అటకెక్కిన ఆదరణ (అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అటకెక్కిన ఆదరణ (అనంతపురం)

అనంతపురం, మార్చి 18 (way2newstv.com): 
ఆధునిక పరికరాలు పొందేందుకు లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు కేటాయించిన పరికరాలు ఇవ్వాలని కోరుతూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వృత్తిదారులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆదరణ-2 పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 90 శాతం రాయితీతో ఆధునిక పరికరాలు ప్రభుత్వం ఇస్తోంది. అయితే కొన్ని శాఖల అధికారుల సమన్వయ లోపంతో లబ్ధిదారులకు సకాలంలో పంపిణీ చేయడం లేదు. నియోజకవర్గ కేంద్రాల్లోని గోదాముల్లో పరికరాలను నిల్వ చేశారు. లబ్ధిదారులు వ్యయప్రయాసలకు గురికాకుండా ప్రైవేట్‌ వాహనాలను అద్దెకు తీసుకుని, వాటిలో పరికరాలను ఇళ్ల వద్దకే వెళ్లి అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు మండలానికి రూ.50 వేలు చొప్పున నిధులను కేటాయించింది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఆచరణకు నోచుకోవడం లేదు. లబ్ధిదారులు గోదాము చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.


అటకెక్కిన ఆదరణ (అనంతపురం)

ఆదరణ-2 పథకం కింద జిల్లాలో 48,980 మంది లబ్ధిదారులు ఆధునిక పరికరాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం 39,336 మందికి పరికరాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించింది. ఇప్పటి వరకూ 30,117 యనిట్లకు సంబంధించిన వివిధ రకాల పనిముట్లను గోదాములకు చేర్చారు. 5,700 మంది లబ్ధిదారులు ఇంకా డీడీలు తీసి అందజేయాల్సి ఉంది. యనిట్‌ విలువలో పదిశాతం లబ్ధిదారు చెల్లిస్తే.. తొంబైశాతం ప్రభుత్వం రాయితీగా కల్పిస్తోంది. ఆ మొత్తాన్ని సంబంధిత కంపెనీలకు ప్రభుత్వమే చెల్లిస్తోంది.
 ఆదరణ-2 పథకం కింద వాషింగ్‌ మిషిన్‌, ఎలక్ట్రీషియన్‌ సామగ్రి, ఇస్త్రీపెట్టె, పాల క్యాన్లు, కుట్టుమిషిన్లు, డ్రిల్లింగ్‌ మిషిన్‌, చేనేతమగ్గాలు, కట్టర్‌ వంటి ఆధునిక పరికరాలను ప్రభుత్వం అందజేస్తోంది. వివిధ కంపెనీలు సరఫరా చేయాల్సి ఉండగా.. కొన్ని కంపెనీలు సకాలంలో అందజేశాయి. మరికొన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో లబ్ధిదారుడికి ఒకేసారి ఇవ్వలేని పరిస్థితి. కొన్ని గోదాముల వద్ద చేయి తడిపితేనే.. పరికరాలు పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
గోదాములకు ఎన్ని పరికరాలు వస్తున్నాయి. ఎంతమందికి పంపిణీ చేశామన్న వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఏఏ రకాల పనిముట్లు రావాల్సిఉంది. వాటిని తెప్పించేందుకు కార్పొరేషన్‌ అధికారులు చొరవ చూపాలి. ఈ ప్రక్రియను పట్టణాల్లో మున్సిపల్‌, మండలాల్లో మండల పరిషత్‌ అధికారులకు అప్పగించారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.