అల్లాడుతున్న పల్నాడు (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అల్లాడుతున్న పల్నాడు (గుంటూరు)

గుంటూరు, మార్చి 18 (way2newstv.com):  
జిల్లాలోని పల్నాడు పల్లెలు మంచినీటికి అల్లాడుతున్నాయి. రక్షిత పథకాలకు ప్రజాప్రతినిధులు నిధులైతే తెచ్చారుకానీ గుత్తేదారులను తేలేకపోయారు. దీంతో చాలా వాటికి గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎన్నిసార్లు టెండర్లకు పిలిచినా ప్రయోజనం లేకపోతోంది. ఫలితంగా ట్యాంకర్ల ద్వారా తప్ప పథకాల ద్వారా జనాలకు నీరందే అవకాశాలే లేకుండా పోయాయి. పక్షం రోజుల కిందట పరిస్థితిని గమనించగా భూగర్భ జలాలు 63 మీటర్ల లోతుకు పోవడంతో తాజాగా 51 గ్రామాలకు ట్యాంకర్లను తిప్పడం ఆరంభించారు. ఈ ఏడాది వర్షపాతం చాలా తక్కువ కాగా పెథాయి తుపానువల్ల కూడా ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదు. ఏ మండలాల్లో క‘న్నీటి’ కష్టాలు ఎక్కువగా ఉంటాయో వాటిల్లోనే అనేక పనులు నిలిచిపోయాయి. రూ.కోట్లతో కొన్ని పథకాలకు టెండర్లు పిలిచారు. ఒప్పందాలూ పూర్తయ్యాయి. ఇంతవరకూ పనులే ప్రారంభంకాలేదు. నూజండ్ల మండలంలో రూర్బన్‌ పథకం కింద టి.అన్నవరం పథకానికి రూ.33 లక్షలు, పాత ఉప్పలపాడుకు రూ.12, నూజండ్లకు రూ.39, ఐనవోలుకు రూ.9, కె.ఉప్పలపాడుకు రూ.1.23, గుర్రపునాయుడుపాలేనికి రూ.27.3, ముక్కెళ్లపాడు పథకానికి రూ.24 లక్షల చొప్పున నిధులున్నాయి. వీటన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలిచారు. ఈ గ్రామాల్లో చేయాల్సిన అత్యధిక పనులు అంతర్గత పైపులైన్ల నిర్మాణాలే. మిగతావి గమనిస్తే... నరసరావుపేట మండలం పమిడిపాడు పథకానికి రూ.27 లక్షలుండగా చెరువులు తవ్వారు. మోటార్లు బిగించారు. విద్యుత్తు సరఫరా కూడా తీసుకున్నారు. కానీ పైపులైన్లు వేయలేదు. 



అల్లాడుతున్న పల్నాడు (గుంటూరు)

ఇప్పటికి రెండుసార్లు టెండర్లకు పిలిచారు. ఇదే మండలం ఇస్సపాలెం పథకానికి రూ.28 లక్షలుండగా రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు రాలేదు. బొల్లాపల్లి మండలం నిమ్మలసుబ్బయ్యకుంట తండాకు రూ.17 లక్షలు, బోడిపాలెం తండాకు నాబార్డు నిధులు రూ.30 లక్షలుండగా రెండుసార్లు టెండర్లు పిలిచినా పాడేవారే లేరు. వెల్దుర్తి మండలం గుడిపాడులో ఉపరితల జలభాండాగారం నిర్మాణానికి రూ.20 లక్షలుంటే రూ.6 లక్షల మేర పనులు చేసి ఆపేశారు. మిగిలిన నిధులు వెచ్చించేందుకు ఇప్పటికి రెండుసార్లు టెండర్లు పిలిచారు. గురజాల మండలం మాడుగలలో పైపులైన్ల నిర్మాణానికి ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.50 లక్షలుండగా పనులు చేయడానికి రెండుసార్లు టెండర్లు పిలిచారు. మాదినపాడులో రక్షిత పథకానికి సంబంధించి రెండు పనులు పెండింగ్‌ ఉన్నాయి. వీటికి రూ.50 లక్షలుండగా రెండుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదార్లు ఎవరూ ముందుకు రావడం లేదు.
వినుకొండ మండలం నడిగడ్డ పథకానికి రూ.2.5 కోట్లు, చిలకలూరిపేట మండలం పసుమర్రు పథకానికి రూ.6 కోట్లు, నూజండ్ల మండలం మృత్యుంజయపురం పథకానికి రూ.3 కోట్లు మంజూరుకాగా టెండర్లు ఖరారయ్యాయి. ఒప్పందాలూ పూర్తయినా పనులు మాత్రం మొదలు కాలేదు. నాదెండ్ల మండలం సాతులూరు పథకానికి రూ.4 కోట్లు మంజూరుకాగా అంచనాలు మాత్రం తయారు చేశారు. నరసరావుపేట మండలం ఉప్పలపాడుకు గతంలో నిధులు మంజూరైనా పనులు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో అవి రద్దయ్యాయి.
పల్నాడు ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.600 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ పథకం మంజూరైంది. అయితే మొత్తం 17 చోట్ల రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటిన్నింటి వద్ద పైపులైన్ల నిర్మాణానికి అనుమతులు కావాలని కోరారు. ఇవే కాకుండా రహదారులు, భవనాలు, జలవనరులు, అటవీ, జాతీయ రహదారుల శాఖల నుంచి అనుమతులు రావాల్సివుంది. అవన్నీ వచ్చి పనులు ప్రారంభమయ్యేదెప్పుడా అనేది ఎదురుచూపులుగానే మిగిలిపోనున్నాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో తమ దాహార్తిని అధికార యంత్రాంగం ఏ విధంగా తీరుస్తుందోనని పల్లెవాసులు ఆందోళన చెందుతున్నారు.