అనుబంధంపై అంతులేని నిర్లక్ష్యం (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనుబంధంపై అంతులేని నిర్లక్ష్యం (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, మార్చి 11 (way2newstv.com): 
జిల్లాలో మాంగనీసు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. దీనితో పాటు బొగ్గు, సున్నపురాయి, తెల్లసుద్ద, క్వార్జ్‌, లేటరైట్‌ వంటి ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఖనిజ వనరులు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకునే అవకాశం లేదు. పర్యావరణ అనుమతులు లభించకపోవడం, అనుబంధ పరిశ్రమలు లేక మాంగనీసును వెలికితీయడంలో సరైన ప్రోత్సాహం లేక మాంగనీసు క్వారీలు మూతపడుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం గతంలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలు అమలుకాకపోవడంతో పారిశ్రామిక వేత్తలకు నిరాశే మిగిలింది. కేంద్రం ప్రభుత్వం పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఖనిజాలు వెలికితీయడంలో నిబంధనలను కఠినతరం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లాలో మాత్రమే మాంగనీసు నిక్షేపాలు ఉన్నాయి. జిల్లాలోని ఆదిలాబాద్‌, జైనథ్‌, తాంసి మండలాలలో ప్రస్తుతం మాంగనీసును వెలికి తీస్తున్నారు. జిల్లాలో మొత్తం 16 లీజులు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతులు ఉన్నా.. రెండు లీజులలో మాత్రమే మాంగనీసును వెలికితీస్తున్నారు. ఈసీ క్లియరెన్స్‌, అటవీ, పర్యావరణ అనుమతులు వంటి కారణాల వల్ల మిగతా చోట్ల క్వారీలు మూతపడ్డాయి. జిల్లాలో 72 పెద్ద తరహా క్వారీలుండగా.. వాటితో పాటు మరో 75 వరకు చిన్న తరహావి ఉన్నాయి.


 అనుబంధంపై అంతులేని నిర్లక్ష్యం (ఆదిలాబాద్)

ఆదిలాబాద్‌ మండలంలోని జందాపూర్‌, చాంద(టి), కుంభఝరీ, జైనథ్‌ మండలంలోని గూడ, భోరజ్‌, పిప్పల్‌గాం, పార్డి(కె), మసాల(బి), కాంఠ-మెడిగూడ, తాంసి మండలంలోని పిప్పల్‌కోటి, ఘోట్కూరి, ఘోల్లఘాట్‌, నిపాని, దబ్బకుచ్చి గ్రామాలలో మాంగనీస్‌ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. మాంగనీసును వెలికి తీసేందుకు జందాపూర్‌ గ్రామ శివారులో ఆదిత్య మినరల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జీఎస్‌ మినరల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బాలజీ మినరల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు పని చేస్తున్నాయి. వివిధ గ్రామాల్లో ఉన్న క్వారీలలో వెలికి తీసిన మంగనీసును జందాపూర్‌ గ్రామంలో కంపెనీలు ఏర్పాటు చేసుకున్న నిల్వ ప్రాంతంలో ఉంచి, అనంతరం లారీల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ధ్రువపత్రాల ద్వారా పర్యావరణ, అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసుకుని జిల్లా పాలనాధికారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపాలి. అన్నింటినీ పరిశీలించి కేంద్రం అనుమతి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడం, పారిశ్రామిక వేత్తలు సరైన ధ్రువపత్రాలు ప్రభుత్వానికి సమర్పించకపోవడంతో జిల్లాలో ఉన్నా 16 మాంగనీసు లీజులలో సుమారు 14 లీజులు అనుమతులు రాక రెండేళ్లుగా మూతబడి ఉన్నాయి. ప్రస్తుతం మూడు క్వారీలు మాత్రమే పని చేస్తున్నాయి. ఇటీవల బాలాజీ ఎలక్రోస్‌ సంస్థకు పర్యావరణ అనుమతులు లభించినట్లు అధికారులు చెబుతున్నారు.
నాణ్యత కలిగిన మాంగనీసు మన జిల్లాలోనే విస్తారంగా లభ్యమవుతుంది. కానీ వాటిని వినియోగించే అనుబంధ పరిశ్రమలేవీ అందుబాటులో లేవు. స్థానికంగా ఫెర్రోఅల్లాయిస్‌ పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నాలేవీ ముమ్మరం చేయడం లేదు. అనుబంధ పరిశ్రమల ఏర్పాటు లేకపోవడం వల్ల విలువైన మాంగనీస్‌ లోహాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి తక్కువ ధరకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏటా సుమారు 23 వేల మెట్రిక్‌ టన్నుల మంగనీసు పక్క రాష్ట్రాలకు తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. మహారాష్ట్రకు మాంగనీసు తరలించడం వల్ల ప్రభుత్వానికి టన్నుకు కేవలం రూ.191 మాత్రమే రవాణా పన్ను చెల్లిస్తున్నారు. ముడిసరకు విస్తృతంగా లభిస్తున్న ఆదిలాబాద్‌ పరిసర ప్రాంతాల్లో అనుబంధ పరిశ్రమలు వస్తే జిల్లాకు భారీగా ఆదాయం సమకూరనుంది. మాంగనీసును వెలికి తీసేందుకు పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. మాంగనీసు కంపెనీల ద్వారా ఇప్పటికే సుమారు 300 మంది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో మరో 350 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వెలికితీసిన మాంగనీసు ముడి సరకును జిల్లాలో శుద్ధి చేసే కర్మాగారాలు లేనందున పారిశ్రామికవేత్తలు దూరభారం అయినప్పటికీ లారీల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలోని యావత్‌మాల్‌, నాగ్‌పూర్‌, కేరళ, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, గోవా, గుజరాత్‌, హైదరాబాద్‌లోని చేగుంటలో ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలు ఉన్నాయి. మన జిల్లాలో అనుబంధ పరిశ్రమలు లేకపోవడంతో వెలికితీసిన మాంగనీసును ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. గతంలో ఆదిలాబాద్‌ మండలంలో ఇలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఓ సంస్థ తీవ్రంగా ప్రయత్నించింది. అందుకు అవసరమైన షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే విద్యుత్తు సదుపాయం లేకపోవడం, ప్రభుత్వం నుంచి రాయితీలు రాకపోవడం వల్ల పరిశ్రమ ఏర్పాటు మధ్యలోనే ఆగిపోయింది.