ఆరు బయట ఉంచినా అంతే..
వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..పాటించకుంటే ఫైన్
మార్గదర్శకాలు విడుదల చేసిన జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్ మార్చ్ 22 (way2newstv.com)
వేసవి కాలం.. రహదారుల పక్కన ఎక్కడ చూసినా పుచ్చకాయలు.. ఖర్బూజ.. ఆరెంజ్.. తదితర పండ్ల కుప్పలు కనిపిస్తాయి. పుచ్చకాయలు, ఖర్బూజ, ఇతర పండ్లను ముక్కలుగా కోసి విక్రయిస్తుంటారు. ఇవి మన ఆరోగ్యానికి శ్రేయస్కరమా..? అంటే కనీస జాగ్రత్తలు తీసుకోకుండా విక్రయించే పండ్లు తినడం వల్ల అనారో గ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని జీహెచ్‌ఎంసీ హెచ్చరిస్తోంది. సురక్షిత ఆహారం- ప్రమాణాల చట్టం ప్రకారం పండ్ల విక్రయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీధి, తోపుడు బండ్ల, ఇతర వ్యాపారులకు సూచిస్తోంది. ఈ మేరకు పండ్ల విక్రయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను జీహెచ్‌ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పేరిట విడుదల చేశారు. నగరంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదలతో రోడ్ల పక్కన విక్రయించే పండ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. పుచ్చకాయ ముక్కలు, చెరుకు, ఇతర పండ్ల రసాల్లో ఐస్ వినియోగిస్తుంటారు.
ఐస్‌లో పండ్లు.. ఆరోగ్యానికి ప్రమాదం
దీంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని జీహెచ్‌ఎంసీలోని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీధి వ్యాపారులకు జాగ్రత్తలు సూచించారు. వీటిని పాటించని పక్షంలో జీహెచ్‌ఎంసీ యాక్ట్ 1955, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, 2011 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు ప్రారంభించి నిబంధనలు పాటించని వ్యాపారులకు రూ. 100 నుంచి రూ.5000 వరకు జరిమానా విధిస్తామని, అయినా వైఖరి మారకుంటే సీజ్ చేస్తామని ఓ ఉన్నతాధికారి హెచ్చరించారు. చెరుకు, పండ్ల రసాలు విక్రయించే వారూ ఐస్ వాడొద్దని అధికారులు సూచిస్తున్నారు
పండ్ల విక్రయానికి మార్గదర్శకాలు
పుచ్చకాయలు, ఖర్బూజలు రోడ్ల పక్కన కుప్ప గా పోసి, యాపిల్, దానిమ్మ, సంత్ర (ఆరెంజ్), ద్రాక్ష వంటి పండ్లను బండ్లపై ఉంచి విక్రయిస్తుంటారు. ఎండలో ఉండడంవల్ల పండ్లు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. బహిరంగ ప్రదేశంలో పండ్లను ఉంచకుండా సురక్షిత ప్రాంతంలో ఉంచాలి.
పూర్తిగా పండిన (పక్వానికి వచ్చిన) పండ్లను మాత్రమే విక్రయించాలి.
కార్బైడ్, ఇతర రసాయనాలు వినియోగించి కృత్రిమంగా పండించే ప్రయత్నం చేయవద్దు.
రోడ్ల పక్కన పుచ్చకాయలు, ఖర్బూజలు, పనస, పైనాపిల్ వంటి పండ్లను ముక్కలుగా కోసి అమ్ముతారు. కోసే ముందు శుభ్రంగా కడగాలి.
కోసేందుకు వినియోగించే కత్తి, ఇతర టూల్స్‌కు తుప్పు ఉండకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు టూల్స్‌ను వేడి నీళ్లలో కడగాలి.
కోసిన ముక్కలను ఐస్‌లో నిల్వ చేయకూడదు.
కోసిన ముక్కలను విక్రయించే వ్యాపారులు చేతులకు గ్లౌస్‌లు ధరించాలి.
కోసిన మొక్కలపై దుమ్ము, ధూళి పడకుండా కప్పి ఉండేలా చూసుకోవాలి.
వ్యర్ధాలను రోడ్ల పక్కన, నాలాలు, ఖాళీ స్థలాల్లో వేయకుండా... సమీపంలోని డస్ట్ బిన్లలో వేయాలి.