మండిపోతోంది (అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మండిపోతోంది (అనంతపురం)

అనంతపురం, మార్చి 11 (way2newstv.com): 
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి చిన్నపిల్లల వార్డు వేడెక్కుతోంది. ఆస్పత్రి భవన సముదాయంలో ఆఖరు అంతస్తులో ఈ విభాగాన్ని నెలకొల్పారు. దీంతో నేరుగా ఎండ పడుతోంది. పైకప్పు వేడెక్కి.. ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. పిల్లల ఐసీయూలో మరీ దారుణం. ఇక్కడ ఏసీలు ఉన్నా నిష్ప్రయోజనమే. రెండేళ్ల కిందటి దాకా ఈ వార్డు పాత భవన సముదాయంలో కింద ఉండేది. రూ.5.53 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కొత్త అదనపు భవన సముదాయంలోకి 2017 మే 12న మార్చారు. రూ.కోట్లు వెచ్చించినా కనీస సదుపాయాలు లేవు. ప్రతి గదిలోనూ విధిగా నీటి సింకు ఏర్పాటు చేయాల్సి ఉండేది. ఇవేవీ లేవు. అంతేకాదు... పైకప్పు కింద పాల్స్‌ రూప్‌(వేడి నియంత్రణ) ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదే పిల్లల పాలిట శాపంలా మారింది. జిల్లాలో ఎండలు అప్పుడే మండుతున్నాయి. వేసవి వచ్చిందంటే పిల్లలకు నరకమే. పలు రకాల జబ్బులతో ఆస్పత్రికి వస్తే... ఎండ వేడిమి, ఉక్కపోతకు అదనపు జబ్బులు ప్రబలుతున్నాయి. మెరుగైన చికిత్స అందిస్తున్నా జబ్బులు త్వరగా నయం కావడం లేదు. దీనికి పైకప్పు నుంచి వెలువడే వేడినే మూలం. వాంతులు,బేదులు (డయేరియా)తో వచ్చే రోగుల పరిస్థితి మరీ దయనీయం.


 మండిపోతోంది (అనంతపురం)

ఆస్పత్రి చిన్నపిల్లల వార్డులో రోజూ సగటున 120 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ఈ వార్డులో ఆరు విభాగాలు ఉన్నాయి. ఐసీయూ కూడా సాధారణ వార్డులాగే ఉంది. ఈ విభాగం పెద్దగా ఉంది. కానీ, నాలుగు ఏసీలను మాత్రమే ఏర్పాటు చేశారు. ఇందులో రెండు పని చేయడం లేదు. అంతేకాదు... ప్రతి విభాగానికి మధ్యలో గోడ ఉండాలి. రెండో అంతస్తులో ఈ విభాగం ఉండటంతో పిల్లలు కిందకు తొంగిచూసే ప్రమాదం ఉంది. అందుకే రక్షణ గ్రిల్‌ ఉండాలని ఏర్పాటు చేయాలని భావించారు. ఇదేదీ కార్యరూపం దాల్చలేదు. పైనుంచి పిల్లలు ప్రమాదవశాత్తు పడితే అంతే. ఇలా... అనేక మౌలిక వసతులు కల్పించేందుకు ఏడాదిన్నర కిందట రూ.13 లక్షలతో అంచనాలు తయారీ చేశారు. ఆస్పత్రి అధికారులు మాత్రం మంజూరీ చేసేందుకు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో అంతుచిక్కలేదు. ఏదైనా జరగరాని ఘటన జరిగితేనే స్పందిస్తారేమోనన్న విమర్శలు లేకపోలేదు. ప్రస్తుతం వేసవి మొదలైంది. ఈ వార్డులో చికిత్స పొందే పిల్లలు నరకం చూస్తున్నారు.