మొగ్గు చూపితే ఆమె విజయం సాధించే అవకాశం ఉంది. మహిళ కావడం, నియోజకవర్గంలో తక్కువ కాలంలోనే బాగా పట్టు సంపాదించడం, సీనియర్ వైసీపీ నేత మర్రి రాజశేఖర్ ను, ఆయన వర్గాన్ని కలుపుకొని వెళుతుండటం ఆమెకు మేలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగానూ పత్తిపాటి పుల్లారావును ఎదుర్కునే సత్తా ఆమెకు ఉందంటున్నారు. ఆరు నెలలుగా ఆమె ఎన్నికల ప్రచారంలాగా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. మహిళా నాయకురాలు కావడం కూడా సానుకూలంగా కనిపిస్తోంది. మొదట్లో పత్తిపాటికి రజనీ పోటీ ఇవ్వగలదా అని అనుమానించిన వారే ఇప్పుడు పత్తిపాటి పుల్లారావును ఆమె ఎదుర్కోగలదని అంటున్నారు. మూడుసార్లు సులువుగా విజయం సాధించిన పత్తిపాటి పుల్లారావుకు ఈసారి వైసీపీ నుంచి టఫ్ ఫైట్ తప్పేలా లేదు.